భారత రాజ్యాంగం చెక్స్ అండ్ బ్యాలెన్స్ పద్దతిలో వ్యవస్థల్ని నడపడానికి ఏర్పాట్లు చేసింది. అది 70 ఏళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా సాఫీగానే సాగుతోందని అనుకోవచ్చు. మిగతా అన్ని వ్యవస్థలకూ వైరస్ పట్టినా అంతో ఇంతో న్యాయవ్యవస్థ మాత్రం ఇంకా ప్రజల నమ్మకాన్ని చూరగొంటూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ న్యాయవ్యవస్థకూ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. న్యాయమూర్తుల ఎంపిక వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం వివాదాస్పదం చేస్తోంది. కొలీజియం చేసే సిఫార్సులు నియమిస్తున్న న్యాయమూర్తులపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. చివరికి ఇటీవల అన్ని వర్గాలకూ మేలు జరగడం లేదనే రాజకీయ విమర్శను కూడా చేసింది. తాజాగా న్యాయమూర్తుల నియామకాలు చేపట్టే కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలని కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. దీంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.
ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తుల నియామకాలపై ఇటివలి కాలంలో విస్తృత చర్చ జరుగుతున్నది. దీనికి కారణం ప్రభుత్వాల వ్యతిరేకతే. భారత ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి సుప్రీంకోర్టు కొలీజియం ఏర్పాటవుతుంది. వివిధ రాష్ట్రాల్లో ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో హైకోర్టు కొలీజియం ఏర్పాటవుతుంది. ఈ కొలీజియం చేసిన నియామక నిర్ణయాల సిఫార్సుల మేరకు, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల అధారంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తుంది. కొలీజియం ప్రతిపాదనలు లేకుండా జడ్జీలను నియమించే అధికారం ప్రభుత్వాలకు లేదు. కొలీజియం వ్యవస్థతో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు చేయాలని 1998లో మార్గదర్శకాలు రూపొందించారు. అప్పటి నుంచి కొలీజియం వ్యవస్థే నియామకాలు చేస్తోంది.
న్యాయవ్యవస్థకు రాజకీయ వ్యవస్థ నుంచి సవాళ్లు !
దేశంలో న్యాయవ్యవస్థ ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నదో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కొలిజీయం వ్యవస్త ఎెంపిక చేస్తున్న న్యాయమూర్తులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం.. అసలు కొలీజియం వ్యవస్థ వద్దని న్యాయమూర్తుల్ని కూడా తామే నియమిస్తామని పట్టుబడుతోంది. కొన్నాళ్లుగా కొలీజియం చేసే సిఫార్సుల్ని పట్టించుకోని కేంద్రం … తాజాగా అసలు ఆ కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలని నేరుగా సీజేఐకిత లేఖ రాసింది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో.. హైకోర్టు , సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పుల ద్వారా న్యాయమూర్తుల నియామకాల రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని కిరణ్ రిజుజు సీజేఐకి సూచిస్తున్నారు. రిజుజు లెక్క ప్రకారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియమకానికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి.. రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఉండాలన్నమాట.
కొలీజియం వ్యవస్థలోనూ లోపాలు లేవని కాదు .. !
కొలీజియం వ్యవస్థలోనూ లోపాలు లేవని కాదు. 2012–2022 సంవత్సరాల మధ్య కాలంలో పన్నెండు మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు. వీరిలో ఐదుగురు జడ్జీల కుటుంబాల వారే. వీరు కాకుండా ఒకరు అస్సాం గవర్నర్, మరొకరు అస్సాం ముఖ్యమంత్రి, ఇంకొకరు కేంద్రమంత్రిగా పనిచేసిన వారి కుటుంబీకులే. న్యాయమూర్తుల నియామకాల్లోనూ ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. న్యాయమూర్తుల్ని న్యాయమూర్తులే నియమించుకోవడం ఏమిటన్న చర్చ కూడా ఉంది.
న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే అభిప్రాయం !
స్వతంత్ర భారతంలో ఐఏఎస్ అధికారుల నియమాకాలకు భారతీయులందరు గౌరవించగలిగే, ఆమోదించగలిగే ఒక బహిరంగ సైంటిఫిక్ విధానం ఉంది. అలాగే న్యాయమూర్తులవ నియామకాలకు జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ద్వారా మాత్రమే న్యాయమూర్తుల నియామకాలు చేపట్టాలని 2014 ఆగస్టులో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటులో చట్టం చేశారు. ఆ తర్వాత చట్ట సవరణను సవాలు చేస్తూ 2015లో ‘సుప్రీంకోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్’ అసోసియేషన్తో పాటు మరికొంత మంది పిటీషనర్లు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో 99వ సవరణను రద్దుచేస్తూ వెయ్యి పేజీల తీర్పునిచ్చింది. దీంతో ఆ చట్ట సవరణ తేలిపోయింది. కొలీజియం కొనసాగుతోంది.
న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడితేనే దేశానికి బలం !
రాజకీయం ఇప్పటికే అన్ని వ్యవస్థలను శాసిస్తోంది. ఒక్క సారి అధికారం చేపడితే చాలు ఇక శాశ్వత అధికారం తమదేనన్నట్లుగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థనూ గుప్పిట పట్టే ఆలోచన రాజకీయం చేస్తోందని ఈ లేఖ ద్వారా సులువుగా అంచనా వేయవచ్నన్న అభిప్రాయం వినిపిస్తోంది. న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం పూర్తి స్థాయిలో ఆమోదించడం లేదు. డిసెంబర్ నాటికి హైకోర్టుల నుంచి వచ్చిన 154 ప్రతిపాదనలు ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు కొలీజియంకు మధ్య వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామా లేదా పదోన్నతి, న్యాయమూర్తుల సంఖ్య పెరగడం వల్ల న్యాయమూర్తుల ఖాళీలు తలెత్తుతూనే ఉన్నాయని కేంద్ర మంత్రి చెబుతున్నారు, కొలీజియం లో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలన్నదానిపై ఇప్పుడు విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది.
కొలీజియం మంచిదా.. ప్రభుత్వ నియామకాల ద్వారా న్యాయమూర్తుల్ని నియమించడం మంచిదా అన్నది విస్తృత చర్చల తర్వాతే తేల్చగలరు. కారణం ఏదైనా న్యాయవ్యవస్థ రాజకీయం గుప్పిట్లోకి వెళ్తే మాత్రం.. దేశ క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడితేనే.. దేశం బలంగా ఉంటుంది.