గంగా విలాస్‌ క్రూజ్‌.. 2024 మార్చి వరకు బుకింగ్ ఫుల్

By KTV Telugu On 14 January, 2023
image

ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే అతిపెద్ద రివర్‌ క్రూజ్‌ గంగా విలాస్ టూర్‌ శుక్రవారం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ క్రూజ్‌ను ప్రారంభించారు. ఈ రివర్‌ క్రూజ్ టూర్‌ వారణాసి లో మొదలై దిబ్రూగఢ్ లో ముగుస్తుంది. కోల్‌కతాకు చెందిన అంటారా సంస్థ లగ్జరీ రివర్ క్రూజ్‌ ఆపరేట్ చేస్తోంది. ఇండియాలోని ఐదు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల మీదుగా ఈ యాత్ర 51 రోజుల పాటు సాగుతుంది.
మొత్తం 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్రూజ్‌ బంగ్లాదేశ్‌లో 1100 కిలోమీటర్లు కవర్‌ చేస్తుంది. 50 టూరిస్టు స్పాట్స్‌ కు తీసుకెళ్తుంది. ఈ క్రూజ్‌లో వెళ్లే పర్యాటకులు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, జాతీయ ఉద్యానవనాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, పాట్నా, గౌహతి, కోల్‌కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరాలు కవర్ అవుతాయి. ఇందులో మూడు డెక్‌లు, 18 లగ్జరీ సూట్‌లు ఉంటాయి. ఇందులో 36 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు.

40సీటర్ మల్టీ కుజిన్ రెస్టారెంట్, మోడర్న్ స్పా, లైవ్ మ్యూజిక్, 40 క్రూ మెంబర్స్ ఉంటారు. 62 మీటర్ల పొడవున్న ఈ నౌకలో కాలుష్య రహిత వ్యవస్థలు, నాయిస్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటుంది. అంతా బాగుంది కానీ టూర్ ప్యాకేజీ ధర చూస్తే కళ్లు తిరుగుతాయి. టూర్ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ.12.6 లక్షలు. ధర ఎక్కువే అయినా టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. తొలి ప్రయాణంలో క్రూయిజ్ మొత్తం విదేశీయులతోనే నిండిపోయిందని సంస్థ సీఈవో రాజ్ సింగ్ చెప్పారు. మొదటి ట్రిప్పు టికెట్లు మొత్తం స్విట్జర్లాండ్ పర్యాటకులు బుక్‌ చేసుకున్నారని 2024 మార్చి వరకు టికెట్లు బుక్ అయ్యాయని ఆయన వివరించారు. ప్రయాణంలో తమ అతిథులకు శాఖాహార భోజనం పెడతామని రాజ్ సింగ్ చెప్పారు. మాంసాహార భోజనం, ఆల్కహాల్ కు క్రూయిజ్ లో అనుమతి లేదని రాజ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ క్రూజ్ లో ప్రయాణించాలని అనుకుంటే అంతారా లక్జరీ క్రూజ్ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అయితే 2024 ఏప్రిల్ తర్వాతే టికెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.