లోకేష్ యాత్రపై జీవో 1 ఎఫెక్ట్?

By KTV Telugu On 20 January, 2023
image

మరో వారం రోజుల్లో నారా లోకేష్ పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఈనెల 27 నుంచి యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు లోకేష్ యాత్రకు సంబంధించి అనుమతి లభించలేదని తెలుస్తోంది. రాష్ట్ర డీజీపీ హోంసెక్రటరీలకు టీడీపీ లేఖలు రాసినా ప్రభుత్వం, పోలీసు శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదట. పర్మీషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా లోకేష్ యాత్ర జరిగితీరుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో రహదారులపై సభలు ర్యాలీల నిర్వహణ పైన ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో 1 తీసుకొచ్చింది. అయితే ఈ జీవో పైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనిపై హైకోర్టులో పిల్ దాఖలు ఖాగా నెల 23వ తేదీ వరకు జీవో 1ను సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం హఠాత్తుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన సుప్రీం ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

ఇప్పటికే ముందుగా బహిరంగ సభలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వివిధ సంస్థలు చేస్తున్న అభ్యర్థనలతో పోలీసు శాఖ అట్టుడికిపోతోంది. లోకేష్ పాదయాత్రకు రోడ్‌మ్యాప్ సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున పోలీసులు అనుమతిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే లోకేష్, పవన్ కళ్యాణ్ యాత్రలను అడ్డుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వం జీవో నెంబర్ 1న తీసుకొచ్చిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బ్రిటీష్ కాలం నాటి జీవోను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. అందుకే ఈ వివాదాస్పద జీవోను హైకోర్టు 23వరకు సస్పెండ్ చేసిందనే మాట చెబుతున్నారు. జనవరి 23 వరకు హైకోర్టులో ఫలితం వచ్చే వరకు వేచి చూడకుండా జగన్ ప్రభుత్వం సడన్‌గా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించిందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు హైకోర్టులో తిరిగి 23న విచారణకు రానుంది. హైకోర్టు సీజేఐ విచారణ వెలువడే నిర్ణయం ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి అడుగులు ఉండే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు ఈ జీవోకు సంబంధించి ప్రభుత్వంపైన రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ అన్ని పార్టీలతో కలిసి ఈ జీవోకు వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకొస్తామని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబును ఈ జీవో కారణంగా సభలు రోడ్ షోలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో బ్రిటిష్ కాలం నాటి చట్టం అమలు చేస్తారా అంటూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై బాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు పర్యటనను జీవో 1పేరుతో అడ్డుకోవడాన్నితప్పుబడుతూ విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబును కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే జీవో 1 తీసుకొచ్చినట్లు ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ జీవోను అమలు చేయాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఈ నెల 23న హైకోర్టులో విచారణ వెలువడే ఆదేశాల పైన సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది.