ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను అట్టహాసంగా నిర్వహించి బీజేపీపై యుద్ధం ప్రకటించారు సీఎం కేసీఆర్. 2024లో మీరు ఇంటికి మేము ఢిల్లీకి అని హెచ్చరించారు. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్సింగ్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ సభలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు కనిపించకపోవడం వెలితిగా అనిపించింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరయ్యారు. సినీనటుడు ప్రకాశ్‌రాజ్ కూడా వచ్చారు.
ఖమ్మం సభలో వీరిద్దరూ కనిపించలేదు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిచంఇన ఈ సభకు కేసీఆర్‌కు ఆప్తులైన వాళ్లిద్దరూ ఎందుకు రాలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తనకు ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయినట్టు కుమారస్వామి కేసీఆర్‌కు సమాచారం అందించారట. మరి ప్రకాశ్‌రాజ్ ఎందుకు రాలేదనే విషయంపై స్పష్టత లేదు. అసలు ఆయనకు ఆహ్వానం పంపిచారా లేదా అనేది కూడా తెలియదు. ఇకపోతే ఈ సభకు హాజరైన ముఖ్యనేతలందరూ బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. దేశంలో రాజ్యాంగ సంక్షోభం ఉందని కేరళ సీఎం విజయన్ అంటే దేశం మార్పు కోరుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని అమ్మేస్తుందని మండిపడ్డారు. అందరి ఉమ్మడి శత్రువు బీజేపీనే. అయితే బీజేపీని మోదీని తీవ్రంగా వ్యతిరేకించే ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఈ సభకు రాకపోవడం గమనార్హం. అసదుద్దీన్ ను కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆహ్వానించ లేదా లేక ఆహ్వానం పింపించినా ఆయనే హాజరుకాలేదా అనే చర్చ జరుగుతోంది. ఎం.ఐ.ఎంను ఆహ్వానిస్తే బీజేపీ దాన్ని తమకు అనుకూలంగా మల్చుకునే అవకాశం ఉందని కేసీఆర్ అసదుద్దీన్‌ను పిలవలేదని భావిస్తున్నారు. తెలంగాణలో మొదటి నుంచి ఎంఐఎం బీఆర్ఎస్కు అన్ని విధాలా తోడ్పాటునందీస్తోంది. జీహెచ్ఎంసీలో ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్ అధికారాన్ని సొంతం చేసుకుంది. అలాంటి పార్టీని ఇంత ముఖ్యమైన సభకు ఆహ్వానించకపోవడం కేసీఆర్ వ్యూహంలో భాగంమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.