అధికారంలోకి ప్రజలకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు పంచిపెడతామని చెబితే ఓట్లు రాలతాయని భావిస్తున్నారు రాజకీయ నాయకులు. అందుకే ఒకరిని మించి ఒకరు పోటీలు పడి ఉచిత పథకాలు, నగదు పంపిణీ గురించి హామీలు గుప్పిస్తున్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం నోటికొచ్చిన హామీలు ఇస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తానేమీ తక్కువ తినలేదని చాటుకుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటక రాష్ట్రంలో డబ్బు పంపకాల పథకాలను ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక వాధ్రా ప్రకటించడం విశేషం. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా రాష్ట్రంలో పెళ్లయిన ప్రతి మహిళకు నెలకు 2వేల రూపాయల వంతున ఏడాదికి 24 వేలు ఇస్తాం అని ప్రకటించింది.
ఈ పథకానికి గృహలక్ష్మి అని పేరు పెట్టింది. ఈ సొమ్మును నేరుగా మహిళల ఖాతాల్లోనే జమచేస్తారట. కాంగ్రెస్ పార్టీ కూడా ముందు చూపు లేకుండా ఓట్ల కోసం డబ్బు ఎర వేసి ఓట్లు దండుకోవాలని అనుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ నగదు పంపినీ పథకం గురించి ఆ పార్టీ గట్టిగా సమర్థించుకుంటోంది. వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల గృహిణుల ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకే మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని ఈ పథకం తెస్తున్నారట. ధరలు పెరుగుతున్నాయి గనుక ప్రజలకు డబ్బులు పంచిపెడతాం అని కాంగ్రెస్ చెప్పడంపై ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించడానికి ఏం చేస్తాం అనేది చెప్పకుండా ఓట్లు దండుకోవడానికి డబ్బు పంచుతాం అని చెప్పడం విమర్శలకు గురవుతోంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు మార్గాలు చూపించకుండా తలా రెండువేలు ఇచ్చేస్తాం అనేది జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు తగదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.