అనుభవమైతేనే తత్వం బోధపడుతుందనేది సామెత. అలాంటి అనుభవం ఆకలి అయితే చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం దాయాది దేశం పాకిస్తాన్ ది ఇదే పరిస్థితి. ఇంత కాలం అన్న పానీయాలకు లోటు లేకపోవడంతో పగ ప్రతీకారం పేరుతో రెచ్చిపోయారు. ఉగ్రవాద మూకలకు అండగా నిలిచారు. కశ్మీర్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా గోల గోల చేశారు. చేస్తున్నారు. కానీ ఇప్పుడు అసలు దరిద్రం మీదపడిపోయింది. ఆకలి అంటే ఏమిటో తెలిసి వస్తోంది. అసలు ముందు ఎలాగోలా బతికితే ఆ తర్వాత మతం జీహాద్ కశ్మీర్ నుంచి ఆలోచించవచ్చన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎంతగా ఆకలి మంటలతో వణికిపోతున్నారంటే భారత్‌కు పూర్తి స్థాయిలో లొంగిపోయారు. ఈ మేరకు సందేశాన్ని చాలా బలంగా పంపారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ .
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆహార కొరత తీవ్రంగా ఉంది. ఓ వైపు ఆర్థిక వనరులు తగ్గిపోయాయి. మరో వైపు అప్పులు ఇచ్చే వారూ లేరు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కలేక పాక్ పౌరుల ఆకలి తీర్చలేక నానా తిప్పలు పడుతున్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్ తనేంటో తెలుసుకుందని గుణపాఠం నేర్చుకుందని భారత్‌తో శాంతిని కోరుకుంటున్నామని శాంతికాముక దేశంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సహా ఇతర కీలక సమస్యలపై నిజాయితీగా చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మాట్లాడాలని భావిస్తున్నామన్నారు. పాకిస్తాన్ చానల్‌కు ఇస్తే సందేశం ఇండియా వరకూ రావడం కష్టం కాబట్టి దుబాయ్‌కు చెందిన ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత నాయకత్వానికి ముఖ్యంగా ప్రధాని మోదీకి తాను చెప్పేది ఒక్కటేనని కూర్చుని చర్చించుకుందామని సీరియస్‌గా సిన్సియర్‌గా మాట్లాడుకుందామని కశ్మీర్ సహా అన్ని అంశాలను పరిష్కరించుకుందామని పాక్ ప్రధాని అన్నారు. అంతేకాదు భారత్‌తో ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధం చేశామన్న షరీఫ్ వాటి వల్ల పాకిస్థాన్ చాలా నష్టపోయిందన్నారు.
యుద్ధాలు, ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్‌కు కష్టాలు, పేదరికం, నిరుద్యోగం మాత్రమే మిగిలాయని వాటి నుంచి పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని లెంపలు వేసుకున్నారు. భారత్‌తో కలిసి శాంతియుత పంథాలో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. ఇరు దేశాలు పరస్పరం శాంతియుతంగా అభివృద్ధిపరంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామన్నారు. కశ్మీర్లో జరిగిందేదో జరిగిపోయిందన్న షరీఫ్ ఇక అన్నీ ఆపేద్దామని పేర్కొన్నారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని చెప్పారు. బాంబులు, మందుగుండు సామగ్రిపై వృథా అవుతున్న వనరులను ఆపాలని తాము భావిస్తున్నామన్నారు. బతిమాలుకుంటున్నట్లుగా పాక్ ప్రధాని నోటి వెంట వచ్చిన ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఇండియాలో అయితే చెప్పాల్సిన పని లేదు. పాకిస్థాన్ ఇప్పుడు అంత్యుర్ధం అంచున ఉంది. దీన్నుంచి బయటపడటానికే షెహబాజ్ షరీఫ్ ఇలాంటి సంధి మాటలు మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.
పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ముదిరి ఆహార సంక్షోభం వైపు వెళ్తోంది. డిమాండ్ కి తగినంత సరఫరా లేకపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్ లో 10 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ రూ. 1500 పలుకుతుండగా 20 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ 2800 రూపాయల వరకు అమ్ముడవుతోంది. పాకిస్థాన్ లో ప్రధానమైన ఆహార పదార్థం రోటీ కావడంతో అందుకు అవసరమైన ముడి సరుకు గోధుమ పిండి ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతున్నాయి. కరాచి పెషావర్ లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్థాన్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడంతో అది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. మరోవైపు పాక్‌లో విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటాయి. ఇప్పుడు భారత్ ఎంతో కొంత ఆహారసాయం చేయకపోతుందా అని పాకిస్తాన్ ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఓ వైపు ఆహారసంక్షోభం మరో వైపు తాలిబన్లు పాకిస్తాన్ ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదులతో మారణ హోమం సృష్టించాలని పాక్‌కు చెందిన ఐఎస్ఐ ఆర్మీ కుట్రలు పన్నేవి. అచ్చం అవే ప్లాన్లను ఇప్పుడు తెహ్రికే తాలిబన్ పాకిస్థాన్-టీటీపీ ఉగ్ర సంస్థ అమలు చేస్తోంది. దాడులు మానవ బాంబులతో పాక్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది. పాకిస్థాన్‌ను వణికిస్తున్న ఉగ్ర సంస్థ తెహ్రికే పాకిస్థాన్ తాలిబన్-టీటీపీ ఉగ్రసంస్థ. దీన్నే సింపుల్‌గా పాకిస్థాన్ తాలిబన్ అని కూడా పిలుస్తారు. టీటీపీ జెండా ఎజెండా మాత్రం తాలిబన్లకు సహాయం చేయడం. 2021 ఆగస్టులో తాలిబన్లు కాబుల్‌ను వశపరుచుకోవడంతో అక్కడితో పాకిస్థాన్ తాలిబన్ లక్ష్యం పూర్తయ్యింది. అక్కడితో టీటీపీ ఆగిపోలేదు. ఇప్పుడు కొత్త లక్ష్యాన్ని ఎంచుకుంది. అది మరేదో కాదు. పాకిస్థాన్‌ను సొంతం చేసుకోవడంపై దృష్టి సారించింది. పాకిస్థాన్‌ను కూడా తాలిబన్ స్టేట్‌గా మార్చేందుకు సిద్ధమైంది. కశ్మీర్‌పై దాడులకు పాకిస్థాన్ నేర్పిన విద్యనే ప్రయోగిస్తోంది. వరుసగా ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థ నుంచి కాపాడుకోవడం పాకిస్తాన్ పాలకులకు కష్టమైపోతోంది. ఇది కూడా పాక్ పాలకుల విరక్తికి ఓ కారణం అనుకోవచ్చు.
అయితే పాకిస్తాన్ బీద అరపుల్ని భారత్ నమ్మవచ్చా అంటే మాత్రం అత్యధిక శాతం మంది వద్దనే చెబుతారు. పొరుగు దేశం ఆకలితో అలమటిస్తూంటే సాయం చేయాలని వాదించే వారు ఉంటారు. అలా చేయడం మానవత్వం అవుతుంది. అదే సమయంలో పాముకు పాలు పోస్తామా అనే డౌట్ కూడా వస్తుంది. పాపం ఆకలితో చచ్చిపోతుందని పాముకు పాలుపోస్తే అది ఆకలి తీరిన తర్వాత కాటు వేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పాకిస్థాన్ కూడా అటువంటిదే కావొచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే ప్రాణాల కన్నా ఉగ్రవాదమే మంచిదని జీహాద్ పేరుతో కాశ్మీర్ లో రణం సృష్టించిన దేశం అది. చైనా అండతో చెలరేగిపోయేందుకు ప్రయత్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలకు సాయం ఆపలేదన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకే పాకిస్థాన్ బీద అరపులను. నిస్సహాయ స్థితిని భారత్ పరిశీలించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనేది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం.