అర్హత ఉన్నా.. లేకున్నా పథకాల లబ్ధిదారులు అవుతున్నారా. నిద్రలేచింది మొదలు మళ్లీ నిద్రపోయే వరకు పథకాలను అనుభవిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారా ? పథకాలు కూడా వింతగా ఉంటున్నాయా ? అనుకోకుండా అందుతున్న వింత పథకాలతో జనానికి పనిచేసే అవసరం లేకుండా పోయిందా ? ఓసారి చూద్దాం..
ఎన్టీఆర్ ప్రారంభిస్తే… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఊపందించారు. సంక్షేమం ఒక్కటే జనానికి చేరువయ్యే మార్గమని నిర్ణయానికి వచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు పేరుతో పేదలకు 40 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. 108… 104 స్కీముల ద్వారా గర్భిణులు, యాక్సిడెంట్స్ కు గురైనా వాళ్లు ఆస్పత్రులకు చేరే అవకాశం కల్పించారు. పిల్లలను విద్యాలయాలకు తీసుకొచ్చిన పథకం ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పక తప్పదు. వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ తో 33 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందారు.. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ వచ్చిన తర్వాత పథకాలు బాగా పెరిగాయి. రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడినా కూడా ప్రభుత్వాలు లెక్కచేయడం లేదు.. అందులో కొన్ని వింతగా అనిపించే పథకాలు కూడా ఉన్నాయనుకోండి…..
వింత వింత పథకాలు
ప్రభుత్వ పథకాలు చాలా వింతగా ఉంటాయి. పథకాలు ఎందుకు అమలు చేస్తున్నారో…. ఎవరి కోసం అమలు చేస్తున్నారో అర్థం కాని దుస్థితి. పిల్లల్ని బడికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం వారి తల్లిదండ్రుల ఖతాలో డబ్బులు వేస్తోంది. పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తూనే పెద్దలకు మళ్లీ డబ్బులు ఇవ్వడం పెద్ద వింత. జగనన్న అమ్మ ఒడి పేరుతో పిల్లల సంరక్షకులకు ఏటా 15 వేల రూపాయలు అందిస్తున్నారు. అయితే ఇదంతా ప్రచార పటాటోపమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హాస్టల్ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఆపేసి.. విద్యాదీవెన పేరుతో అదే సొమ్ము అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఇళ్ల స్థలాలకు, పంట భూములకు లింకు పెట్టారు. ఇళ్ల స్థలాలు లేని వారికి నివాసాలు ఏర్పాటు చేయడం మంచిదే అయినా… రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాలు మెట్టకు మించి ఉండకూడదని నిబంధన విధించడమే వింతగా ఉంది. పండని పొలం ఏమి చేసుకోవాలి… పొలం ఉన్నా కడు పేదరికంలో మగ్గుతున్న వారు లేరా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జగనన్న చేదోడుకు… భూములకు లింకు పెట్టడం కూడా విమర్శలకు తావిస్తోంది…
కేసీఆర్ పాలన తొలి నాళ్లతో అత్యంత వింత పథకాల్లో గొర్రెల పంపిణీ ఒకటి తొలి విడద పంపిణీ పూర్తి కాకుండానే రెండో విడతకు శ్రీకారం చుట్టారు. 21 గొర్రెలు ఒక యూనిట్ గా మూడు లక్షల 60 వేల యూనిట్ల పంపిణీ చేయాల్సి ఉండగా.. అందులో పదో వంతు కూడా జరగలేదు. పైగా పశు సంవర్థక శాఖ అధికారులకు దళారులు తోడై.. గొర్రెలను పంపిణీ చేయకుండానే చేసినట్లు లెక్కలు చూపించారన్నది మరో ఆరోపణ. అసలు గొర్రెలు పంపిణీ చేసే బదులు గొల్ల, కురుమలకు నగదు బదిలీ చేసి… వాళ్లే గొర్రెలు కొనుక్కునే అవకాశం ఇస్తే బావుండేదన్నది కొందరి వాదన. తనది కాని గొర్రెల పంపిణీని ప్రభుత్వం ఎందుకు నెత్తిన వేసుకున్నదో.. ఇదేమీ వింత పోకడో అర్థం కాక.. సంక్షేమ రంగ నిపుణులు ప్రశ్నలు సంధిస్తున్నారు…
ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ
సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నప్పటికీ… లబ్ధిదారుల్లో ఆసక్తి ఏ మాత్రం కనిపించడం లేదు. వాటిని స్వీకరించేందుకు వాళ్లు ముందుకు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం పురోహితులు, పాస్టర్లు, ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ. 5వేల చొప్పున గౌరవవేతనం అందిస్తోంది. ఐతే పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనంపై ఆశించినస్థాయిలో స్పందన రాలేదు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది ముందుకు రాలేదు. నిబంధనలు సడలించినా పాస్టర్లు పెద్దగా ఆసక్తిచూపలేదు. కరోనా సమయంలో పాస్టర్లకు 10వేల ఆర్ధిక సాయం చేసినప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 30వేల మంది అప్లికేషన్లు ఇచ్చారు. తర్వాత ఎలాంటి ప్రయోజనం లేదంటూ గౌరవ వేతనానికి పాస్టర్లు దరఖాస్తు చేసుకోవడం లేదు…
ఏదేమైనా… అనాలోచిత సంక్షేమం పక్కదారి పడుతుందనే చెప్పాలి. జనానికి అవసరం లేకపోయినా ఓట్ల కోసం పథకాలు ప్రవేశ పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పరిస్థితి పోతేనే రాష్ట్ర ఖజానా నిలదొక్కుకుంటుంది…