బీఆర్ఎస్ లో ఆ 20 మంది ఎవరు

By KTV Telugu On 17 January, 2023
image

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందినప్పటికీ ఆ పార్టీ పట్ల తెలంగాణ ప్రజల్లో పూర్తి విశ్వాసం లేదు. పార్టీ వల్ల చెడ్డపేరు వచ్చిందో లేక స్వయం కృతాపరాథమో తెలియదు కానీ కొందరికి మొండి చేయి చూపించాల్సిన అనివార్యత కనిపిస్తోంది. నిజానికి సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్ కొంత కాలం క్రితం అట్టహాసంగా ప్రకటించారు. అప్పుడు వారంతా బీఆర్ఎస్ లో అంకితభావంగా పనిచేస్తారని ఆయన ఆశించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కొంత మంది పట్ల నియోజకవర్గం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలే అంగీకరిస్తున్నారు. కొంతమందిని మార్గక తప్పదని అలా జరిగితే 100 స్థానాలకు పైగా గెలవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాల లెక్కన చూస్తే కొన్ని చోట్ల బీజేపీ మరికొన్ని చోట్ల కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్నాయి ఆ రెండు పార్టీలు తమ కార్యకర్తల బలాన్ని పెంచుకుంటున్నాయి. అదే టైమ్ లో అక్కడ బీఆర్ఎస్ వీకైపోతోంది. ఉమ్మడి వరంగల్, ఉమ్మ డి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పరిస్థితి బాగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన చోట ఇప్పుడు పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. దానితో అధికార పార్టీలో గ్రూపులు రెడీ అయ్యాయి. ముందుకు వెనక్కి లాగుడు అవుతోందని ప్రగతి భవన్ వర్గాలు టెన్షన్ పడిపోతున్నాయి. కొల్హాపూరు నుంచి పాలేరు వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్టేషన్ ఘన్ పూర్లో రాజకీయం మరో విధంగా ఉంది.

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్ల జనంలో అసంతృప్తి బాగా పెరిగిదంటున్నారు. ఆయనకు బదులుగా ఎవరైనా బీసీ నాయకుడికి టికెట్ ఇస్తే గెలిపించుకోవడం సులభమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారట. అలాగే హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తన బలాన్ని పెంచుకోలేకపోతున్నారు. కార్యకర్తలను ప్రభావితం చేయలేకపోతున్నారు. పైగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ పాగా వేసి తాము గెలిచి చూపిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. ఉత్తమ్ మైండ్ గేమ్ కు సైదిరెడ్డి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని కేసీఆర్ టెన్షన్ పడిపోతున్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఈసారి రాజయ్య, కడియం శ్రీహరి కాకుండా వేరెవరికైనా టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

పౌరసత్వ వివాదం నుంచి బయట పడని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జనంలో ఉండేందుకు అసలు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. ఆయన్ను దూరం పెట్టడమే మంచిదన్న ఆలోచన పార్టీ పెద్దల్లో కనిపిస్తోంది. ఆందోల్ ఎమ్మెల్యే అయిన మాజీ జర్నలిస్టు క్రాంతి కిరణ్ తీరుపై కూడా అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ నేత డీకే అరుణ దూసుకుపోతుంటే పార్టీ ఎమ్మెల్యేలు మీన మేషాలు లెక్కిస్తున్నారని కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ఆ జిల్లాలో సగం మందిని మార్చివేసిన ఆశ్చర్య పడాల్సిన పనిలేదని టాక్. మరో పక్క కొంతమంది మంత్రులపై కూడా గులాబీ దళపతి అసహనంగా ఉన్నారు. వారంతా సొంత పనులు చేసుకుంటూ పార్టీ పనులపై దృష్టి పెట్టడం లేదని రిపోర్టులు అందాయి.

గ్రేటర్ పరిసరాలు పార్టీ అధినేతకు శిరోభారంగా మారాయి. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో నలుగురు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి ఆరోపణలు చేసి పార్టీ పరువును బజారుకీడ్చారు. దానితో అటు మల్లారెడ్డిని ఇటు ఆ నలుగురిని కొనసాగించాలా వద్దా ఆన్న ఆలోచనలో కేసీఆర్ పడిపోయారు. మరో పక్క కొందరికి వీఆర్ఎస్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. అందులో సబితా రెడ్డి లాంటి వాళ్లు ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి.