జూనియర్ ఎన్టీఆర్ కోసం టీడీపీ కేడర్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూపులు

By KTV Telugu On 18 January, 2023
image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27న వర్థంతి మళ్లీ రాజకీయ చర్చకు దారి తీసింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించినప్పుడు కొందరు అభిమానులు ఆయన్ను చూసి సీఎం సీఎం అంటూ నినాదాలిచ్చారు. జూనియర్ కొంత అసహనానికి గురైనప్పటికీ అభిమానుల నినాదాలు మాత్రం వాస్తవం. ఎన్టీఆర్ ఘాటుకు నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా పలువురు కుటుంబ సభ్యులు వచ్చినప్పటికీ జూనియర్ మాత్రమే ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

జూనియర్ కావాలి, జూనియరే సీఎం ఇలాంటి నినాదాలు కొత్తేమీ కాదు. ఇటీవలి కాలంలో చంద్రబాబు రోడ్ షోలలో కూడా జూనియర్ ఫోటోలతో కొందరు హల్ చల్ చేసేందుకు ప్రయత్నించారు. జూనియర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ కొందరు పబ్లిగ్గానే చంద్రబాబుకు సలహాలు కూడా ఇచ్చారు. చేసేదేమీ లేక చంద్రబాబు మౌనంగా తలూపి ఊరుకున్నారు.

జూనియర్ పట్ల టీడీపీ కేడర్ కు తెలుగు ప్రజలకు అభిమానం ఉండటం వెనుక అనేక కారణాలున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన అచ్చంగా స్వర్గీయ ఎన్టీఆర్ లాగే ఉంటారు. సినిమాల్లో సక్సెస్ అయ్యారు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేయగలరన్న పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వస్తే సీనియర్ ఎన్టీఆర్ తరహాలో రాణిస్తారన్న నమ్మకమూ ఉంది. గతంలో టీడీపీ తరపున ప్రచారం చేశారు. చంద్రబాబు తర్వాత ఉన్న నాయకులంతా రాజకీయాల్లో ప్రతిభావంతులు కారని భావిస్తున్న తరుణంలో జూనియర్ సమర్థుడైన నాయకుడవుతారని విశ్వసిస్తున్నారు.

ఏపీలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉందన్న ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. చంద్రబాబును జనం విశ్వసించలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. మిగతా నేతల వల్ల జనానికి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ప్రధాన పార్టీల పట్ల క్షేత్రస్థాయిలో జనం విసిగిపోయారు. వాళ్లు మార్పును కోరుకుంటున్నారు.

జూనియర్ వస్తే సీనియర్ ఎన్టీఆర్ తరహాలో ప్రభంజనం సృష్టించగలరన్న విశ్వాసం ఆయన అభిమానుల్లో ఉంది. పైగా చిల్లర రాజకీయాలు చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయలేదు. ఆయన మనవడిగా జూనియర్ కూడా హుందాగానే ప్రవర్తిస్తారన్న నమ్మకం అభిమానుల్లో కలుగుతోంది. పైగా టీడీపీ కేడర్ కూడా ఛేంజ్ కోసం ఎదురు చూస్తోంది. మరో పక్క నారా లోకేష్ పట్ల పార్టీ కేడర్ లో పెద్దగా విశ్వాసం లేదని చెబుతున్నారు. చంద్రబాబు స్థాయిలో లోకేష్ డెవలప్ కాలేకపోతున్నారన్న బాధ కేడర్ లో కనిపిస్తోంది. అచ్చెన్నాయుడు లాంటి వారు లోకేష్ ను ఇప్పటికే బహిరంగంగా విమర్శించి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చారు. లోకేష్ అందరికీ అందుబాటులో ఉండరన్న టాక్ చాలా రోజులుగా ఉన్నదే. అందుకే ఇప్పుడు పార్టీ శ్రేణులు జూనియర్ కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పాల్సి వస్తోంది. ఆయన అందుకు రెడీగా ఉన్నారో లేదో తేలీదు. ఎందుకంటే జూనియర్ ఇప్పుడే ఫిలిం కెరీర్ ను వదలుకునేందుకు సిద్ధంగా లేరు. పాలిటిక్స్ సంగతి తర్వాత చూద్దాం లే అన్నట్లుగా ఆయన తీరు కనిపిస్తోంది.