కేశినేని నానిది ఏ పార్టీ? 2019లో ఆయన బెజవాడ ఎంపీగా టీడీపీనుంచేగా గెలిచింది. ఎందుకొస్తోందో డౌటనేగా? ఆయన పార్టీ మారలేదు. టీడీపీలోనే ఉన్నారు. కానీ ఉన్నా లేనట్టే ఉన్నారు. తనకు పొగబెడుతున్నవారిమీద ఫైర్ అవుతున్నారు. ఆయనకేదో ఎజెండా ఉంది. కానీ అది మాత్రం బయటపడటంలేదు. తమ్ముడితో మొదలైన విభేదాలు ఇంటిగడప దాటాయి. మిగిలిన నేతల్నీ తాకుతున్నాయి. తనమీదికి తమ్ముడు చిన్నినే పార్టీ ఉసిగొల్పుతోందని అనుమానిస్తున్న టీడీపీ ఎంపీ ఛాన్సు దొరికినప్పుడల్లా ఘాటుగా స్పందిస్తున్నారు.
ముసుగులో గుద్దులాటేం లేదు. డైరెక్ట్ వార్నింగే.
బెజవాడ టీడీపీలో పరిణామాలై ఎంపీ కేశినేని నాని కన్నెర్ర చేశారు. నందిగామలో మీడియాతో సొంత తమ్ముడు చిన్నిపై నేరుగా విమర్శలు గుప్పించారు. అక్కడితోనే ఆగలేదాయన. టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలకు కూడా పరోక్షంగా హెచ్చరికలు చేశారు. కేశినేని చిన్ని టీడీపీలో యాక్టివ్ అవుతున్నారు. నానిని వ్యతిరేకించేవారు చిన్నిని ఎగదోస్తున్నారు. దీనిపైనే స్పందించారు కేశినేని నాని. ఒకవేళ పార్టీ చిన్నికి టికెట్ ఇస్తే చచ్చినా మద్దతు ఇవ్వనని మొహమాటం లేకుండా చెప్పేశారు. పోనీ తమ్ముడితో గొడవలున్నాయి కాబట్టి అంత మాటన్నారని అనుకోవచ్చు. కానీ తమ్ముడు చిన్నితో పాటు టీడీపీలోని మిగిలిన ముఖ్యనేతల్ని కూడా వదిలిపెట్టనన్నట్లు మాట్లాడటం చూస్తుంటే బెజవాడ టీడీపీలో విభేదాలు శృతిమించినట్లే కనిపిస్తోంది. చిన్నినే కాదు టీడీపీలో ఉన్న మరో ముగ్గురు నేతలకు కూడా టికెట్లు ఇస్తే తాను పనిచేయనని కుండబద్దలు కొడుతున్నారు ఎంపీ కేశినేని నాని.
చీటర్లు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లు, సెక్స్ వర్కర్లు, కాల్ మనీ గాళ్ళకు టికెట్లిస్తే తాను మద్దతిచ్చే ప్రసక్తేలేదంటున్నారు. తనకు క్యారెక్టర్ ఉందని రాజకీయాల్లో ఎవరినీ మోసం చేయడానికి రాలేదంటున్నారు. ఇంతకీ ఆయన ఇన్నేసి మాటలందరి ఎవరినో కాదు. బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై ఆయన ఆక్రోశం ఇలా బయటపడింది. ఎన్నికల్లో దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ లాంటి ఇంటర్నేషనల్ 420గాళ్లు కూడా పోటీ చేయొచ్చంటూనే అలాంటివాళ్లందరికీ తానెందుకు మద్దతు ఇవ్వాలన్నది కేశినేని ప్రశ్న. టీడీపీలో ప్రక్షాళన జరగాలని ఆయన కోరుకుంటున్నారు. అంటే ఆయన వ్యతిరేకించేవారెవరికీ పార్టీ అవకాశం ఇవ్వొద్దంటున్నారన్నమాట. ఈసారి వైసీపీని గద్దెదించాలని టీడీపీ ఉబలాటపడుతుంటే సైకిల్పార్టీ తమ్ముళ్లు వాళ్లలో వాళ్లే ఇలా తన్నుకుంటున్నారు.