పాకిస్థాన్ లో ఉండలేం మమ్మల్ని భారత్ లో కలిపేయండి మహప్రభో

By KTV Telugu On 18 January, 2023
image

పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి దిక్కూ మొక్కూ లేకుండా దిగాలు పడుతోన్న పాకిస్థాన్ కు మరో సమస్య. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు పాకిస్థాన్ కు గుడ్ బై చెప్పేయాలని డిసైడ్ అయ్యారు. మీ పాలన మాకొద్దు. మీ వేధింపులూ వద్దు. మమ్మల్ని భారత దేశంలో కలిపేసి కార్గిల్ రోడ్ ను మళ్లీ తెరవండి అంటూ ఆందోళన కారులు ప్రాధేయ పడుతున్నారు. పాక్ ప్రభుత్వం ఆర్మీలు దశాబ్ధాలుగా తమని కాల్చుకుతింటున్నారని వారు మండిపడుతున్నారు.

ఓ పక్క దేశంలో ఆకలి కేకలు ఆకాశాన్నంటడంతో పాక్ పాలకులు ఏం చేయాలో పాలుపోక చేష్ఠలుడిగి చూస్తున్నారు. ఆర్ధిక సంక్షోభం నుండి ఎలా గట్టెక్కాలో తెలీడం లేదు. సమస్య పరిష్కారమయ్యే మార్గం కనపడ్డం లేదు. ప్రజల్లో పాలకుల పట్ల అసంతృప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ఆర్ధిక పరిస్థితిని మెరుగు పర్చుకునే వీలు లేకపోవడంతో ప్రజలను రక రకాల ఆంక్షలతో వేధించక తప్పడం లేదు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్ ను ఎలా గట్టెక్కించాలా అని పాకులు ఆలోచనలు చేస్తున్నారు. సహాయం చేసేవారికోసం చేతులు చాస్తున్నారు. తమ పరిస్థితిపై వారికే మండుకొచ్చి అణ్వస్త్ర దేశమై ఉండి అడుక్కోవలసి రావడం దుర్భరం అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పళ్లు పట పట కొరుకుతున్నారు. ఆ కోపం ఎవరిమీదో తెలీదు. ఆ అసహనం ఎందుకో తెలీదు. ఆ నిర్వాకం ఎవరిదో మాత్రం అందరికీ తెలుసు. దరిదాపుల్లో పాకిస్థాన్ సంక్షోభం నుండి బయటపడే అవకాశాలు లేవంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.

ఈ సమస్యతోనే సతమతమవుతూ ఉంటే ఇది చాలదన్నట్లు ఇపుడు పాక్ వీపుపై రాచపుండులా పాక్ ఆక్రమిత కశ్మీరు భగ్గుమని మంటపెడుతోంది. చాలా కాలంగా పాక్ ఆక్రమిత కశ్మీరు లోని గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతంలో అశాంతి రాజుకుంటూనే ఉంది. ఇక్కడ ఎవ్వరూ సుఖంగా లేరు. ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. ఎవ్వరికీ కంటిమీద కునుకు లేదు. కంచంలో గుప్పెడు మెతుకులు లేవు. రేపన్న ఓ మంచి రోజు వస్తుందన్న ఆశలేదు. అటు పాక్ ప్రభుత్వం ఇటు పాక్ సైనికులు కూడా గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో ప్రజలకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు. దేశ విభజన అనంతరం జమ్ము కశ్మీరు ను ఆక్రమించుకోవాలని పాకిస్థాన్ అనుకుంది. అందుకోసం పాక్ లోని గిరిజన మిలీషియాతో పాటు ఆర్మీ దూసుకు వచ్చాయి. రాజా హరిసింగ్ సారధ్యంలోని కశ్మీరు లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే రాజ హరిసింగ్ పాక్ దుర్నీతిని ఎండగట్టి తమకు సాయం అందించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరారు.

వెంటనే రంగంలోకి దిగిన భారత ఆర్మీ పాక్ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసింది. పాక్ అప్పటికే గిల్గిట్ బాల్టిస్థాన్ ను ఆక్రమించుకుంది. అంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేయకుండా భారత సైన్యం నిలువరించగలిగింది. నిజానికి అప్పుడే పాక్ ఆక్రమించుకున్న భాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం భారత ఆర్మీకి కష్టం ఏమీ కాదు. కాకపోతే సరిగ్గా ఆ సమయంలోనే ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ కు ఆదేశించడంతో శాంతికాముక దేశమైన భారత్ అక్కడితో ఆగిపోయింది. ఇది 1947 అక్టోబరు నాటి సంగతి. అప్పటి నుండి ఇప్పటి వరకు పాకిస్థాన్ పాలకులు గిల్గిట్ బాల్టిస్థాన్ పై సవతి తల్లి ప్రేమే ప్రదర్శిస్తూ వచ్చింది. పాక్ లోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఉండే హక్కులేవీ పాక్ ఆక్రమిత కశ్మీరులో ప్రజలకు ఉండవు. పాక్ ప్రజలకు ఉన్న సదుపాయాలు కూడా వీరికి ఉండవు. ఎమరాల్డ్ స్టోన్స్, డైమండ్స్, యురేనియం వంటి అత్యంత విలువైన మూలకాలు నిక్షేపాలతో నిండి ఉన్న గిల్గిట్ బాల్టిస్థాన్ నిజంగానే సంపన్న ప్రాంతమనే చెప్పాలి.

ఇక్కడి నుండి గనులను తవ్వుకుని సంపదను తరలించుకుపోతూ వచ్చిన పాకిస్థాన్ ప్రభుత్వం దాని ద్వారా వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా పాక్ ఆక్రమిత కశ్మీరు పై ఖర్చు చేయలేదు. ఈ ప్రాంతంలో జల విద్యుత్ కేంద్రాలు ఉంటాయి. వాటి నుండి కావల్సినంత విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. అదంతా పాకిస్థాన్ లోని ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది. ఈ ప్రాంత వాసులకు మాత్రం రోజుకి 18 గంటలకు పైనే విద్యుత్ కోతలు అమలు చేస్తారు. ఇదేం ఘోరమని ప్రశ్నిస్తే సైనికులు చిత్రహింసలు పెడతారు. మరీ గట్టిగా అడిగితే శాల్తీలు గల్లంతైపోతాయి. లక్షల ఎకరాల ఖాళీ భూములు ఉన్నాయి పీ.ఓ.కే.లో. అందులో ప్రజలు సాగు చేసుకుంటోన్న భూములనూ పాక్ పాలకులు వదలడం లేదు. తమకి అప్పులిచ్చి ఊబిలోకి లాగేస్తోన్న చైనాకు ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన కోసం వేలాది ఎకరాల భూములను కట్టబెట్టేస్తున్నారు పాక్ పాలకులు.

ఈక్రమంలో భూములు కోల్పోయిన వారికి దమ్మిడీ పరిహారం కూడా చెల్లించడం లేదు. అంటే ఫలానా భూమి నచ్చిందంటే చాలు అక్కడ ఎవరు పంటలు సాగుచేసుకుంటోన్నా సైన్యం వచ్చి ఆ భూములను గుంజుకుంటుంది. దాన్ని కావల్సిన వారికి కట్టబెట్టి వారి నుండి పాలకులు ముడుపులు కొట్టేస్తూ ఉంటారు. పాక్ పాలకుల దృష్టిలో గిల్గిట్ బాల్టిస్థాన్ పౌరులంటే ద్వితీయ శ్రేణి పౌరుల కిందే లెక్క. ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో ఉండడంతో పి.ఓ.కే. ప్రాంత ప్రజలపై అదనపు పన్నుల భారంతో చావబాదేస్తున్నారు. గోధుమ పిండి దొరక్క ఇళ్లల్లో ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. దొరికిన గోధుమ పిండిని పాక్ లోనే పంపిణీ చేస్తున్నారు. గిల్గిట్ బాల్టిస్థాన్ ను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఏ కొత్త ప్రాజెక్టు కట్టాల్సి వచ్చినా గిల్గిట్ బాల్టిస్థాన్ లో ప్రజల ఇళ్లను యధేచ్ఛగా కూల్చివేసి భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారాలు ఉండవు. పునరావాస ప్యాకేజీలు ఉండవు.

పాక్ ఆక్రమిత కశ్మీరు నాయకుడు షౌకత్ ఆలీ కశ్మీరి నాయకత్వంలో ఆందోళన కారులు ఏడాదిగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఆందోళనలు చేసేవారిపై పాక్ ఆర్మీ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. షౌకత్ అలీ అయితే వివిధ దేశాలు పర్యటిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని ఎండగడుతూనే ఉన్నారు. తమకి న్యాయం చేయాలని ప్రపంచ దేశాలను అర్ధిస్తూనే ఉన్నారు. 1948 నుండి పాకిస్థాన్ తమని నిలువు దోపిడీ చేస్తూనే ఉందని ఈ మధ్యనే షౌకత్ జెనీవాలో మీడియా సమక్షంలో ఆరోపించారు. పాకిస్థాన్ లో భూమిపై ప్రజలకు ఉండే హక్కు గిల్గిట్ బాల్టిస్థాన్ లోని భూములపై అక్కడి ప్రజలకు హక్కులేదు. దీనికోసం పాక్ పాలకులు ఏక పక్షంగా చట్టాలు కూడా తెచ్చేసుకున్నారు. పీ.ఓ.కే.లోని విలువైన సంపదను వనరులను పాక్ పాలకులు దోచుకుపోతున్నారు. ఈ ప్రాంతం నుండి సంపద అయితే తరలించుకుపోతారు కానీ ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. బతుకులు దుర్భరం అయిపోయాయని ఆందోళనలు చేస్తే సైనికులు ఆయుధాలకు పని చెబుతారు.

ప్రభుత్వ విధానాలన్నింటా వివక్షే. ఇప్పటికే జీవితాలు నరక ప్రాయం అయిపోయాయని మండిపడుతోన్న ప్రజలు పాక్ పాలకులు పట్టించుకోకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేశారు. ఒక పక్క ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో తాలిబాన్ ఉగ్రవాదుల చొరబాట్ల సమస్య చికాకు పెడుతోంది. ఆఫ్ఘన్ తాలిబాన్ సహాయ సహకారాలతో పాక్ లోని తెహరీక్ ఇ తాలిబాన్ పాక్ ఉగ్రవాదులు కూడా రెచ్చిపోతున్నారు. వాళ్లయితే ఏకంగా సమాంతర ప్రభుత్వాన్నే ప్రకటించుకుని మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. బలూచిస్థాన్ లో పాక్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు భగ్గుమంటున్నాయి. చివరగా ఆర్ధిక సంక్షోభం పాక్ పాలకుల నోట మాట లేకుండా చేస్తోంది. ఎటు చూసినా సమస్యలే. సరిగ్గా ఈ తరుణంలోనే గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు తామిక పాకిస్థాన్ లో భాగంగా ఉండలేం అని స్పష్టం చేసేశారు. కార్గిల్ రోడ్డును తిరగి తెరచి పాక్ ఆక్రమిత కశ్మీరు ను తిరిగి భారత దేశంలో విలీనం చేసేయాల్సిందిగా ఆందోళన కారులు నినదిస్తున్నారు. ఈ నిరసనల సెగ ఇపుడు పాక్ పాలకులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

పాక్ ఆక్రమిత కశ్మీరు పాక్ ప్రభుత్వానికీ చైనాకీ కూడా చాలా కీలకమైనది. ఎందుకంటే చైనా తలపెట్టిన చైనా పాక్ ఎకనామిక కారిడార్ పీ.ఓ.కే. ప్రాంతం మీదుగానే నిర్మితం కావలసి ఉంది. అంచేత ఈ ప్రాంతం భారత్ లో కలిసిపోతే అది చైనాకు కూడా శరాఘాతమే అవుతుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. పీ.ఓ.కే. ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని భారత్ లో కలిపేసుకోడానికి భారత ప్రభుత్వం వ్యూహాత్మక ఆలోచనలు చేయాలంటున్నారు మేథావులు. అయితే ఈ క్రమంలో ఉద్రిక్తలు చోటు చేసుకునే ప్రమాదం లేకపోలేదు. నిజానికి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ వల్ల కానీ చైనా వన్ రోడ్ వల్ల కానీ పాకిస్థాన్ కు ఒరిగేదేమీ లేదు. దాని వల్ల లాభం ఏమన్నా ఉంటే అది చైనాకే ఉంటుంది. తనకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులు నిర్మాణం కోసం చైనా పాకిస్థాన్ కు అప్పులిచ్చి అప్పుల ఊబిలోకి దించేసి నెల నెలా వడ్డీలు వసూలు చేస్తూ తన ప్రయోజనాలు తాను కాపాడుకుంటోంది. పాకిస్థాన్ లో చైనా నిర్మించిన ఓ పోర్టులో ఇంత వరకు ఒక్క ఓడ కూడా రాలేదని అంటున్నారు. మరి అంత పెట్టుబది పెట్టడం వల్ల పాక్ కు ఏంటి లాభం.

పాకిస్థాన్ నే కాదు చైనా తన మిత్రదేశాలన్నింటినీ ఇలా అప్పులిచ్చి చంపేస్తూ ఉంటుంది. శ్రీలంకనే తీసుకోండి. అక్కడా అంతే అవసరం లేని ప్రాజెక్టులకోసం భారీ వ్యయం వెచ్చించిన చైనా దానిపై నెల నెలా వడ్డీలను లాగేస్తోంది కానీ ఆ ప్రాజెక్టు వల్ల శ్రీలంకకు చెప్పుకోదగ్గ ఆదయం ఇంత వరకు రాలేదు. చైనానుండి అప్పులు తీసుకోవడం పర్యాటక రంగ ఆదాయం దెబ్బతినడం వంటి రక రకాల కారణాలతోనే శ్రీలంక దివాళా తీసింది. ఇపుడు పాకిస్థాన్ కూడ అదే బాటలో పరుగులు పెడుతోందంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. చైనాను దూరం పెట్టకపోతే పాకిస్థాన్ మరింతగా అప్పుల్లో కూరుకుపోయి ఇక లేచి నిలబడలేని స్థితికి దిగజారు తుందని మేథావులు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ కు కనుచూపు మేరల్లో భవిష్యత్ కనపడ్డం లేదు కాబట్టే పి.ఓ.కే. ప్రజలు తమ ప్రాంతాన్ని భారత్ లో విలీనం చేయాలని కోరుతున్నారు.

ఎందుకంటే పాక్ బాగా ఉన్నప్పుడే తమని మాడ్చి చంపేశారు. ఇపుడు పాకిస్థాన్ కే తినడానికి ఏమీ లేదు. ఇక తమ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని వారు భయపడుతున్నారు. వ్యాపారాలుచేసుకోవాలన్నా ఉపాథి అవకాశాలు కావాలన్నా కూడా అతి పెద్ద మార్కెట్ అయిన భారత దేశంలోనే సాధ్యమని పి.ఓ.కే .ప్రజలు భావిస్తున్నారు. అయితే ఈ ఆందోళనలు పాక్ పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అసలు పి.ఓ.కేనే కాదు పాక్ ఆర్ధిక పరిస్థితి మరింతగా కృంగిపోతే పాక్ ప్రజలే తమ దేశాన్ని భారత్ లో విలీనం చేయాలని కోరినా ఆశ్చర్యపోనవరసం లేదంటున్నారు ఆర్ధిక రంగ విశ్లేషకులు. పాకిస్థాన్ కు ఇపుడేం చేయాలో అర్ధం కావడం లేదు. పిఓకే ప్రజలను ఊరడించడానికి వారి వద్ద ఎలాంటి ప్రయత్నాలూ లేవు. వారికి ఎలా నచ్చచెప్పాలో కూడా తెలీడం లేదు. ఎప్పట్లాగే ఉక్కుపాదంతో అణచివేస్తే ఉద్యమం మరింత ఉదృతం అవుతుందని హక్కుల నేతలు హెచ్చరిస్తున్నారు.