ఉత్తరాంధ్ర టీడీపీలో మళ్లీ అంతర్గత పోరు మొదలైంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. గంటా ఎవరు ఆయన ఏమన్నా పెద్ద పుడింగా అన్న స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవడండీ ఘంటా లక్షల్లో వాడొక్కడు. లక్షల్లో నేనొక్కడిని. ఘంటా ఏమైనా పెద్ద నాయకుడా, ప్రధానా. పార్టీలో అందరూ రావాలి పని చేయాలి. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక అని మాజీ మంత్రి ఘంటాపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారు. తామెవ్వరికీ వ్యతిరేకులం కాదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని విమర్శించారు.
గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా టీడీపీలో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారమూ జరిగింది. త్వరగా ఆ పని అయిపోతే బావుంటుందని టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు కూడా ఎదురు చూశారు. పైగా కాపు నేతల మీటింగ్ పెట్టి పార్టీని కొంత ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గంటా కలిశారు. ఇకపై టీడీపీలో క్రియాశీలంగా ఉంటానని ప్రకటించారు. యువగళం పాదయాత్రకు మద్దతిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ లోకేష్ యాత్రను సక్సెస్ చేయబోతున్నట్లు చెప్పుకున్నారు.
గంటా వైసీపీలోకి వెళ్లాలనుకున్నది వాస్తవమేనని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. అయితే ఇప్పటికే గుంపులు ఎక్కువయ్యారని భావిస్తున్న జగన్ కొన్ని రోజులు ఆగాలని చెప్పారట. అయితే చివరకు ఆ నిరీక్షణకు అంతే లేకుండా పోతోందని గంటా టెన్షన్ పడ్డారు. ఇంకా టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీలోకి వెళ్లలేకపోతే రెంటికి చెడ్డ రేవడు అవుతామని భయపడ్డారట. వైసీపీలోనూ గంటాను అకాడమడేట్ చేసే పరిస్థితి లేదని తేలిపోయింది. దానితో విధి లేక ఆయన మళ్లీ టీడీపీ వైపుకు ఇచ్చేశారు. ఇంతకాలం వైసీపీపై పోరాడుతూ పోలీసు దెబ్బలు తిన్న వారికి ఇప్పుడు గంటాను చూస్తే మండిపోతోంది. మూడేళ్లు హాయిగా ఇంట్లో పడుకుని ఎన్నికల నాటికి వస్తున్నారని ఆగ్రహం చెందుతున్నారు. వారి బాధను పార్టీ అధినేత చంద్రబాబు అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.