అంతన్నారు ఇంతన్నారు కానీ భారత్ రాష్ట్ర సమితిని కేసీఆర్ అంచనాలకు తగ్గట్లుగా కాదు కదా. అంచనాల్లో పది శాతానికి తగ్గట్లుగా కూడా పార్టీ నేతల్ని రెడీ చేయలేకపోతున్నారు. పార్టీ ప్రకటనకు ముందే చాలా కాలం నుంచి జాతీయ పార్టీ పెట్టడానికి కేసీఆర్ సన్నాహాలు చేసుకున్నారు. కీలకమైన రాష్ట్రాల్లో ముందుగానే పార్టీ ఇంచార్జుల్ని ఖరారు చేసుకుంటారని ఓ రేంజ్లో పార్టీ ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ జరిగింది మాత్రం వేరు. పార్టీ పేరు మార్చారు. ఈసీ అంగీకరించింది. అధికారికంగా పార్టీ మారింది. కానీ అతి కష్టం మీద రెండు రాష్ట్రాల ఇంచార్జుల్ని ఖరారు చేశారు. వాటిలో ఒకటి ఏపీ రెండు ఒడిషా.
భారత రాష్ట్ర సమితికి ఇతర రాష్ట్రాల్లో చీఫ్‌లను నియమించడానికి కేసీఆర్ చేస్తున్న కసరత్తు చివరికి ప్రజల్లో పలుకుబడి లేని నాయకుల దగ్గర ఆగుతోంది. ఏపీలో ఎవరూ దొరకనట్లుగా ప్రధాన పార్టీల తరపున పోటీ చేసిన ప్రతీ సారి ఓడిపోయిన తోట చంద్రశేఖర్ కు చాన్సిచ్చారు. అంతకు మించిన నేతను ఆకర్షించలేకపోయారు. నిజానికి కేసీఆర్ ఏపీ నుంచి చాలా మంది పెద్ద నేతలు తనతో టచ్‌లో ఉన్నారని ప్రచారం చేసుకున్నారు. కానీ తీరా చూస్తే తోట చంద్రశేఖర్ తేలారు. ఇప్పుడు ఒడిషాకు ఒడిషాకు గిరిధర్ గమాంగ్‌ను అనే సీనియర్ నేతకు బీఆర్ఎస్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయన సాంకేతికంగా ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఎప్పుడో కాడి దించేశారు. ఒడిషా సంప్రదాయ కళాకారుడైన ఆయన ప్రదర్శనలు ఇస్తూ సమయం గడపుతున్నారు. ఆయన వయసు ఎనభై దగ్గరకు వచ్చింది.
గిరిధర్ గమాంగ్ పలుమార్పు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. 1999లో ఆరేడు నెలల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఎంపీగా ఉన్న సమయంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా వాజ్ పేయి ఉండేవారు. అప్పుడు జరిగిన విశ్వాస పరీక్షలో సీఎంగా ఉన్నప్పటికీ ఎంపీ పదవికి రాజీనామా చేయకపోవడంతో వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇది నైతిక విరుద్ధమన్న ప్రచారం జరిగింది. అప్పట్లో బలాబలాలు చాలా క్లిష్టంగా ఉండటంతో చివరికి ఒక్క ఓటు తేడాతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఈ కారణంగా ఎన్నికలు వచ్చాయి. అయితే అప్పటి నుండి ఆయన మరోసారి ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఆ తరవాత ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా దూరమయ్యారు. ప్రస్తుతం వయసు కారణంగా గిరిధర్ గమాంగ్ యాక్టివ్ గా ఉండలేకపోయారు. ఆయన తన రాజకీయ వారసుడిగా చెబుతున్న కుమారుడు శిశిర్ గమాంగ్ రాజకీయ భవిష్యత్ ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలోనూ ప్రస్తుతానికి ఆయనకు ప్రాధాన్యత లేదు. అందుకే కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ కి తెలంగాణ చీఫ్ గా ఉండాలనే ఆఫర్ ఇచ్చారు. అయితే గమాంగ్ వల్ల బీఆర్ఎస్ కు ఎలాంటి లాభం ఉండదని రాజకీయంగా అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమైపోతుంది.
కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తెలంగాణలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటికి రెండు రాష్ట్రాల ఇంచార్జుల్ని ఖరారు చేశారు. అది కూడా పక్క పక్క రాష్ట్రాల్లోనే. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాల్లో ఏ ఒక్క నేతనూ ఆకర్షించలేకపోయారు. కనీసం తోట చంద్రశేఖర్ లా నాలుగు పార్టీల నుంచి నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నాయకులను కూడా ఆకర్షించలేకపోయారు. అయితే ఇలా రిటైరైన నాయకుల్ని తీసుకొచ్చి బాధ్యతలిస్తే బీఆర్ఎస ఇమేజ్ మొదటికే తేలిపోతుందని ఆ పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. రాజకీయాలతో ఇప్పటి వరకూ సంబంధం లేకపోయినా ప్రజల్లో ఓ మాదిరి గుర్తింపు ఉన్న వారినైనా రాష్ట్రాలకు ఇంచార్జులుగా ఎంపిక చేసుకుని ఉంటే కాస్తయినా బీఆర్ఎస్ గురించి ఎక్కువ ప్రచారం జరగడానికి అవకాశం ఉండేది. కానీ ఎంపిక చేసిన రెండు రాష్ట్రాల్లో చీఫ్‌లు ఎందుకు కొరగానివారన్న అభిప్రాయం బలపడటంతో ఇతర రాష్ట్రాల్లో ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి కూడా సన్నగిల్లి పోతోంది.
కర్ణాటకకు ప్రకాష్ రాజ్ ను చీఫ్ గా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఎందుకో ఆగిపోయారు. బహుశా జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నందున ఆ పని చేయలేకపోతున్నట్లుగా భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సీనియర్ నేతలు అసలు దొరకడం లేదు. కేసీఆర్ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా కాస్తంతా క్రేజ్ రావాలంటే యువ నేతలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇదే వ్యూహం పాటిస్తేనే ముందు ముందు బీఆర్ఎస్కు కాస్తంత క్రేజ్ వస్తుంది. లేకపోతే రిటైరైన నాయకుల పునరావాస కేంద్రంగా అందరూ ఓ అంచనాకు వచ్చేస్తారు. ఈ విషయంలో కేసీఆర్ మరింత కసరత్తు చేయాల్సి ఉందనేది రాజకీయవర్గాల నిశ్చితాభిప్రాయం.