ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయన్న అంశంపై తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఓ పెద్ద పత్రిక సర్వే నిర్వహించింది. అది కూడా ఆషామాషీ సర్వే కాదు. మొత్త 175 నియోజక వర్గాల్లోనూ క్షుణ్నంగా సర్వే చేశారు. ప్రజాభిప్రాయాలను క్రోడీకరించి చూశాక టిడిపి అధిష్ఠషానంతో పాటు అనుకూల మీడియా కూడా షాక్ తిందని సమాచారం. కొద్ది నెలల క్రితం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని ప్రకటించుకున్నారు. టిడిపి ఒంటరిగా పోటీచేసినా అధికారంలోకి రావడం ఖాయమని పార్టీలో సీనియర్ల సమక్షంలోనే ధీమా వ్యక్తం చేశారు కూడా. జగన్ మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం బటన్ నొక్కి రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారని టిడిపి తో పాటు ఆ పార్టీకి అండగా ఉండే పత్రికలూ టీవీ ఛానెళ్లు కూడా ప్రచారం చేశాయి. అయితే తాజా సర్వేలో టిడిపి నేతలకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిశాయట. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను వెక్కిరించినా వ్యతిరేకంగా మాట్లాడినా వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు టిడిపిని ఆమడ దూరం పెట్టడం ఖాయమని సర్వేలో తేలింది. అందుకే సర్వే చేసిన వారు ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడద్దని సూచించినట్లు భోగట్టా. ఆ తర్వాతి నుంచే చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామన్న దుష్ప్రచారం జరుగుతోందని తాము కూడా ఈపథకాలను కొనసాగిస్తామని చెప్పడం మొదలు పెట్టారు. అంత వరకు ఇవే పథకాలతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారని విషం చిమ్మిన టిడిపి నాయకులు సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని పదేపదే చాటి చెప్పుకోడానికి సర్వేనే కారణమంటున్నారు.
ఇక అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోన్న చంద్రబాబు నాయుడు అనుకూల మీడియాకు మరో షాకింగ్ న్యూస్. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడ్డం అంటే ఆ ప్రాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే అని సర్వేలో మెజారిటీ ప్రజలు అభిప్రాయ పడ్డారట. అందుకే మొన్నటి వరకు అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతు పలికిన టిడిపి నాయకులు వారి పాదయాత్ర నిలిపివేసిన తర్వాతి నుంచి అమరావతి పాటను తగ్గించారు. అన్ని ప్రాంతాలూ తమకి ముఖ్యమే అని చెప్పుకోడానికి రాయలసీమ, ఉత్తరాంధ్రలను టిడిపియే అభివృద్ది చేసిందని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. అంతే కాదు టిడిపి, జనసేన విడి విడిగా పోటీ చేస్తే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అన్న నినాదానికి దగ్గరగా ఘన విజయం సాధించడం ఖాయమని సర్వేలో తేలిందట. ఆ వాస్తవం వినగానే చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలు పట్టాయంటున్నారు. అప్పట్నుంచే పవన్ కళ్యాణ్ వెంట మళ్లీ పడ్డం మొదలు పెట్టారు.
ఈ సర్వే ఫలితం వచ్చిన సమయంలోనే విశాఖ లో పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా ర్యాలీ చేయడానికి పోలీసులు అభ్యంతరం చెప్పడం జనసేన కార్యకర్తలు మంత్రులపై రాళ్లు కర్రలతో దాడి చేయడం జరిగాయి. జనసేనతో పొత్తు కుదుర్చుకోడానికి ఇదే సరియైన అదను అనుకున్న చంద్రబాబు అమాంతం విజయవాడలో పవన్ కళ్యాణ్ బస చేస్తోన్న హోటల్ కు వెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత ఇప్పటం గ్రామంలో చంద్రబాబు సూచనల మేరకు జనసేనాని ప్రభుత్వంపై విరుచుకు పడ్డట్లు పాలక పక్ష నేతలు ఆరోపించారు. మొత్తానికి అక్కడి నుండి తాజాగా చంద్రబాబు నివాసానికే పవన్ కళ్యాణ్ వెళ్లి కలవడం మూడు గంటలకు పైగా భేటీ కావడం జరిగాయి. వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసే ముందుకు వెళ్తాయన్న సంకేతాన్ని అటు రెండు పార్టీల శ్రేణులకు అభిమానులకూ తెలియ జెప్పడంతో పాటు పవన్ మిత్ర పక్షమైన బిజెపికి కూడా ఓ సంకేతాన్ని అందించారు.
ఎందుకంటే జనసేన-బిజెపిలు రెండింటినీ కలుపుకుపోయి ఎన్నికల బరిలో దిగాలన్నది చంద్రబాబు ప్లాన్. అయితే ఆ ఆప్షన్ కి బిజెపి నుండి రెడ్ సిగ్నల్ వచ్చింది. సాక్ష్యాత్తూ నరేంద్ర మోదీయే తనతో భేటీకి వచ్చిన పవన్ తో టిడిపిని దూరం పెట్టాలని చెప్పడం పవన్ కీ చంద్రబాబుకీ జీర్ణం కాలేదంటారు. అందుకే బిజెపిపై ఒత్తిడి తెచ్చేందుకే జనసేన-టిడిపిల పొత్తు గురించి చర్చ జరిగేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. అయితే టిడిపి అనుకూల పత్రిక నిర్వహించిన సర్వేలో మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. టిడిపి-జనసేన కలిసి బరిలో దిగినా కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని తేలిందట. టిడిపి-జనసేనలకు కొద్ది శాతం ఓట్లు ఒకటి రెండు సీట్లు పెరిగితే పెరగచ్చు కానీ 2024లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని అంచనా వేశారట. అయితే ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది కాబట్టి టిడిపి లోని లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలు రావచ్చునని సూచించారట. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఐటీని తానే కనిపెట్టినట్లు ప్రచారం చేసుకోవడం హైదరాబాద్ కట్టింది తానే సెల్ ఫోన్ల విప్లవానికి తానే కారణం అంటూ ప్రసంగించడం వల్ల టిడిపికి వచ్చే లాభం ఏదీ లేదని సర్వేలో తేలింది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను ఆకట్టుకోవడంలో టిడిపి ఘోరంగా విఫలమవుతోందని తేలింది. అదే సమయంలో సామాజిక ఇంజనీరింగ్ పేరిట జగన్ మోహన్ రెడ్డి అన్ని పదవులు, కాంట్రాక్టుల్లోనూ ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ నిమ్న వర్గాల ఛాంపియన్ గా పేరు గడించారని దాన్ని అధిగమించడానికి చంద్రబాబు నాయుడు అండ్ కో కొత్త వ్యూహాలు ప్రణాళికలతో ముందుకు రావాలే తప్ప ఎప్పుడో ఎనభైలలో చేసిన రాజకీయాలే ఇప్పుడూ చేస్తామంటే జనం ఓటేసే పరిస్థితి లేదన్నది సర్వే సారాంశం. ఈసర్వే తర్వాత చంద్రబాబు నాయుడి వ్యవహార శైలిలో కొద్దిగా మార్పు కనిపించిందంటున్నారు రాజకీయ పండితులు.
ఎంత సేపూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడం పాలక పక్షంలోని చిన్న చిన్న అసంతృప్తులను చూసి సంతోష పడ్డానికే బాబు అండ్ కో పరిమితం అవుతున్నారన్నది వారి వాదన. తమ పార్టీలో తారాస్థాయికి చేరిన అసమ్మతి అసంతృప్తులను సద్దుమణిగేలా చేయడానికి చర్యలు తీసుకోకుండా పాలక పక్షం పని అయిపోయిందని జబ్బలు చరుచుకోవడం వల్ల టిడిపికి దమ్మిడీ ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.