అక్కడ విజయం కన్నా మెజార్టీ ఎంతనేది అసలు విషయం. బరిలో ఎవరూ నిలబడినా విజయం మాత్రం ఆ ఒక్కరిదే. గెలుపును ఇంటి చిరునామా మార్చుకుని ప్రతీ సారి రికార్డులు తిరిగరాస్తూ దూసుకుపోతున్న ఆ నియోజకవర్గమే సిరిసిల్ల. కేటీఆర్ కు విజయాల ఖిల్లాగా మారిన సిరిసిల్లలో ఈసారైనా విపక్ష అభ్యర్ధులు గట్టి పోటీ ఇవ్వబోతున్నారా..అసలు పోటీ ఉంటుందా.. ఉండదా?
నియోజకవర్గంలోని ప్రతీప్రాంతంలోను ఓట్లు టీఆర్ఎస్ కే వేసేలా ఓటర్లను అభివృద్ధి మంత్రంతో కట్టిపడేశారు. పురపాలక, ఐటీ మంత్రి కావడంతో అభివృద్ధికి చిరునామాగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. ఐటీ కంపెనీలతోపాటు టెక్స్ టైల్ ఆధారిత పరిశ్రమలను తీసుకొచ్చారు. 2018లో నేరళ్ల ఘటనపై తర్వాత మరోసారి అలాంటి ఘటన జరగలేదు. ఆనాడు ప్రతిపక్షాల విమర్శల దాడి తర్వాత కేటీఆర్ తన జిల్లాలో ఏ చిన్న విషయాన్నైనా తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సిరిసిల్ల అంటే ప్రత్యర్ధులకు హడల్
ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్ధి కేటీఆర్ ను ఈసారైనా ఎదిరించేందుకు ప్రత్యర్ధి పార్టీలు బరిలోకి దిగుతాయా అంటే డౌటే. ఎందుకుంటే కేటీఆర్ కు ఉన్న ఇమేజ్ ఇతర పార్టీలకు పోటీలో దింపాలన్న ఆలోచన లేకుండా చేస్తోంది. గత ఎన్నికల్లో కేటీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ కేకే మహేందర్ రెడ్డి మరోసారి బరిలోకి దిగడం అనుమానమే. 2018 ఎన్నికల తర్వాత మహేందర్ నియోజకవర్గానికి రావడమే మానేశారు. హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఇక బీజేపీ తరపున అభ్యర్ధులే కాదు నాయకులు ఆస్థాయిలో ఎవరు లేరని టాక్. కేటీఆర్ లాంటి బలమైన నేత పోటీ పెద్దగా ఉపయోగం ఉండదనే అభిప్రాయమే కారణం. కేటీఆర్ దూకుడుతో ప్రత్యర్ధులు పూర్తిగా చేతులెత్తేశారనే చెప్పాలి. ఈ నియోజకవర్గంపై ఇతర పార్టీలు పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టు లేవు.
నియోజకవర్గ ప్రజలతో నిత్యం టచ్ లో ఉన్నా లేకపోయినా.. తమ బాగోగులు పట్టించుకునే నేతను ఓటర్లు వదులుకోరు. పైగా కేటీఆర్ ప్రత్యేకంగా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం తరచూ ప్రజలతూ మమేకం అవుతూనే ఉన్నారు.వీలైనన్ని ప్రభుత్వ కార్యక్రమాల్ని సిరిసిల్ల నుంచే ప్రారంభించేందుకు కేటీఆర్ ఇష్టపడుతుంటారు. సిరిసిల్లను తన కంచుకోటగా మార్చుకున్నారు. దళిత బంధు స్కీం, డబుల్ బెడ్ రూం ఇళ్లు లాంటి పథకాలను కేటీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధపెట్టి అమలు చేస్తున్నారు.
బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులు ఆసరా
నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. మరమగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. పేద, వెనుకబడిన వర్గాలు చెందిన వారే ఎక్కువ. పవర్ లూమ్‌లు, టెక్స్‌టైల్ ప్రాసెసింగ్, డైయింగ్ యూనిట్లు ఉన్నందున సిరిసిల్లను టెక్స్‌టైల్ టౌన్ అని స్థానికులు పిలుస్తుంటారు. హైదరాబాద్ నుండి 130 కిలో మీటర్ల దూరంలోనే ఈప్రాంతం ఉంది.
టీఆర్ఎస్ ప్రభుత్వం దసరా కానుకగా ఇచ్చే బతుకుమ్మ చీరల బాధ్యత స్థానికంగా ఉండే నేతన్నలకి అప్పగించడంతో కార్మికులకు చేతినిండా పని దొరికింది. పవర్ లూమ్స్ ఆధూనీకరణకు అడుగులు పడటంతో.. నేతన్నల కుటుంబాలు కాస్త తెరిపిన పడ్డాయి.
ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలంగా ఉన్న ప్రాంతం సిరిసిల్ల. 2004లో ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచింది. 2009 నుంచి ఇప్పటి వరకు గులాబీ పార్టీదే విజయం. 2018 ఎన్నికల్లో కేటీఆర్ కు 125213 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్ధికి కేవలం 36వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. పోటీ చేసిన ప్రతీ సారి కేటీఆర్ కు అనుకూలంగా పడుతున్న ఓట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈసారికూడా భారీ మెజార్టీ ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. ఎన్నికలు జరిగితే అంతా ఎదురుచూసేది ఫలితాల గురించి కేటీఆర్ మెజార్టీ ఎంత దానిపైనే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ వందశాతం నమ్మకం పెట్టుకున్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది సిరిసిల్ల ఒక్కటే.