తండ్రి సంపాదించి పెడితే కొడుకులు దర్జాగా అనుభవిస్తారు. తండ్రి చనిపోయాక ఆయన చేసిన అప్పులు చెల్లించమని అడిగితే అప్పు చేసింది మా నాన్న అయితే నేనెందుకు కడతాను అని ఎదురుతిరుగుతారు. తండ్రిని నమ్మి అప్పు ఇచ్చిన వ్యక్తులను నట్టేట ముంచుతారు. ఇక నుంచి ఇలా తప్పించుకోవడం సాధ్యం కాదు. తండ్రి ఆస్తులను అనుభవించడమే కాదు ఆయన చేసిన అప్పులను తీర్చడానికి నిరాకరించే కొడుకులకు షాకిచ్చేలా కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం మరణించిన తండ్రి అప్పులను ఆయన బాధ్యతలను తీర్చాల్సిన బాధ్యత కొడుకుదేనని తేల్చి తెలిపింది.
భారమప్ప అనే వ్యక్తి వ్యాపారం, కుటుంబ అవసరాల నిమిత్తం 2003లో ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ. 2.60 లక్షలు రూ.2 శాతం వడ్డీతో అప్పు తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రామిసరీ నోటు రాసుకున్నారు. అయితే ఆ అప్పును తీర్చకుండానే భారమప్ప మరణించాడు.
దీంతో తన అప్పును తీర్చాలని ప్రసాద్ భారమప్ప కొడుకు దినేశ్ ను అడిగితే 2005లో రూ. 10 వేలు చెల్లించాడు. ఆ తర్వాత పలు దఫాలుగా చెక్కులు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. దీంతో ప్రసాద్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఐసీడీఎస్ లిమిటెడ్ వర్సెస్ బీనా షబీర్ అండ్ అన్ఆర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు ప్రస్తావించింది. తండ్రి చేసిన అప్పును కొడుకు తీర్చాల్సిందేనని తీర్పును వెలవరించింది.
గతంలో మద్రాస్ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పే ఇచ్చింది. చెన్నైలోని సైదాపేటలో ఒక వ్యక్తి ఇంట్లో పనిచేస్తూ మరణించిన ఓ కార్మికుడి కుటుంబానికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని ఆ వ్యక్తి తనయుడు తీర్చాలని తీర్పునిచ్చింది. సదరు కార్మికుడు మరణించిన 17 ఏళ్ల తర్వాత హైకోర్టు ప్రస్తుతం ఈ తీర్పునివ్వడం గమనార్హం.