తాను చనిపోయినట్లు పక్కా ఎవిడెన్స్ సృష్టించి పోలీసులను, కుటుంబ సభ్యులను నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి ఎలాంటి ప్లాన్ వేశాడనే టాపిక్ మీద అప్పుడెప్పుడో మల్లాది వెంకటకృష్ణమూర్తి దొంగాట అనే నవల రాశారు. ఆ నవలలో రాసినట్లుగానే ప్లాన్ చేసి దొరికిపోయాడు ఓ ప్రబుద్ధుడు. అసలేం జరిగిందో చూద్దాం.
మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపురం శివారులో చెరువు కట్ట కింది భాగంలో ఒక వ్యక్తి కారులో సజీవ దహనం అయ్యారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన జరిగిన ప్రాంతంలో లభించిన దుస్తులు, బ్యాగ్, ఆధారంగా చనిపోయిన వ్యక్తి సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ అని పోలీసులు తెల్చారు. ఇతను రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు మొదలెట్టారు పోలీసులు. కారుకు సమీపంలో ఒక పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. దాంతో ధర్మాను హత్య చేసి ఆ తరువాత కారులో తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో వారికి దిమ్మతిరిగిపోయే విషయం తెలిసింది. ఆ మృతదేహం ధర్మాది కాదని అతని డ్రైవర్‌దని తేలింది. కారులో లభించిన మృతదేహం ధర్మాదే అని భావించిన పోలీసులు డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు వెంటనే అంత్యక్రియలు కూడా చేసేశారు.
అయితే సంఘటన స్థలంలో పోలీసులు ఎంత గాలించిన ధర్మ సెల్‌ఫోన్ మాత్రం దొరకలేదు. అనుమానంతో ఆ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తే అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. ధర్మా బతికే ఉన్నాడని ప్రస్తుతం గోవాలో ఉన్నాడని గుర్తించారు. వెంటనే గోవాకు వెళ్లి ధర్మాను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు బయటపెట్టాడు ధర్మా. ఇతనికి బెట్టింగ్‌లు ఆడే వ్యవసనం ఉంది. దానికోసం తాహతుకు మంచి అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతే తన పేరు మీదున్న ఏడు కోట్లు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తాను చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇంతకీ ఆ కారులో దొరికిన మృతదేహం ఎవరిది అని అడిగితే తన కారు డ్రైవర్ ది అని అసలు విషయం చెప్పాడు.