తుపాను కారణంగా అమెరికాలోని కాలిఫోర్నియాను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెగని వర్షాల కారణంగా డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు పారుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వేలాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపాను కారణంగా కొండచరియలు విరిగిపడుతుండడంతో చాలా చోట్ల భూమికి పగుళ్లు వచ్చాయి. డిసెంబర్ 26 నుంచి కాలిఫోర్నియా మంచు తుఫానులతో అల్లాడుతోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 19 మంది మరణించారు. వరదలు, కొండ చరియలు విరిగి పడటం, విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఫెడరల్ ప్రభుత్వం బాధితులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని మెర్సిడ్, శాక్రమెంటో, సాంటాక్రజ్ ప్రాంతాల్లో బాధితులకు నేరుగా ఫెడరల్ ప్రభుత్వ సాయం అందనుంది.