త్వరలో వారాహి మీద ఎపీలో ఎన్నికల ప్రచారం

By KTV Telugu On 17 January, 2023
image

మరో ఏడాదిన్నరలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రత్యేకంగా ఒక ప్రచార వాహనాన్ని తయారు చేయించారు. దానికి వారాహి అని పేరు పెట్టారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఎన్నికల సమరంలోకి దూకేముందుగా వారాహికి తన ఇష్టదైవం అయిన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించాలనుకుంటున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఈ వాహనానికి ఈ నెల 24న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో పూజలు జరిపించనున్నారు.

జనసేన పార్టీ విడదుల చేసిన ప్రకటన ప్రకారం పవన్ కళ్యాణ్ జనవరి 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శిస్తారు. వారాహి వాహనానికి సంప్రదాయ పూజ జరిపిస్తారు.
2009లో ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరగ్గా, కొండగట్టు అంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడ్డానని పవన్ కళ్యాణ్ నమ్మకం. అందుకే తాను తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచే ప్రారంభించడాన్ని ఆయన శుభసూచకంగా భావిస్తారు. ఇప్పుడు తన ప్రచార వాహనం వారాహిని కూడా ఇక్కడ నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ జనసేనకు చెందిన ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు.ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర ను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించినట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆయన 32 నారసింహ క్షేత్రాల సందర్శిస్తారు. మొదట ధర్మపురిలోని శ్రీలక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు చేస్తారు. ఆ తరువాత మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.