ఒక ప్రసంగం.. వంద ప్రశ్నలు

By KTV Telugu On 20 January, 2023
image

గులాబీ దళపతి జాతీయ రాజకీయాల్లో మరో అడుగు ముందుకేశారు. పక్షం రోజులకు పైగా ఏర్పాట్లు చేసుకుని నిర్వహించిన ఖమ్మం ఆవిర్భావ సభలో కేసీఆర్ తన ఆశయాలు ఆకాంక్షలను వివరించారు. పుట్ట పగిలినట్లుగా వచ్చిన జనాన్ని ఉర్రూతలూగించే ప్రసంగం కాకపోయినా అందరికీ అర్థమయ్యే మేటర్ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక మాజీ ముఖ్యమంత్రి తరలి వచ్చిన మెగా మీటింగ్ లో కేసీఆర్ కేంద్రంపై ఒక రేంజ్ లో విరచుకుపడ్డారు. దేశం మార్పు దిశగా పయనిస్తోందని కేసీఆర్ ప్రకటించారు. మోదీని సాగనంపేందుకు బీజేపీయేతర కాంగ్రెస్సేతర కూటమి కడతామని నేరుగానే చెప్పేశారు.

దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమేమిటో కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. అధిక సంఖ్యాకులైన రైతులకు గాలం వేసే దిశగా ఆయన గాలం వేశారు. జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయంటూ తమకు ఒక సారి అధికారమిస్తే భారీ ప్రాజెక్టులు ఖాయమన్నారు దేశమంతా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. దళిత బంధు పథకం దేశమంతా అమలవుతుందని ప్రకటించారు. ప్రజా సంక్షేమమే తమ కర్తవ్యమని కేసీఆర్ ప్రకటించారు.

అంత ఖర్చు పెట్టి భారీ సభ నిర్వహించి కేసీఆర్ సాధించిందేమీటీ. ఆయన ఇచ్చిన సందేశమేమిటనేది పెద్ద ప్రశ్నే. కేసీఆర్ స్పీచ్ లో ఉద్రేకం ఉంది. ఏదో చేయాలన్న తపన ఉంది. అలాగని ఆయన చీకట్లో బాణం వేయలేదు. బక్కాయన పథకం ప్రకారమే వెళ్తున్నాడని చెప్పాలి. కేసీఆర్ ది ద్విముఖ వ్యూహం ప్రజల కోసం తాను ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నానని కేసీఆర్ వివరించారు. అదీ మొదటి వ్యూహం. ఆది ఫలించాలంటే తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన కోరుకుంటున్నారు. అదీ రెండో వ్యూహం. మొదటి వ్యూహం ఫలిస్తేనే రెండోది సాధ్యం. అందుకే రెండో వ్యూహాన్ని ప్రజల ముందు పెట్టి మొదటి వ్యూహాన్ని సక్సెస్ చేసుకునేందుకు కేసీఆర్ ఆరాట పడుతున్నారు. కేసీఆర్ తన వ్యూహంలో భాగంగానే జాతీయ నేతలకు తన చుట్టూ తిప్పుకుంటున్నారు. హైదారాబాద్ కు దూరంగా ఉండే ఖమ్మానికి కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారంటే అది ముమ్మాటికీ క్విడ్ ప్రోకో అని చెప్పాలి. మోదీని దించే క్రమంలో నాకు నువ్వు సాయం చేయ్ నేను నీకు సాయపడతానని వాళ్లు అంతర్గతంగా చెప్పుకున్నట్లయ్యింది. ఖమ్మం వచ్చిన ప్రతీ నేతకు ప్రతీ పార్టీకి కొన్ని అనివార్యతలున్నాయ్. అవే వారిని ఒక వేదికపైకి తీసుకొచ్చాయి.

కేసీఆర్ ప్రతీ సారి తిట్ల దండకం అందుకున్నట్లే కనిపిస్తారు. నిజానికి తన బలాలు, బలహీనతలు ఆయనకు తెలుసు. జ్యోతి బసు, నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్ ఎక్కువ సార్లు ముఖ్యమంత్రులుగా చేశారంటే వారి రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ ప్రతిపక్షాలు అంత బలంగా లేవు, వారికి బంధుమిత్రుల ఒత్తిడులు లేవు. ఇప్పుడు కేసీఆర్ కు చుట్టూ సమస్యలే ఉన్నాయి. వాటిని దాటుకుంటూ ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ పూర్తి చేస్తున్నారు. ముూడో సారి గెలిచేందుకు వేసే ప్లాన్ లో భాగమే బీఆర్ఎస్ అని చెప్పుకోవాలి.

కేసీఆర్ ఇక ఆగరు. మోదీపై విమర్శల మోతాదు పెంచుతారు. అదీ ఆయన రాజకీయాల్లో ఒక కోణం మాత్రమే. ఎన్నికల్లో ఎలా అనేది మరో కోణం. అసలు కోణాన్ని ఆయన ఇంకా ఆవిష్కరించలేదు త్వరలో తమ పార్టీ సిద్ధాంతాలు చెబుతామని మాత్రమే ప్రకటించారు. ఈ ఏడాది తెలంగాణతో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్ని చోట్ల కేసీఆర్ పోటీ చేస్తారో ఇంకా బైటపెట్టలేదు. ఈశాన్యంలో వచ్చే నెల జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పలేం. ఎందుకంటే అక్కడ కేసీఆర్ పేరు కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడాయన ముందున్న ఆప్షన్ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అని చెప్పకతప్పదు. ఈ ఏడాదే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. జేడీఎస్ నేత కుమారస్వామి తెలంగాణ సీఎంలు అత్యంత ఆప్తుడిగా మారారు. బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచి ప్రతీ కార్యక్రమానికి ఆయన వస్తున్నారు. ఈ సారి మాత్రం ఖమ్మానికి ఆయన రాలేదు. స్థానికంగా వేరే పని ఉండి రాలేదని చెబుతున్నప్పటికీ కేసీఆర్ కుటిల రాజకీయాలతో విసుగుచెంది రాలేదని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు తమ పార్టీకే చెందిన ఒక కన్నడ నేతను పిలిచి 500 కోట్ల రూపాయల డీల్ మాట్లాడారని కేసీఆర్ పై రేవంత్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఇప్పుడు బీజేపీకి బీ టీమ్ గా మారారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఖమ్మం సభకు ప్రకాష్ రాజ్ కూడా రాలేదు.

తమ పార్టీని దేశమంతా అమిత వేగంగా విస్తరించడం అంత సులభం కాదని కేసీఆర్ కు తెలుసు. మోదీని వ్యతిరేకించడంలో అందరినీ కలుపుకుపోవాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకోవడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు. మోదీని అలా వదిస్తే దక్షిణాదిని కూడా కబళించేస్తాడని అందరికీ తెలుసు. అందుకే వామపక్షాలు ఇప్పుడు కేసీఆర్ తో చేతులు కలపుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్, లెఫ్ట్ దోస్తీ గాఢంగా పెరిగిపోయింది. కలిసి పనిచేద్దామన్న కోరికతోనే కేరళ సీఎం పినరయి విజయన్ ఖమ్మం వచ్చారని చెప్పాలి. కేజ్రీవాల్ కు కూడా ఒక మంచి మిత్రుడు కావాలి. కాంగ్రెస్ తో జతకట్టే విషయంలో ఆప్ నేత వెనుకాడుతున్నారు. అందుకే కేసీఆర్ ఈజ్ మై ఫ్రెండ్ అంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ ను బీజేపీ సహా మరికొన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. రొటీన్ గా ప్రతి విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మోదీని తిట్టేందుకే సభ పెట్టారని కొండను తవ్వి ఎలుకను పట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిటార్టిచ్చారు.

కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ఒక టార్గెట్ అదే ఫస్ట్ టార్గెట్ అని కూడా చెప్పలేం. కాకపోతే ఏపీలో కొందమంది రాజకీయ నిరాశ్రయులను తెచ్చుకుని ఆయన బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వారికి పదవులు కూడా ఇచ్చారు అంతలోనే ఆవినీతి ఆరోపణలు వచ్చాయి. ఉత్తరాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకే ఆయన విశాఖ ఉక్కు అంశాన్ని రెండు సార్లు ప్రస్తావించారు. మోదీ ప్రైవేటీకరించిన పక్షంలో మళ్లీ పబ్లిక్ రంగంలోకి తీసుకొస్తామని కేసీఆర్ ప్రకటించడం వెనుక కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారన్నది ప్రశ్న. పైగా ఉద్యమ కాలంలో పేడ బిర్యానీలంటూ ఏపీ వారిని విమర్శించిన నోటితో ఓటు ఎలా ఆడుగుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.. దానికి ఖమ్మం సభలో ఆయన ఎలాంటి సమాధానమూ చూపలేదు.

కేసీఆర్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. అలాగని ఆయనకు చాలా టైమ్ ఉందని కూడా చెప్పలేము. ఒక సారి జాతీయ రాజకీయాలు అన్నారంటే వరుస ఎన్నికలను ఎదుర్కోవాలి. తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే 2024 ప్రారంభంలోనే లోక్ సభ ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో గెలిస్తేనే లోక్ సభ ఎన్నికల్లో ఆయన మాట కాస్తైనా చెల్లుబాటు అవుతుందని గులాబీ దళపతికి తెలుసు. నిజానికి ఖమ్మం సింహగర్జన సభ ఎఫెక్ట్ ను రాజకీయంగా ఎంత మేర ఉపయోగించుకుంటారన్నది కేసీఆర్ ముందు ముందు తీసుకుబోయే నిర్ణయాలు వేయబోయే అడుగుల పార్టీ నేతల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఓ సభ నిర్వహించి ఇదే బలం అని చూపించుకోవచ్చు కానీ దాన్నే చూపించి బలపడిపోయామని నిర్ణయానికి రాలేరు. కేసీఆర్ తీరు చూస్తూంటే వీలైనంత త్వరగా తెలంగాణలో ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆరాటం కనిపిస్తోంది. ఆ తర్వాతే లోక్ సభ ఎన్నికలకు ఆయన కూటమి కట్టాలి. బీఆర్ఎస్ భాగస్వామిగా ఉండే కూటమికి కనీసం 125 స్థానాలు రావాలి. అప్పుడే వాళ్లు కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారతారు. ఆ సంగతి కేసీఆర్ కు తెలియదనుకోలేము. కేసీఆర్ ది మొదటి నుంచి నిదానమే ప్రధానమన్న వైఖరి. తెలంగాణ ఉద్యమాన్ని స్లో అండ్ స్టడీగా ఒక రక్తం బొట్టు చిందకుండా ఆయన నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. తన ముందున్న సమయాన్ని అడ్జెస్ట్ చేసుకుంటూ సక్సెస్ అయ్యే వరకు జై భారత్ అంటూనే ఉంటారు.