జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ నేతలు అంగీకరించడం లేదు. బీజేపీ-జనసేన పొత్తు ఉంది. ఆ పార్టీల్లో సీఎం అభ్యర్థి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కల్యాణే శిఖరంలా ఉంటారు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో మరో రకమైన ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదంటున్నారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో సోము వీర్రాజు వంటి నేతలు పవన్ కల్యాణ్ తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. కానీ అనేక రకాల ఒత్తిళ్లు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని ప్రకటనలు చేస్తున్నారు.
పవన్‌ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించాలంటున్న జనసేన !
ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీలో సీఎం అభ్యర్థిపై చర్చ మరోసారి జరుగుతోంది. జనాదరణ అధికంగా ఉన్న నేత పవన్ కల్యాణ్ కాబట్టి .. బీజేపీ కన్నా ఎక్కువగా జనసేనకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే బీజేపీలోని కొంత మంది నేతలకు ఇది అసలు ఇష్టం లేదు. కొంత మంది సీఎం అయ్యాక తొలి సంతకాల గురించి కూడా మాట్లాడేస్తున్నారు. పవన్ ను సీఎం అభ్యర్థిగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. జనసేన నాయకులు పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని వరుసగా డిమాండ్ చేస్తున్నారు. కానీ జీవీఎల్ నరసింహారావు గంటల్లోనే వారి గాలి తీసేశారు. ఇప్పుడల్లా అలాంటి ప్రకటన చేసే అవకాశం లేదని తేల్చారు. నడ్డా పర్యటనలో ఎలాంటి ప్రకటన ఉండదని జీవీఎల్ స్పష్టం చేశారు.
పవన్ బలంతో బీజేపీ రాజకీయం అయినా ఈ అవమానాలు
పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ఒక్క శాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉన్న బీజేపీ కూడా అంగీకరించడం లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అనేది తమ స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదని.. జాతీయ స్థాయిలో నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆయన కవర్ చేస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల సమయంలో అలాంటి నిర్ణయమేదీ తీసుకోకుండానే ప్రకటించి.. ఎన్నికలయిన తరవాత యూటర్న్ తీసుకున్నారు. అయినా ఏపీకి సంబంధించినంతవరకు జనసేన మేజర్ పార్టీ. ఏ ఎన్నికలు జరిగినా అదే విషయం స్పష్టమవుతోంది. లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనతో పొత్తు ఉన్నా.. బీజేపీ కనీస స్థానాలను గెల్చుకోలేకపోయింది. కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా బీజేపీకి లేవు. ఆ పార్టీలో పవన్ స్థాయిలో ప్రజాదరణ ఉన్న నాయకుడు లేరు. అయినప్పటికీ పవన్ ను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండాలంటే తమను బతిమాలుకోవాలన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ తీరుపై జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది.
చెరో రెండున్నరేళ్లంటూ కొత్తగా పవన్‌తో బేరం !
ఏపీలో రెండు పార్టీలు కలసి పోటీ చేసి ఒక వేళ అధికారంలోకి వస్తే తొలి రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ పని చేసిన ఆ తరువాత మిగిలిన రెండు సంవత్సరాలు బీజేపి కి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారని పార్టిలో ప్రచారం జరుగుతోంది. అయితే దీని పై పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడ బీజేపి నేతలు అంచనా వేసే పనిలో ఉన్నారు. ఇలాంటి ఫిట్టింగ్‌లు పెట్టడం అంటే పవన్ ను అవమానించడమేనని.. పవన్ స్థాయి నేత బీజేపీలో ఒక్కరైనా ఉన్నారా అని జనసేన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
జనసేనకు ఆశలెక్కువున్నాయని లైట్ తీసుకుంటున్న టీడీపీ ?
పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఓట్లు చీలనివ్వబోమని ప్రకటన చేశారు. తర్వాత కలిసి పోరాడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే పొత్తులపై చర్చ జరిగింది. దీంతో కలసి పోరాడటానికే పిలిచానని పొత్తుల గురించి కాదని చంద్రబాబు ఓసారి క్లారిటీ ఇచ్చారు. అందరూ పొత్తుల కోసమే అన్నట్లుగా మాట్లాడుతూ ఉండటంతో తర్వాత ఆయన పూర్తిగా ఆ విషయం వదిలేశారు. మహానాడులోనూ మాట్లాడలేదు. దీంతో వన్ సైడ్ లవ్ అన్న ఆయన.. వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు పొత్తులపై చంద్రబాబు కూడా ఆసక్తిగా లేరని చెబుతున్నారు. ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీనే పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే.. నలభై శాతం ఓట్లు ఉన్న టీడీపీ ఎలా ప్రకటిస్తుందని.. ఇప్పుడు ఇతరులు సెటైర్లు వేస్తున్నారు.