జీవో రూల్డ్‌ అవుట్‌.. సర్కారు నిర్ణయానికి దెబ్బే

By KTV Telugu On 13 January, 2023
image

 

నెల్లూరుజిల్లాలో చంద్రబాబు ప్రచార ఆరాటం ఎనిమిది ప్రాణాలు తీసింది. తోపులాటతో ఈ దారుణం జరిగింది. ఆ సంఘటన మరిచిపోకముందే గుంటూరులో మరో కార్యక్రమం ముగ్గురు మహిళల ఉసురుపోసుకుంది. దీంతో రోడ్లపై సభలు నిర్వహించకుండా ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. అయినా తగ్గేదేలే అంటూ చంద్రబాబు తిరుగుతూనే ఉన్నారు. మీటింగ్‌లు పెట్టడం తప్పుకాదుగానీ సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ఒక్క తెలుగుదేశం అనే కాదు ప్రతీ రాజకీయపార్టీ నైతిక బాధ్యత ఇది. రెండు దుర్ఘటనల తర్వాత ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరయినా. ఇలాంటివి కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో న్యాయస్థానంలో నిలవలేదు. కేవలం విపక్షపార్టీలను అడ్డుకోడానికే వైసీపీ ప్రభుత్వం జీవోనెంబర్‌-1 తీసుకొచ్చిందని హైకోర్టు అభిప్రాయపడింది. జీవో చెల్లదని ఒక్క మాటలో తేల్చేయలేదు ధర్మాసనం. ఈ జీవోని చీల్చిచెండాడేసింది.

ప్రభుత్వ చర్య దురుద్దేశపూరితమన్న అభిప్రాయానికి వచ్చింది. బ్రిటీష్‌ ప్రభుత్వం ఈ తరహా జీవోలు ఇచ్చుంటే స్వాతంత్ర్య ఉద్యమం జరిగేదా అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి జీవో తీసుకురాలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌ విచారణకు రాకుండా తెరవెనుక ఏం జరిగిందో కూడా తమకు తెలుసంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. వచ్చేది ఎన్నికల సీజన్‌. ఈ సమయంలో సభలు, రోడ్‌షోలు వద్దంటే అది కచ్చితంగా రాజకీయవివాదమై కూర్చుంటుంది. బహిరంగసభలు, రోడ్‌షోలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కూడా అందుకే చర్చనీయాంశమైంది. పోలీసులు అధికారయంత్రాంగం ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగే సభలు సమావేశాలను ఎక్కడికక్కడ నియంత్రించవచ్చు. హద్దులు దాటకుండా చూడొచ్చు. కానీ జీవో తీసుకొచ్చి ఇలా భంగపడాల్సిన అవసరంలేదు.

అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర కూడా కూడళ్లు, ఇరుకుసందుల్లో జరిగింది. అయితే అదృష్టవశాత్తూ అప్పుడు ఎలాంటి దుర్ఘటనలు జరగలేదు. రాజకీయపక్షాల స్వేచ్ఛను హరించేందుకే జీవో తెచ్చారన్న వాదనను హైకోర్టు తీర్పు బలపరిచినట్లయింది.ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తోందనే అపనిందను చేజేతులా ఆహ్వానించినట్లయింది. నిషేధం విధించలేదని ఏజీ వాదించినా ఫలితం లేకపోయింది. అసలు ఇలాంటి జీవోలు చట్టం ముందు నిలుస్తాయో లేదో ముందే చర్చించుకుంటే ఇంతదూరం వచ్చేదే కాదేమో.