ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం జిల్లా రాజకీయాల్లో కాక రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో తన వ్యతిరేక వర్గాన్ని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహరచనతో ముందుకెళ్తున్నారు కేశినేని. ఓ వైపు సొంత పార్టీలో వైరి వర్గానికి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు ప్రత్యర్థి పార్టీ నేతలను సైకిల్ ఎక్కిస్తూ వారిని చేరదీసే ప్రయత్నం చేస్తున్నారు కేశినేని. తనకంటూ జిల్లాలో ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకునే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో తనకు నచ్చనివారికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు ఎంపీ. అదే సమయంలో తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. దీంతో అధిష్టానం ఇరుకున పడుతోంది.
గత కొంతకాలంగా జిల్లాలో కేశినేని వర్సెస్ ముగ్గురు సీనియర్లుగా వార్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో కేశినేని నాని విజయవాడ ఎంపీగా రెండోసారి ఎన్నికయ్యాక వర్గపోరు మరింత తీవ్రతరమైంది. కేశినేని నాని వరుస విజయాలతో కుదురుకున్నా జిల్లాలో దేవినేని బోండా ఉమా బుద్ధా వెంకన్న త్రయాన్ని ఎదుర్కోవడం కష్టతరంగా మారిపోయింది. అసలే సొంత పార్టీలో నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేశినేని నానికి సోదరుడు కేశినేని చిన్ని తనతో విభేదించడం మొదలుపెట్టాక చిక్కులు మరింత పెరిగాయి. ముఖ్యంగా కేశినేని నాని ఎవరిని అయితే వ్యతిరేకిస్తున్నారో వారితోనే కేశినేని చిన్ని రాజకీయాలు చేస్తుండటం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇప్పుడు వారిని ఎదుర్కొనేందుకు కేశినేని పాత రాజకీయాల్ని పక్కనబెట్టి కొత్త తరహా రాజకీయాలు చేయాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో అధిష్టానం హైరానా పడుతోంది.
విజయవాడ పశ్చిమలో పోటీకి సిద్ధమవుతున్న బుద్ధా వెంకన్న, మైలవరంలో తిరిగి గెలిచేందుకు ప్రయత్నిస్తున్న దేవినేని ఉమ విజయవాడ సెంట్రల్లో పోటీ పడుతున్న బోండా ఉమకు చెక్ పెట్టేందుకు నాని ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత ఫ్యామిలీని టీడీపీలోకి తెచ్చేందుకు కేశినేని ప్రయత్నిస్తుండడంతో దేవినేని ఉమాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక విజయవాడ పశ్చిమలో బుద్దా వెంకన్నకు చెక్ పెట్టేందుకు జలీల్ ఖాన్ ను ప్రోత్సహిస్తున్న నాని సెంట్రల్ నియోజకవర్గంలో బోండా స్ధానంలో వంగవీటి రాధాకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వైసీపీకీ చెక్ పెట్టేలా కేశినేని నాని ప్రయత్నాలు చేస్తున్నారు. మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు ఎంపీ నిధుల్ని కేటాయించడం ద్వారా నాని తన ఉద్దేశం చెప్పేశారు. అలాగే విజయవాడ పశ్చిమలో వైసీపీ నేతల్ని తమవైపు తిప్పుకుని టీడీపీ కండువాలు కప్పేశారు. అంతేకాదు మాఫియా నేతలకు కాకుండా మంచివారికి టికెట్ ఇస్తే 25 వేల మెజార్టీతో గెలిపిస్తామని అధిష్టానానికీ సంకేతాలు ఇచ్చేశారు. తద్వారా సొంత పార్టీ టీడీపీని బలోపేతం చేస్తూ అధినేత చంద్రబాబుకు విధేయుడిగానే ఉండాలనేది నాని వ్యూహంగా కనిపిస్తోంది.
తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుకున్నాయి. బోండా ఉమ వ్యతిరేక వర్గీయుడు గోగుల రమణ నేతృత్వంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న నాని దేవినేనిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేవినేని ఉమాకు టికెట్ ఇస్తే సహకరించనని పరోక్షంగా తేల్చేశారు . దేవినేనికి యాంటీ అయిన మరో నేత బొమ్మసానికే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. బొమ్మసాని లాంటి వారే ప్రజా స్వామ్యంలో ఉండాలని పదవుల కోసం రాజుల్లా ఫీలయ్యే వారు మనకి వద్దు అంటూ దేవినేనిపై విమర్శలు గుప్పించారు కేశినేని. కేశినేని సోదరుడు చిన్ని దేవినేని ఉమవర్గంతో కలసి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న వేళ నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తంగా సీనియర్లతో ఎంపీ ఢీ అంటే ఢీ అంటుండడంతో జిల్లా టీడీపీలో రాజకీయం సెగలు కక్కుతోంది. కేశినేని దూకుడైన రాజకీయాలతో పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుబోతున్నాయి. అంతర్గత పోరుకు అడ్డుకట్ట వేసేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందనేది ఆసక్తికరంగా మారింది.