బాబు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తా

By KTV Telugu On 18 January, 2023
image

“మొండి వాడు రాజుకంటే బలవంతుడు. మరి రాజే మొండి వాడైతే ఇక చెప్పేదేముంది రచ్చ రచ్చే. ఇపుడు విజయవాడ టిడిపిలో జరుగుతోంది అదే. ఎంపీ కేశినేని నాని గురించే ఇదంతా. ఒక సారి మైండ్ లో ఫిక్స్ అయితే ఆ చంద్రబాబు నాయుడు చెప్పినా వినరు నాని. తరచుగా తెలుగు బాస్ కు కంట్లో నలుసులా చెవిలో జోరీగలో చెప్పులో రాయిలా మల్టిపుల్ రోల్స్ లో ఇబ్బంది పెట్టేస్తోన్న కేశినేని నానికి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటూ ఉంటే నాని రివర్స్ లో చంద్రబాబుకే అల్టిమేటం జారీ చేస్తున్నారు.”

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం మూడు లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంటే అందులో ఒకటి విజయవాడ లోక్ సభ నియోజక వర్గం. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం బలంగా ఉన్నా కేశినేని అద్భుత విజయం సాధించారు. రెండేళ్లుగా కేశినేని నానికి పార్టీ అధినాయకత్వానికీ మధ్య దూరం పెరుగుతోంది. కారణాలు తెలీదు కానీ కేశినేని నాని తరచుగా చంద్రబాబు పై చిట పట లాడుతున్నారు. అలాగని పెద్ద గా సౌండ్ చేయడం లేదు. ఆ చిటపటలు కూడా సైలెంట్ గానే. ఆ మధ్య ఢిల్లీలో చంద్రబాబు నాయుడికి బొకే ఇవ్వమంటే కేశినేని నాని ఆ బొకేని పక్కకు తోసేసి అధినాయకుడిని అవమానించేలా వ్యవహరించారు. దాంతో మిగతా నేతలు షాక్ తిన్నారు.

నాని అలా ఎందుకు చేశారంటే చంద్రబాబు నాయుడు తనకు తెలీకుండా తన తమ్ముడు చిన్నిని తన నియోజక వర్గంలో ప్రమోట్ చేస్తున్నారు. ఇది నానికి మంట పుట్టిస్తోంది. తన సొంత నియోజకవర్గం అనుకున్న విజయవాడలో తనను పక్కన పెట్టేందుకే చంద్రబాబు నాయుడు తన తమ్ముణ్ని తెరపైకి తెస్తున్నారని నాని ఆక్రోశం. దీని వెనుక జిల్లాలతో తనను వ్యతిరేకించే బోండా ఉమ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు ప్రమేయం ఉందన్నది నాని అనుమానం. చంద్రబాబు ఆశీస్సులు ఉండడం వల్లనే కావచ్చు కేశినేని చిన్ని కొంతకాలంగా నియోజక వర్గంలో కార్యక్రమాలు పెంచేశారు. జనంతో మమేకం అవుతున్నారు. ఇది చూసిన మీడియా వాళ్లు నానితో మీరు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై పోటీ చేస్తారా అని అడిగారు. దాంతో ఒళ్లు మండిన నాని ఎవరు చెప్పారు మీకు నేను ఎంపీగానే పోటీ చేస్తానని కోపంగానే బదులిచ్చారు.
ఈ సందర్భంగానే పార్టీ నాయకత్వంపైనా జిల్లాలో తన వ్యతిరేకులపైనా సెటైర్లు వేశారు.

పార్టీలో ఎవరికైనా టికెట్లు ఇవ్వచ్చని ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయచ్చని అంటూనే కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఉన్న క్రిమినల్స్, పేకాట ఆడే గ్యాంబర్లు, రక రకాల నేరాలకు తెగబడే వారికి మాత్రం తాను మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కేశినేని నాని అన్నారు. ఈ మాటలు అన్నది తన తమ్ముడు చిన్నితో పాటు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను ఉద్దేశించే అని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. తన మాటలు అందరికీ అర్ధం అవుతాయో లేదోనని క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని తన వాకిట్లో కూడా ఉంచనివ్వనని నాని కామెంట్ చేశారు. తన తమ్ముడికి టికెట్ ఇస్తే తాను మద్దతుగా ప్రచారం చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. కొందరు నేతలు ఎన్నికలకు ముందు తెరపైకి వచ్చి ఫౌండేషన్లు, ట్రస్టుల ముసుగులో కొద్ది మంది పేదలకు చీరలు ధోతీలు పంచి పెట్టి జిందాబాద్ లు కొట్టించుకుంటూ ఉంటారని నాని అన్నారు. ఇది కచ్చితంగా తన తమ్ముడు చిన్నిని ఉద్దేశించే అని పార్టీ నేతలు భావిస్తున్నారు.

అయితే తన తమ్ముడితో పాటు ఇటీవల గుంటూరులో ఎన్.ఆర్.రై. ఉయ్యూరు శ్రీనివాస్ ఉయ్యూరు ఫౌండేషన్ పేరుతో బట్టలు పంచి పెట్టిన ఘటనను కూడా కేశినేని నాని కావాలనే టార్గెట్ చేశారని అంటున్నారు. ఇలా ఫౌండేషన్లు పెట్టే వాళ్లకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీయాలంటూ చురక అంటించారు. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే విజయవాడ ప్రజలు తనను స్వతంత్ర అభ్యర్ధిగా గెలిపించుకుంటారని కేశినేని ధీమా వ్యక్తం చేశారు. అంటే చంద్రబాబు టికెట్ ఇవ్వకపోయినా తానుతగ్గేదేలే అని కేశినేని చాటి చెప్పేశారు. అసలు చంద్రబాబుతో కేశినేని నానికి తేడాలు ఏ సందర్భంలో వచ్చాయన్న అంశంపై చర్చ జరుగుతోంది. 2013 ప్రాంతంలో టిడిపి నేతలంతా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పోతోన్న తరుణంలో తాను టిడిపిలో చేరానని గుర్తు చేసిన కేశినేని నాని తాను చేరిన తర్వాతనే వైసీపీలోకి వలసలు ఆగాయని చెప్పుకొచ్చారు.

2013 ప్రాంతంలో కేశినేని నాని ట్రావెల్స్ బిజినెస్ లో రారాజుగా వెలుగొందారు. కేశినేని ట్రావెల్స్ కు దేశంలోనే పెద్ద పేరుంది. అన్ని రాష్ట్రాలకూ బస్సులు నడిపిన కేశినేని నాని వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోడానికే టిడిపిలో చేరారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆయన వ్యాపారం అలానే వ్యాప్తి చెంది ఉండేది. అయితే 2014 ఎన్నికల్లో బొటా బొటీ మెజారిటీతో టిడిపి అధికారంలోకి వచ్చాక కేశినేని బిజినెస్ కాస్తా కొల్లాప్స్ అయ్యింది. కేశినేని ట్రావెల్స్ కు ఎదురు తిరగడానికి ఇతర ట్రావెల్స్ కంపెనీలు ధైర్యం చేసేవి కావు కానీ తెలంగాణాకు చెందిన ఆరెంజ్ ట్రావెల్స్ మాత్రం కేశినేని ట్రావెల్స్ తో ఢీకొంది. రెండు కంపెనీల మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులు ఏపీలో తిరక్కుండా ఆంక్షలు పెట్టాలని కేశినేని నాటి సిఎం చంద్రబాబును కోరారు కూడా. అయితే సరిగ్గా ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు ఓ కేసులో బుక్ అయ్యారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో రాత్రికి రాత్రే తట్టా బుట్టా సద్దేసి ఛలో తాడేపల్లి అన్నారు. ఆయనపై కేసు పెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి అందులోని పెద్దలకి కోపం తెప్పించకుండా జాగ్రత్తగా ఉండాలనుకున్నారు.

ఆ సమయంలోనే ఆరెంజ్ ట్రావెల్స్ ఇష్యూ వచ్చింది. అయితే ఆ ట్రావెల్స్ లో టి.ఆర్.ఎస్. ప్రభుత్వంలోని కీలక మంత్రికి చాలా పెద్ద స్టేక్ ఉందని అంటున్నారు. అందుకోసమే కేసు నుండి తనని తాను రక్షించుకోవడం కోసం కేశినేని ట్రావెల్స్ ను చంద్రబాబు బలిచ్చేశారని గిట్టని వాళ్లు అంటూ ఉంటారు. తన ట్రావెల్స్ విషయంపై చంద్రబాబు నాయుడి దగ్గరకు వెళ్తే “నువ్వు ఎంపీగా వచ్చావా ట్రావెల్స్ ఆపరేటర్ గా వచ్చావా అని చంద్రబాబు అడిగే సరికి కేశినేనికి బాగా కాలిందట. అంతే పౌరుషంగా అక్కడ్నుంచి వెళ్లిపోయిన కేశినేని ట్రావెల్స్ బిజినెస్ నే క్లోజ్ చేసేసుకున్నారట. ఆ కోపం అప్పట్నుంచీ గ్యాస్ స్టవ్ సెగ సిమ్ లో ఉన్నట్లు కేశినేని గుండెల్లో ఆక్రోశం మండుతూనే ఉందట. ఇపుడా సెగపైనే తన తమ్ముణ్ని తెరపైకి తీసుకు వచ్చి చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని నాని మండిపోతున్నారు. అందుకే చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వకపోయినా తనకు ఫర్వాలేదన్నట్లు సంకేతం ఇవ్వడమే కాకుండా విజయవాడ ప్రజలు తనను స్వతంత్ర అభ్యర్ధిగానైనా గెలిపించుకుంటారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని ఫ్యాక్టర్ టిడిపిని ఏ మేరకు దెబ్బతీస్తుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.