బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీలో జనసేనతో పొత్తును తేల్చే అవకాశాలున్నాయని ఒక వాదన. అయితే అంతర్గతంగా జరిగే చర్చకు సంబంధించి అక్కడా ఇక్కడా మాటలు చెప్పుకోవడం మినహా అధికారిక ప్రకటన ఏదీ రాకపోవచ్చు. ఎన్నికల దాకా వెయిట్ చేయాలన్న ధోరణి కనిపించొచ్చు. బీజేపీ జనసేన పొత్తు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూడేళ్లయినా ఇంతవరకు ఆది కార్యరూపం దాల్చలేదు. పైగా ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయన్న చర్చ నేపథ్యంలో కమలంతో పవన్ కటీఫ్ చెబుతారా అన్న ప్రస్తావన కూడా వస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన జనసేన ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీ ఆ తరువాత పొత్తుకు సిద్దమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో 0.68 శాతం ఓట్లు సంపాదించిన బీజేపీ సుమారుగా 6 శాతం ఓట్లు సాదించిన జనసేన మధ్య పొత్తు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ రెండు పక్షాలు సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయిన వెంటనే పొత్తుకు సిద్దమయ్యాయి. ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన చర్చల అనంతరం విజయవాడలో అప్పటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. దానితో మైత్రికి బీజం పడిందే తప్ప ఎన్నికల పొత్తుకు అవకాశం రాలేదు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత జనసేనకు ఆ పార్టీకి దూరం పెరిగింది. సమన్వయ కమిటీ భేటీ కూడా జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పలు ప్రాంతాల్లో జనసేన క్షేత్రస్థాయిలో తెలుగుదేశంతో అనధికార పొత్తు పెట్టుకుంది. దానితో జనసేనకు బీజేపీ మరికొంత దూరం జరిగింది. వైసీపీపై జనసేన చేసే ఉద్యమాలకు టీడీపీ నోటిమాటగానైనా మద్దతిస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం అటు వైపు చూడడం లేదు. ఇటీవల చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ కళ్యాణ్ రెండు గంటల సేపు చర్చలు జరిపిన తర్వాత కూడా బీజేపీ దాన్ని లైట్ గా తీసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని పవన్ ఎన్ని సార్లు ప్రకటించినా అందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పైగా కత్తులు పదునెక్కుతున్నాయని సోము వీర్రాజు కామెంట్స్ కూడా సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.
ఏపీ బీజేపీలో రెండు గ్రూపులున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ తో స్నేహాన్ని కోరుకుంటే మరోటి పవన్ ను దూరం పెట్టాలని భావించే గ్రూపుగా చెప్పుకోవచ్చు ఇదీ వారి వారి సొంత విషయమా లేక పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఆడుతున్న నాటకమా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు పవన్ తో మాట్లాడిన మాటలు కూడా రెండు పార్టీలు బయటకు చెప్పలేదు. పైగా ఏపీలో మధ్యంతర ఎన్నికల మాట వినిపిస్తోంది. జగన్ మధ్యంతరానికి వెళితే వైరి వర్గాలకు ఎక్కువ టైమ్ ఉండదు. జగన్ ను గద్దె దించాలంటే ముందే జత కట్టాలి. మరి ఆ సంగతి బీజేపీ అధిష్టానానికి అర్థమవుతుందో లేదో. ఎందుకంటే ఎన్నికల పొత్తుపై తొలి అడుగు వేయాల్సిందీ బీజేపీనే. ఏపీలో ఆ పార్టీనే వీక్ అని మరిచిపోకూడదు. పవన్ మా మిత్రడే అని చెప్పుకుంటే సరిపోదు కదా.