వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోనని అంటూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు నాల్కల ధోరణి పాటిస్తున్నారని టీడీపీ అగ్రనాయకత్వం అనుమానిస్తోంది. మీరు కోరుకంటే సీఎం అవుతానని ప్రజలనుద్దేశించి పవన్ డైలాగులు వదలడం ప్రధాన ప్రతిపక్షానికి ఇబ్బందిగా మారాయి. పవన్ క్లారిటీ లేకుండా మాట్లాడుతూ రెండు పార్టీల కార్యకర్తలను ద్వితీయ శ్రేణి నాయకులను అయోమయంలోకి నెట్టేస్తున్నారని తెలుగుదేశం భావిస్తోంది దానితో తమదైన శైలిలో ఇటు పవన్ కళ్యాణ్ కు చిన్న జెర్క్ తో పాటు అధికార వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడయ్యారు.
నారావారిపల్లిలో కుటుంబ సంక్రాంతి వేడుకల సందర్భంగా చంద్రబాబు కూడా ఒక పవర్ ఫుల్ డైలాగ్ వదిలారు. టీడీపీ ఏం పాపం చేసుకుందీ ప్రజలకు ఎన్నో చేశాం మేము కూడా 175 సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు మీడియా ముందు ప్రకటించారు. ఏపీలో ఉన్న అన్ని సీట్లు గెలిచేందుకు నాయకులు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పైగా ఇంతవరకు తన సున్నితత్వం చూశారని ఇకపై కఠినత్వాన్ని చూస్తారని చంద్రబాబు హెచ్చరించారు. ఆ మాటలు ఎవరెవరిని ఉద్దేశించి అన్నారో వాళ్లే అర్థం చేసుకుంటారని టీడీపీ నేతలు నర్మగర్భ వివరణ ఇస్తున్నారు.
చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం లేదు. పొత్తులో టీడీపీనే మేజర్ పార్టనర్ అని అనడం లేదు. పైగా బీజేపీని రోడ్ మ్యాప్ అడిగిన పవన్ కళ్యాణ్ టీడీపీ విషయంలో కూడా అదే ధోరణిని పాటిస్తున్నారు. పోనీ సీట్ల విషయంలో క్లారిటీ ఇస్తారా అంటే దానికీ పవన్ బెట్టు చేస్తున్నారు. దానితో టీడీపీ కింది స్థాయి కార్యకర్తలు కన్ ఫ్యూజన్ కు గురవుతున్నారని వార్తలు వస్తున్నాయి. దాన్ని సెట్ చేసేందుకు పవన్ ను దారికి తెచ్చేందుకే చంద్రబాబు 175 సీట్లలో గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నట్లు భావిస్తున్నారు.
ఎంతలేదన్న కాపు సామాజికవర్గం బలం మీదే జనసేన నడుస్తోంది. వాళ్ల ఓట్లు చీల్చి ఇబ్బంది పెట్టగలమన్న ధైర్యమూ ఆ పార్టీకి ఉంది. ఇప్పుడా ధైర్యాన్నే దెబ్బకొట్టాలని టీడీపీ డిసైడైంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాపులకు ఎక్కువ స్థానాలివ్వాలనుకుంటోంది. టీడీపీలోని కొందరు కాపు నేతలను పక్కన పెట్టయినా బలమైన కాపు నేతలకు టికెట్లిచ్చే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో కాపు మేథావులను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధమైంది. కేశినేని నాని లాంటి సమర్థులైన నాయకులను లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయించాలని చూస్తోంది.
వైసీపీలో అసంతృప్తిపరులను గుట్టుచప్పుడు కాకుండా లాగేసే ప్రయత్నమూ జరుగుతోంది. ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నేతలు లైన్లోకి వచ్చారు. మరికొంత మంది ఖాయమంటున్నారు. వచ్చిన వాళ్లందరికీ టికెట్లు ఇచ్చే అవకాశం లేకుంటే వారిని మరో విధంగా అకాడమేడ్ చేస్తామని చెబుతూ అసంతృప్తి లేకుండా చూసుకునే ప్రయత్నమూ జరుగుతోంది. ఎన్నికల సీట్ల పైనల్ సర్దుబాటు నాటికి పవన్ ను చక్ర బంధంలోకి ఇరికిస్తే ఆయన తమ దారికి వస్తారని టీడీపీ విశ్వసిస్తోంది. అదే చంద్రబాబు చాణక్యం అని చెప్పక తప్పదు.