మమతాబెనర్జీకి గట్టి నమ్మకం. ప్రధాని కావాల్సినదాన్ని పశ్చిమబెంగాల్‌కే పరిమితమయ్యానని దీదీకి బుర్రలో తొలుస్తూనే ఉంటుంది. ఇక బీహార్ సీఎం నితీష్‌కుమార్ రాష్ట్రాన్ని లాలూ కొడుకు చేతుల్లో పెట్టి జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పేయాలనుకుంటారు. బయటపడరుగానీ ఒడిషా సీఎం నవీన్‌పట్నాయక్‌కి మాత్రం ఆ కోరిక ఉండదా ఏంటీ. ఇక ఢిల్లీ, పంజాబ్‌లలో పాగావేసిన కేజ్రీవాల్ కాలం కలిసొస్తే మోడీ అంతటివాడిని అవ్వాలని ఆరాటపడటంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఇక ఓపికల్లేకపోయినా శరద్‌పవార్‌లాంటి వాళ్లు నేను సైతం అనడంలో ముందుంటారు. దేవెగౌడలాంటివారికి అలాంటి ముచ్చట తీరిన అనుభవం కూడా ఉందాయ. మరి ఇంతమంది మమ్మల్ని మించినోళ్లు లేరనుకుంటే కేసీఆర్ నాయకత్వానికి ఎందుకు జైకొడతారు.
ఖమ్మం బీఆర్‌ఎస్ సభలో కేజ్రీవాల్‌ని, కమ్యూనిస్టుల్ని ఒ కే వేదికపైకి తెచ్చారు కేసీఆర్. యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ని కూడా కలుపుకుని మోడీకి గట్టి హెచ్చరికలే పంపారు. తానొక్కడినీ చొక్కాలు చించుకుంటే మోడీని ఓడించడం అసాధ్యమని కేసీఆర్‌కి తెలుసు. అందుకే అందరినీ కలుపుకుని పోవాలనుకుంటున్నారు. కేసీఆర్ బుర్రలో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ఎప్పుడో పుట్టింది. ఆ ప్రయత్నంలోనే గతంలో ఆయన మమతాబెనర్జీ, స్టాలిన్, దేవెగౌడ-కుమారస్వామి సహా కొందరు జాతీయనేతలను కలుసుకున్నారు. కానీ వీళ్లెవరూ మొన్నటి మీటింగ్‌లో కనిపించలేదు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు ఆరంభంలోనే మద్దతు ప్రకటించిన కుమారస్వామి, ప్రకాష్‌రాజ్ కనిపించకపోవడం చర్చకు దారితీసింది. ఈమధ్య బీజేపీకి గుడ్‌బై చెప్పి ఆర్జేడీతో చేయి కలిపిన జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ వస్తారనుకున్నా ఆయన కూడా మొహం చాటేశారు. నితీష్‌కి ఆహ్వానమే లేదన్న ప్రచారం బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం రేపింది.
జాతీయ రాజకీయాల్లో నితీష్‌కుమార్ కూడా కీలకమే. అయినా కేసీఆర్ ఆయన్ని ఆహ్వానించకపోవడం ఆశ్చర్యంకలిగిస్తోంది. బీఆర్‌ఎస్ సభ జరిగిన మర్నాడే దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నితీష్‌కుమార్. ఎన్డీయేతర పక్షాలతో కలిసి తెలంగాణ సీఎం నిర్వహించిన సభపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఒకవేళ ఆహ్వానం అందినా సావధాన్ యాత్ర, రాష్ట్రబడ్జెట్ సమావేశాలు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రాలేకపోయేవాడినని చెప్పారు. రావడం రాకపోవడం తర్వాతి సంగతి. మొదట అయితే అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నమైతే జరగాలి కదా. తెలంగాణలో జరిగింది బీఆర్‌ఎస్ సభ మాత్రమేనంటూ నితీష్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దాన్ని కొత్తకూటమి ఏర్పాటుకోసం నిర్వహించిన సభగా చూడకూడదని తేల్చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం ఖమ్మం సభకు రాలేదు.
గతంలో కోల్‌కతా వెళ్లి మరీ మమతాదీదీని కలుసుకున్నారు కేసీఆర్. మరి ఆమెని ఆహ్వానించారో లేదో తెలీదు. ఆమెకూడా ఈ సభకు దూరంగానే ఉన్నారు. అందరికంటే ముఖ్యంగా కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమార స్వామి కనిపించకపోవడంపై అంతా చెవులు కొరుక్కున్నారు. ఎందుకంటే బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభ సమయంలో ఆయన కేసీఆర్‌తో ఉన్నారు. కర్నాటకలో జేడీఎస్‌తో కలిసి పనిచేస్తామని రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని కేసీఆర్ సంకేతాలిచ్చారు. ఆయన ఖమ్మం సభలో ముందుంటారనుకుంటే రానేలేదు. కుమారస్వామి పంచరత్న యాత్రలో బిజీగా ఉండటంతో రాలేకపోయారని బీఆర్‌ఎస్ నేతలు వివరణ ఇచ్చారు. అయితే కేసీఆర్ నిర్వహించిన బీజేపీ, కాంగ్రెసేతర కూటమికి మద్దతు విషయంలో కుమారస్వామి ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయారని సమాచారం. గతంలో కాంగ్రెస్ మద్దతుతోనే కర్ణాటక సీఎం అయిన కుమారస్వామి ముందుచూపుతోనే ఈ సభకు దూరంగా ఉన్నారంటున్నారు. ఎవరి కారణాలు వారికున్నా అందరినీ కలుపుకుని పోయే విషయంలో గులాబీబాస్ భేషజాలు విడిచిపెట్టాలన్న మాట కూడా పార్టీ నేతల నోట వినిపిస్తోంది.