చైనా త‌గ్గింది.. ఇక అందులో మ‌న‌మే టాప్‌!

By KTV Telugu On 19 January, 2023
image

ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశంగా ఇప్ప‌టిదాకా చైనాదే రికార్డ్‌. ద‌శాబ్ధాలుగా ఏ దేశం కూడా ఈ విష‌యంలో దాని ద‌రిచేర‌లేదు. మ‌నం మాత్ర‌మే ఆ నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు పోటీప‌డుతూ వ‌చ్చాం. ఇప్పుడు డ్రాగ‌న్ కంట్రీలో జ‌నాభా పెరుగుద‌ల నెమ్మ‌దించింది. విచిత్రంగా జ‌నాభా సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతోంది. చైనాలో జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 తర్వాత ఇదే తొలిసారి. 2021 జనాభా లెక్కలతో పోలిస్తే 2022ఏడాదిలో జనాభా ఎనిమిదిన్న‌ర ల‌క్ష‌లు తగ్గిందని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్ తేల్చింది.

చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోద‌వ్వ‌టం అక్క‌డి జ‌నాభాపై ప్ర‌భావం చూపిస్తోంది. ఎందుకంటే ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదుకావ‌డం ఇది రెండోసారి. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లుగా గ‌ణాంకాలు తేల్చాయి. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఈ ప‌రిస్థితికి ప్ర‌ధాన కార‌ణం. 2021లో చైనాలో 1.062 కోట్ల మంది పుడితే 2022లో ఆ సంఖ్య 95.6 లక్షలకు త‌గ్గింది. అంటే 2021లో 7.52 శాతమున్న జననాల రేటు 2022లో 6.77 శాతానికి పడిపోయింది. ఆ దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య 62 శాతం న‌మోదైంది. చైనాలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం. అందుకే చైనా భ‌విష్య‌త్తుపై ఆందోళ‌న‌ప‌డుతోంది. పిల్ల‌ల్ని క‌నాల‌ని యువ‌జంట‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది.

అంచనాల కంటే ముందుగానే భార‌త్ జ‌నాభాలో చైనాను దాటేయ‌బోతోంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం భారత్‌ చైనాను మించిపోతుంది. 2050కల్లా భారత్ జ‌నాభా 166.8 కోట్ల‌కు చేర‌బోతోంది. అదే స‌మ‌యంలో 131.7 కోట్ల జ‌నాభాకే చైనా ప‌రిమిత‌మ‌వుతుంది. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ అంచనాల ప్రకారం 2022 చివరినాటికే భారత్‌ జనాభా 141.7 కోట్లు. 2023 జనవరి 18, 2023 నాటికి ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ప్రస్తుతం భారత జనాభా 142.8 కోట్లుగా మాక్రోట్రెండ్స్‌ లెక్కకట్టింది. ఇది చైనా ఇటీవల ప్రకటించిన జనాభా (141.2కోట్లు) కంటే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ నెంబ‌ర్ వ‌న్ స్థానానికి ఎగ‌బాకిన‌ట్లే.

మరోవైపు ప్రపంచ జనాభా కూడా ఈమ‌ధ్యే 800 కోట్ల మైలురాయిని దాటింది. 2022 నవంబర్‌ 15న పుట్టిన శిశువుతో జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు. 48ఏళ్లలోనే అది రెట్టింపైంది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతితో అకాల మ‌ర‌ణాల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. మ‌నిషి స‌గ‌టు జీవిత‌కాలం పెరుగుతూ పోతోంది. మరణాలు తగ్గడం, ఆయుర్దాయం పెరగడం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణమని ఐక్య‌రాజ్య‌స‌మితి అంచ‌నావేసింది.