హోంమంత్రి ఆయనకిస్తే లాఠీ ఊపేస్తారట! అప్పుడే పగటి కలలు.

By KTV Telugu On 20 January, 2023
image

కొందరు నేలవిడిచి సాము చేస్తుంటారు. మరికొందరు పగటి కలలు కంటుంటారు. ఉలిక్కిపడి లేచాక వాస్తవంలోకి వస్తుంటారు. టీడీపీ సీనియర్‌ అయ్యన్నపాత్రుడు పగటిపూట పడుకునే అలవాటు ఉన్నట్లుంది. అందుకే ఆయనకి కూడా అద్భుతాలు జరిగిపోయినట్లు కలలు వస్తున్నట్లున్నాయి. నాకు హోంశాఖ ఇవ్వండి ఈ పోలీసుల పని పడతానని అయ్యన్న అంటుంటే అంతా ఉలిక్కిపడుతున్నారు. అధికారంలో ఉన్నది వైసీపీ కదా ఈయన హోంశాఖ అడుగుతున్నారంటే టీడీపీ ఎప్పుడు పవర్‌లోకి వచ్చిందని గిల్లి చూసుకుంటున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా టీడీపీ నేతలకు ఆత్రం ఆగడంలేదు. అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లు తమని కేబినెట్‌లోకి తీసుకున్నట్లు కొందరు సీనియర్లు ఊహా ప్రపంచంలో తేలిపోతున్నారు. అదే భ్రమలో మునిగిపోతున్నారు. రాబోయే కాలానికి తమకు ఏ శాఖ కావాలో కూడా ఇప్పుడే చెబుతుంటే ఆలూలేదు చూలూలేదన్న సామెత గుర్తుకొస్తోంది. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో హోంమంత్రిని తానేనంటున్నాడు విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు. తొమ్మిదినెలల్లోనే యూనిఫాం డిపార్ట్‌మెంట్‌ తన చేతుల్లోకి వస్తుందంటున్నారు. అప్పుడు చెబుతా ఒక్కొక్కళ్ల సంగతంటూ ముందస్తు వార్నింగ్స్‌ ఇచ్చేస్తున్నారు.

ఏపీలో ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. 2024 మే నెలదాకా ఆగాల్సిందే. కానీ అయ్యన్నమాత్రం తొమ్మిదినెలల్లో నేనే హోంమంత్రిని అంటున్నారు. తానొస్తే లా అండ్‌ ఆర్డర్‌ని ఎలా కంట్రోల్‌లో పెడతానో చెప్పుకుంటున్నారు. ఇంకా నయం మాక్‌డ్రిల్‌ చేయడంలేదు. ఏపీ టీడీపీ నేతల్లో అయ్యన్నపాత్రుడికి ఎప్పుడూ పోలీసులతో సమస్యే. ఆయన అంతా నా ఇష్టం అంటారు. పోలీసులేమో ఇలాగైతే కష్టం అంటారు. అక్కడే వస్తోంది తేడా. తానేం చేసినా పోలీసులు అడ్డుకోకూడదని అయ్యన్నపాత్రుడు కోరుకుంటారు. అదేమో జరిగి చావదు. అందుకే పోలీసులపై నిందలేస్తుంటారు. ఇప్పుడేమో హోంమంత్రిని కాగానే బెల్టుతీస్తానని బెదిరిస్తున్నారు.

అయ్యన్నపాత్రుడు హోంశాఖ కోరుకుంటుంటే అదే పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర మరో సీనియర్‌ ముందే ఆ పోస్టుమీద కర్చీఫేసి పెట్టారు. కాబోయే హోంమంత్రిని తానేనని అచ్చెన్నాయుడు అడ్వాన్సుగానే చెప్పేశారు. చంద్రబాబుని బతిమాలైనా ఆశాఖ తీసుకుంటానని అచ్చెన్న చెప్పిన విషయాన్ని అయ్యన్నపాత్రుడు మరిచిపోయినట్లున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అయ్యన్న, అచ్చెన్నలే కాదు ప్రతీ ముఖ్యనాయకుడూ పోలీసులమీద రాళ్లేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వస్తే తడాఖా చూపిస్తామని వేళ్లు చూపిస్తున్నారు. హోంమంత్రి ఎవరనేది తర్వాత. ముందు ఎన్నికలొచ్చి టీడీపీ గెలవాలిగా. అన్నట్లు అయ్యన్న తన పార్టీలోని నాయకుల్ని కూడా వదలడం లేదు. గంటా కాస్త యాక్టివ్‌ అయ్యారోలేదో అప్పుడే ఆయన్ని టార్గెట్‌ చేసుకున్నారు. ముందు సొంతిల్లు చక్కదిద్దుకుంటే తర్వాత హోం సంగతి చూసుకోవచ్చు!