ఇంతకీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గొప్పదా? కాదా?

By KTV Telugu On 13 January, 2023
image

ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పటి నుండి దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ అవార్డు గొప్పదనంపై చర్చ జరుగుతోంది. కొంత మంది గోల్డెన్ గ్లోబ్ కన్నా మన నంది అవార్డు చాలా విలువైనదని తేల్చేస్తున్నారు. మరికొంత మంది అది అస్కార్‌తో సమానమని వాదిస్తున్నారు. అయితే ఇది అమెరికాలో ప్రకటించారు కాబట్టి అంతర్జాతీయ అవార్డు అని వాదిస్తున్నారు. ఎవరి వాదనలు వారివి. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఎవరూ పట్టించుకోరా ? ఇండియాలోనే ప్రాధాన్యం ఇస్తున్నారా ? నాటు నాటు పాటకు ఓవర్ రేటింగ్ ఇచ్చేస్తున్నారా.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌తో పాటు బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది. కానీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ అవార్డు సాధించింది. ఈ పాట ప్రముఖ పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్, రిహనా, లేడీ గాగా సాంగ్స్‌ను అధిగమించి మరి గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు కైవసం చేసుకుంది. ఈ అవార్డుల ఫంక్షన్‌కు వారు కూడా వచ్చారు. అంటే ఈ అవార్డులను వారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే. ఈ అవార్డులను ఎంపిక చేసేది 105 మంది హాలీవుడ్ సినీ జర్నలిస్టుల జ్యూరీ. అవార్డులను ఎంపిక చేసే వారి మైండ్‌లో ఆ సింగర్ల స్థానం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. వారికి అసలు కీరవాణి అనే పేరు కూడా తెలిసి ఉండదు. కానీ వారికి పాట నచ్చింది. ఎంపిక చేశారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన తర్వాత దేశం మొత్తం పులకరించింది. ప్రధానమంత్రి మోదీ కూడా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ రెస్పాండ్ అయ్యారు. అసలు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు విలువ ఏముందని ఎందుకింత రచ్చ చేస్తున్నారని అనే వాళ్లూ ఉంటారు ఉన్నారు కూడా. అదీ తెలుగులో కూడా ఉన్నారు. ఇతర చోట్ల కూడా ఉన్నారు. అయితే గోల్డెన్ గ్లోబ్‌కు అంత సీన్ లేకపోతే ప్రపంచవ్యాప్తగా ఎందుకు ప్రయారిటీ లభిస్తుంది. ఆస్కార్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకూ అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రయారిటీ ఉంటుంది. ఆ విషయం ప్రపంచ సినిమా మీద అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుస్తుంది. ఈ అవార్డులకు అంత విలువ లేకపోతే స్పీల్ బర్గ్ లాంటి వారు ఎందుకు వస్తారు. అవార్డులు ఎందుకు తీసుకుంటారు.

గతంలో ఆర్ట్ సినిమాలకే అవార్డులు వచ్చేవి. ఆర్ట్ సినిమాలంటే మన లోపాల్ని మనం ఎత్తి చూపించుకోవడం వాటిని అంతర్జాతీయంగా ప్రదర్శించి అవార్డులు ఆశించడం. కానీ ఇ్పపుడు ఆ ఆర్ట్ మారిపోయింది. మనం కూడా హాలీవుడ్ స్థాయి కమర్షియల్ సినిమాలకు వెళ్తున్నామని మేకర్లు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సాధించిన ఫీట్‌తో ఇండియన్ సినిమాలు కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా ఇంగ్లిష్ ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సాధించిన వారంతా ఆస్కార్ సాధిస్తారని లేదు కానీ చాన్సులు ఉన్నాయి. ఆస్కార్ అకాడామీ సభ్యులు ఓటింగ్ చేసే టప్పుడు ఖచ్చితంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సాధించిన వారిని దృష్టిలో పెట్టుకుంటారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు ఖచ్చితంగా హాట్ ఫేవరేట్ అనుకోవాలి.

ఇలాంటి అవార్డులు అంతర్జాతీయంగా సాధించాలంటే మంచి సినిమా తీసి కూర్చుంటే చాలదు. అంతకు మించి పబ్లిసిటీ చేసుకోవాలి. తమ సినిమాను గొప్పగా తీరిదిద్దడం.. ప్రజల ముందు ఉంచడం మాత్రమే కాదు అంతే అద్భుతంగా ప్రపంచ వేదిక ముందు ప్రమోట్ చేసుకున్నారు. ఇంత పర్ ఫెక్ట్ ప్లానింగ్ అందరికీ రాదు. ఎంతో సమయం కేటాయించాలి. అంతకు మించిన వ్యూహాత్మక అడుగులు పడాలి. ప్రపంచ వేదిక ముందు ఏ మాత్రం అనుభవం లేకపోయినా అద్భుతంగా ప్రమోట్ చేసుకున్నారు. తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసుకున్నారు. ఈ విషయంలోనూ వారిని అభినందించాల్సిందే.