ఈరోజు గాంధీభవన్లో చిత్రవిచిత్రమైన దృశ్యాలు కనిపించాయి. ఎవరూ ఊహించని సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇన్నిరోజులు ఉప్పు నిప్పులా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎం.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులు కలిపారు. రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నన్ని రోజులు తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కను అని శపథం చేసిన కోమటిరెడ్డి ఒట్టు తీసి గట్టున పెట్టి గాంధీ భవన్లో అడుగుపెట్టడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్కం ఠాగూర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు థాకరే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత వారం మొదటి సారి రాష్ట్రానికి వచ్చిన మాణిక్ రావు సీనియర్లతో భేటి అయ్యారు. కొంతకాలంగా అంటీ ముట్టనట్లుగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా సమావేశానికి ఆహ్వానించారు.
కానీ తాను గాంధీభవన్లో అడుగు పెట్టనని కోమటిరెడ్డి ఖరాకండిగా చెప్పారు. పైగా పీసీసీ చీఫ్ రేవంత్ తీరుపై మాణిక్రావుకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గేకు కూడా రేవంత్ రెడ్డి గురించి కంప్లయింట్ చేశారు. ఇప్పుడు మరోసారి మాణిక్రావ్ మరోసారి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డిని కూడా రమ్మని థాక్రే ఆహ్వానించారు. దాంతో ఏడాది తరువాత ఆయన గాంధీభవన్లో అడుగు పెట్టారు. మాణిక్రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తనకు సరైన గౌరవం దక్కాలని థాక్రేకు తేల్చి చెప్పారు. కమిటీల్లో తాను చెప్పిన పేర్లు లేవని అభ్యంతర వ్యక్తం చేశారు. పార్టీలో సమిష్టి నిర్ణయాలు ఉండాలని సూచించారు.
అయితే అంతకుముందు ఒక విచిత్రం జరిగింది. రేవంత్ రెడ్డి మీద ఒంటికాలిమీద లేచే కోమటిరెడ్డి కూల్ అయ్యారు. రేవంత్ కోమటిరెడ్డి ఇద్దరూ పక్కపక్కనే కూచుని చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ దృశ్యం చూసి కాంగ్రెస్ కార్యకర్తలు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. మరో విచిత్రం ఏమిటంటే ఎప్పుడూ గాంధీభవన్లో కనిపించే సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అలిగి గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు. తాను నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్కు థాక్రేను ఆహ్వానించాలనుకున్నారు. ఇదే విషయంపై మహేష్ గౌడ్ తో ఆయనకు గొడవ జరిగింది. దాంతో వీహెచ్ బయటకు వెళ్లిపోయారు. మొత్తానికి థాక్రే చొరవతో ఉప్పు నిప్పులా ఉన్న రేవంత్ కోమటిరెడ్డి చేతులు కలపడం శుభపరిణామం అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.