తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ – షార్‌లో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆత్మహత్య చేసుకోగా మరో 24 గంటలు గడవకముందే మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి రాడార్ సెంటర్‌కు సమీపంలోని అటవీ ప్రాంతంలో కానిస్టేబుల్ చింతామణి చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. ఇతనిది చత్తీస్‌గఢ్‌లోని మహాసమంద్ జిల్లా శంకర గ్రామం. 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలో విధుల్లో చేరాడు. ఇటీవల నెల రోజులపాటు సెలవుపై ఇంటికెళ్లిన చింతామణి ఈ నెల 10న తిరిగొచ్చి విధుల్లో చేరాడు.
ఇది ఇలా ఉండగానే సోమవారం రాత్రి సీఐఎస్ఎప్ ఎస్ఐ వికాస్ సింగ్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఇతను శిక్షణానంతరం ముంబై లోని బాబా ఆటమిక్ సెంటర్లో విధులు నిర్వర్తించారు. గత ఏడాది నవంబర్లోనే షార్కు బదిలీ అయ్యారు. ఈ షాక్ నుంచి షార్ సిబ్బంది తేరుకోకముందే మరో విషాదం చోటుచేసుకుంది. వికాస్ సింగ్ భార్య ప్రియా సింగ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భర్త మరణ వార్త తెలిసి ఉత్తరప్రదేశ్ నుంచి షార్కు చేరుకున్నారు ప్రియాసింగ్. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భర్త మృతిపై స్థానిక పోలీసులు ఆమెను కూడా విచారించారు. ఆ తరువాత తెల్లవారు జామును తాను బస చేసిన అతిథి గృహంలోనే ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు.
షార్‌లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజం చెప్పాలంటే షార్‌లో పెద్దగా పని ఒత్తిడి ఉండదు. వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే కాస్త హడావుడి ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈ కేంద్రంలో మొత్తం 947 మంది వరకు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. వారిలో 90 మంది మహిళలు. వీరందరికీ ప్రతి మూడేళ్లకొకసారి బదిలీలు జరుగుతాయి. కరోనా వల్ల మధ్యలో రెండేళ్లపాటు బదిలీలు జరగలేదు. గతేడాది అక్టోబర్ నెలలో 500 మంది బదిలీలపై వెళ్లగా వారి స్థానంలో కొత్తవాళ్లు వచ్చారు. పని ఒత్తిడి లేకున్నా కుటుంబాలకు దూరంగా ఉండటం వల్లే చాలా మంది మానసికంగా క్రుంగిపోతారని ఆ పరిస్థితిని అధిగమించలేనివాళ్లు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు మానసిక నిపుణులు. వీరి ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలు కూడా కారణమై ఉండవచ్చని చెబుతున్నారు.