గెహ్లాట్‌, పైలట్‌ల మధ్య “ముఖ్య”మంత్రి పోరు

By KTV Telugu On 21 January, 2023
image

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ నిప్పు రాజుకుంటోంది. సీఎం వర్సెస్ మాజీ డిప్యూటీసీఎంల మధ్య వార్ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇద్దరి మధ్య ఆధిపత్యపోరుతో హైకమాండ్ సతమతమవుతోంది. ఈ ఏడాదిలోనే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో కలిసి పనిచేయాల్సిన అగ్రనేతలు ఇద్దరూ పరస్పర విమర్శలకు దిగుతున్నారు. దీంతో అధినాయకత్వం పరేషాన్ అవుతోంది. ఎన్నికలకు ముందు ఇలాంటి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళనలో హస్తం అధిష్టానం ఉంది. సమయం వచ్చినప్పుడల్లా సీఎం అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేస్తుండగా. అటు యువ నాయకుడు తానేమీ తక్కువకాదన్నట్టుగా నేరుగా గెహ్లాట్‌ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెడుతున్నారు.

సచిన్ పైలట్ రాష్ట్రంలో సొంతంగా ప్రచారం మొదలుపెట్టారు. కిసాన్ సమ్మేళన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతున్నారు. ప్రశ్నపత్రం లీక్‌ల కారణంగా రాష్ట్రంలో పలు పరీక్షలు రద్దు చేయడం పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టడం వంటి పలు అంశాలపై ప్రభుత్వంపై ఫైరవుతున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ పాలన తనకే అప్పగించాలనే సంకేతాలను అధిష్టానానికి పంపుతున్నారు పైలట్. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉంది. అందరికీ ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనం విజయం సాధించగలమంటూ తన వర్షన్ వినిపిస్తున్నారు. పైలట్, గెహ్లాట్ మధ్య రాజీ కుదిర్చేందుకు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కృషి చేయడంతో సమస్య సమసిపోయిందని అంతా భావించారు. మళ్లీ ఇద్దరు నేతలు ఎవరి దారి వారే చూసుకుంటుండడంతో స్థానికంగా రాజకీయం వేడెక్కుతోంది.

వాస్తవానికి గత ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలిచినప్పుడే సీఎం రేసులోకి దూసుకొచ్చారు సచిన్ పైలట్. అయితే గెహ్లాట్ వైపే అధినాయకత్వం మొగ్గుచూపింది. అప్పట్నుంచి ఇద్దరు నేతల మధ్య మొదలైన విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఒకానొక దశలో సచిన్ పైలట్ బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేస్తామని అధిష్టానం హామీ ఇవ్వడంతో ఆగిపోయారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో యువ వృద్ధ నేతల మధ్య పోటీ తీవ్రమవుతోంది. తన సొంత బలాన్ని పెంచుకునేందుకు సచిన్ పైలట్ వేగంగా పావులు కదుపుతున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌కు మేలు జరుగుతోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ భారీ బహిరంగసభలు నిర్వహిస్తూ స్పీడ్ పెంచుతున్నారు. పార్టీ ప్రయోజనాల కోసమే బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు సచిన్ పైలట్ వర్గం వాదిస్తుండగా భారత్ జోడో యాత్రపైనే మొత్తం దృష్టి కేంద్రీకరించవలసిన సమయంలో ఈ విధంగా సభలను నిర్వహించడం వల్ల రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతఃకలహాలపై మీడియా ఫోకస్ పెరుగుతుందని గెహ్లాట్ వర్గం వాదిస్తోంది.