అనామకుడినైనా అందలం ఎక్కిస్తుంది. ఎంత పెద్ద లీడర్‌అయినా పక్కన పెట్టేస్తుంది. దటీజ్ బీజేపీ. ఈ విషయంలో కమలం పార్టీకి ఎలాంటి మొహవాటాలూ లేవు. అగ్రనేత అద్వానీ అంతటాయన్నే పట్టించుకునేవారు లేరు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీలో కీలక జాతీయనేతలు ఎవరయినా సరే అధినాయకత్వం ముద్రపడ్డాకే వాళ్లకో గుర్తింపు వస్తుంది. మరి అలాంటి పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించడాన్ని ఎలా అర్ధంచేసుకోవాలి. ఆయనే సమర్ధుడనా ఆయనంత సమర్ధుడు మరొకరు లేరనా. ఎన్నికలముందు నాయకత్వ మార్పుతో ఏవన్నా సమస్యలొస్తాయనా.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా పదవీకాలాన్ని 2024 జూన్‌దాకా పొడిగించింది పార్టీ నాయకత్వం. అంటే మరో ఏడాదిన్నర ఆయనే. ఆయన సారధ్యంలోనే కీలక రాష్ట్రాల ఎన్నికలు సాధారణ ఎన్నికలకు కమలం పార్టీ సిద్ధమవుతుందన్నమాట. 2020 జనవరిలో బీజేపీ 11వ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అప్పటిదాకా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు పార్టీ పగ్గాలు అప్పగించారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో నడ్డా నాయకత్వంపై నమ్మకంతో ఆయన్నే కొనసాగించాలనుకుంది బీజేపీ హైకమాండ్. పశ్చిమబెంగాల్‌లో బీజేపీని జీరోనుంచి ప్రధాన ప్రత్యర్థిస్థాయికి ఎదిగేలా చేయడంలో నడ్డా కృషి కారణమన్న భావనతో బీజేపీ ఉంది.
ఎక్కడైనా ఇంటగెలిచి రచ్చగెలవాటనుకుంటారు. కానీ బయట తన నాయకత్వ పటిమ చూపించిన జేపీ నడ్డా సొంతింట్లో భంగపడ్డారు. నడ్డా సొంత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారం కోల్పోయింది. అదే సమయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. దీంతో నడ్డాను తప్పిస్తారని అంతా భావించారు. కానీ ఆయన సారధ్యంలోనే బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతుండటం పార్టీ శ్రేణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. బీజేపీలో మోడీ, అమిత్‌షాల తర్వాత టాప్ త్రీలో నడ్డా ఉంటారు. ఎన్నికల ముందు అధ్యక్షుడిని మారిస్తే కొత్తగా వచ్చే నేతకు పార్టీ నిర్వహణ బాధ్యతలు చూడటం కష్టమవుతుందన్న ఆలోచనే దీనికి కారణం. నడ్డాకు ఉన్న అవగాహన పరిచయాలతో ఆయన్నే కొనసాగించడం మంచిదనుకుంది బీజేపీ. పార్టీ మళ్లీ అధికారంలోకొచ్చినా ఎక్కడైనా తేడాకొట్టినా మరో ఏడాదిన్నరైతే నడ్డానే నెంబర్ త్రీ.