మీవాడు కాదు బాస్‌.. ఆయన అందరివాడు. తమ్ముడికి ఆపద్బాంధవుడు!

By KTV Telugu On 21 January, 2023
image

అప్పుడెప్పుడో ప్రజారాజ్యాన్ని సముద్రంలాంటి పార్టీలో విలీనం చేశారు. అందుకు ప్రతిఫలంగా కేంద్రమంత్రి పదవి అందుకున్నారు. ఆ ముచ్చట తీరిపోగానే మళ్లీ అటువైపు చూడలేదు. ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. అయినా ఆయన మావాడంటోంది కాంగ్రెస్‌. రాష్ట్ర విభజన తర్వాత దిక్కూదివాణం లేని ఏపీ కాంగ్రెస్‌కి మెగాస్టార్‌ చిరంజీవే పెద్దదిక్కులా కనిపిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా పిలిచినా పిలవకపోయినా చిరంజీవి మాపార్టీలోనే ఉన్నాడంటూ ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రుద్రరాజు చెబుతున్నారు. అంటే రాజీనామా చేయకపోతే కాంగ్రెస్‌ లెక్కప్రకారం ఆయన పార్టీలోనే, పార్టీతోనే ఉన్నట్లన్నమాట!

ఏపీ కాంగ్రెస్‌ పరిస్థితి చూస్తే జాలేస్తోంది. గాడ్‌ఫాదర్‌ డైలాగ్‌ ఆ పార్టీకి ప్రాణం పోసినట్లుంది. రాజకీయానికి నేను దూరమయ్యాను కానీ రాజకీయం నాకు దూరం కాలేదంటూ ఆ సిన్మాలో చిరంజీవి డైలాగ్‌ ఉంటుంది. అందుకే ఆయన ఇంకా రాజకీయాలకు దూరం కాలేదని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుంది. కాంగ్రెస్‌కి రాజీనామా చేయలేదు కొత్తగా ఏ పార్టీలో చేరలేదు కాబట్టి సాంకేతికంగా మెగాస్టార్‌ తమ పార్టీ నాయకుడేననుకుంటోంది. కానీ చిరంజీవి పదేపదే తనకు రాజకీయాలతో సంబంధంలేదని కనీసం ఏపీలో తనకు ఓటుహక్కు కూడా లేదని చెప్పిన విషయాన్ని కాంగ్రెస్‌ విస్మరిస్తోంది. ఆయనకు ఓటు లేకపోయినా ఫర్లేదు ఏ కార్యక్రమానికి రాకపోయినా ఫర్లేదు. ఫ్లెక్సీల్లో ప్రచారాల్లో ఆయన ఫొటో ఉంటే అదే పదివేలు అనుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఉండటమే దయనీయం. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సమయంలో చిరంజీవికి కూడా డెలిగేట్‌ ఐడి కార్డు రిలీజ్‌ చేసి కాంగ్రెస్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది.

పార్టీకి ఆయన టచ్‌లో లేకపోయినా మీరు కూడా వచ్చి ఓటేయొచ్చంటూ ఐడీ కూడా ఇచ్చేసింది. ఇప్పుడేమో భలేవారే చిరంజీవి మా వాడే. పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీలతో ఆయన అనుబంధం విడదీయలేనిదంటూ బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పుకొస్తున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ రుద్రరాజు. తమ్ముడి పార్టీ జనసేనకు మెగాస్టార్‌ ఆశీస్సులున్నాయి. ఆమధ్య ఆయన జగన్‌కి కానీ జనసేనకు కానీ తాను దగ్గర కాదని దూరం కాదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఎక్కడా కాంగ్రెస్‌ ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసినప్పుడు జీవితాంతం అదే పార్టీలో నమ్మకమైన కార్యకర్తగా ఉంటానని చిరంజీవి చెప్పారు. కాంగ్రెస్‌ ఇంకా ఆ మాటనే పట్టుకుని వేలాడుతున్నట్లుంది. కానీ రాజకీయాలు వదిలేసి వెండితెరపై బిజీ అయిన వాల్తేరువీరయ్య తానెవరివాడినో క్లారిటీ ఇచ్చే పరిస్థితుల్లో అయితే లేరు. ఎందుకంటే తాను అందరివాడిననుకుంటారు చిరంజీవి. అందరినీ ఆలాగే అనుకోమంటారు. తప్పేంలేదు కాంగ్రెస్‌ పోస్టర్లు, ఫ్లెక్సీల్లో వేసుకున్నా ఆయనేం ఫీల్‌కారు!