మేం ఢిల్లీకి.. మోదీ ఇంటికి ఇని కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్‌గా ఖమ్మం భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావసభలో ప్రకటించారు. కేసీఆర్ లో అంత కాన్ఫిడెన్స్ ఉందంటే తదుపరి ఆయన వేసే అడుగులు కూడా వాటిని బలపరిచేలా ఉండాలి. అంటే ఇక నుంచి ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ పడాలి. అది దక్షిణమా ఉత్తరమా ఈశాన్యమా అన్నది మ్యాటర్ కాదు. బీఆర్ఎస్ పోటీ పడాలి. అక్కడ బ్యాలెట్లలో బీఆర్ఎస్ గుర్తు కనిపించాలి. గెలుస్తామా లేదా అన్న సంగతి తర్వాత ముందు తమకు అన్ని చోట్లా కనీస ఆదరణ ఉందని ఎన్నికల ద్వారా ఫ్రూవ్ చేయాలి. కేసీఆర్ ఇప్పుడు అదే కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అక్కిడ నేతలు వచ్చి టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. దీంతో కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వేయబోయే తొలి అడుగు ఈశాన్య రాష్ట్రాల్లోనే ఉండేటట్లుగా చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలే కదా అని తేలిగ్గా తీసుకోలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్లుగానే ఆ పార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల నాగాలాండ్‌కు చెందిన కొంత మంది కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారు తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్కు చెందిన కొంత మంది కీలక నేతలతోనూ చర్చలు జరిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాగాలాండ్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వై సులంతుంగ్ హెచ్ లోథా వారం రోజుల కిందట మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిశారు. తాను నాగాలాండ్ ఎన్సీపీని బీఆర్ఎస్లో విలీనం చేస్తానని ప్రకటించారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నాగాలాండ్‌లో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సైతం హాజరైన ఆయన కేసీఆర్ నేతృత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లోథా చేరిక దాదాపుగా ఖరారయింది. నాగాలాండ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం ఖాయమైపోయింది. బీఆర్ఎస్ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన వై సులంతుంగ్ హెచ్ లోథా కష్టపడితే బీఆర్ఎస్ అక్కడ ఖాతా కూడా తెరిచే చాన్స్ ఉంటుంది.
తెలంగాణ బీజేపీ నేతలు ఇటీవలి కాలంలో తాము తెలంగాణలో త్రిపుర ప్లాన్ అమలు చేసి అధికారంలోకి వస్తామంటున్నారు. త్రిపురలో గతంలో బీజేపీకి ఒక్క సీటే ఉండేది. ఓటు బ్యాంక్ తక్కువ. కానీ గత త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించింది. త్రిపుర టీ తోటల కార్మికులు ఇతర తెగల సెంటిమెంట్లను పక్కాగా ఉపయోగించుకుని ఆరెస్సెస్ కార్యకర్తల సాయంతో ప్రతి పది మంది ఓటర్లను రౌండప్ చేసి విజయం సాధించింది. అయితే అక్కడ ఓటర్లు తక్కువ. ఒక్కో నియోజకవర్గానికి యాభై వేల మంది కూడా ఉండరు. కానీ తెలంగాణలో అలా ఉండదు. కానీ బీజేపీ మాత్రం ఈ ఫార్ములానే ప్రయోగిస్తామని చెబుతోంది. కానీ ఇంకా ఎంత వరకు పని ప్రారంభించారో తెలియదు. కానీ బీఆర్ఎస్ మాత్రం త్రిపురలో ఉనికి చాటేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు అంటే ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆ సవాళ్లను ఎదుర్కోవాలంటే బలం కావాలి. ఆ బలం తాము కల్పిస్తామని తమ పార్టీ తరపున పోటీ చేయాలని బీఆర్ఎస్ నుంచి త్రిపురలోని కొంత మంది సీనియర్ నేతలకు ఆఫర్లు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. త్రిపుర నుంచి కొంత మంది సీనియర్ నేతలు హైదరాబాద్ వచ్చి చర్చలు కూడా జరిపారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం త్రిపుర బీజేపీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. మిత్రపక్షం ఐపీఎఫ్టీతోనూ బీజేపీ సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని కేసీఆర్ క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.
మేఘాలయలో సరైన ప్రతిపక్షం లేదు. అలాగని ఒకే పార్టీ అధికారంలోకి వచ్చేంత సింపుల్ రాజకీయం కూడా అక్కడ లేదు. ప్రస్తుతం నేషనల్ పీపుల్స్ పార్టీ తరపున కన్రాడ్ సంగ్మా సీఎంగా ఉన్నారు. ఆయన బీజేపీని దూరం పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అరవై అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో రెండు అంటే రెండు స్థానాలను మాత్రమే బీజేపీ గెల్చుకుంది. సంగ్మా నేతృత్వంలోని ఎండీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి ఎన్డీఏ పాలనలో ఉన్న రాష్ట్రం అనే ముద్ర అయితే వేయించుకోగలిగారు. అక్కడ ప్రజల్లో పలుకుబడి ఉన్న బలమైన నేతలు చాలా మంది ఉన్నారు కానీ వారికి సరైన ఫ్లాట్ ఫాం లేదు. పార్టీ పెడితే ఎలా నడపాలన్న ధైర్యమూ వారికి అలాంటి వారికి కేసీఆర్ బీఆర్ఎస్ తరపున సందేశాలు పంపారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేఘాలయలోనూ బీఆర్ఎస్ పోటీ ఉంటుందని సంచలనాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ చేయడానికి కేసీఆర్ కు మరో ముఖ్యమైన కారణం కూడా కళ్ల ముందే కనిపిస్తోంది. అదేమిటంటే పార్టీకి జాతీయ హోదా తీసుకు రావడం. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. మూడు ఈశాన్యరాష్ట్రాల్లో పోటీ చేస్తే బీఆర్ఎస్ నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసినట్లవుతుంది. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. స్థానిక నేతల్ని చేర్చుకుంటే సులువే. ఎందుకంటే అక్కడి ఓటర్లు చాలా తక్కువ. అలా చేస్తే నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీగా గుర్తింపు వస్తుంది. అంటే ఆటోమేటిక్ గా జాతీయ పార్టీ గా బీఆర్ఎస్కు గుర్తింపు లభిస్తుంది.
బీఆర్ఎస్గా టీఆర్ఎస్ను మార్చిన తరవాత ఇంకా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈశాన్యం నుంచే కేసీఆర్ తొలి అడుగు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ కేసీఆర్ ప్రణాళికలు అనుకున్నట్లుగా సాగితే లోక్ సభ ఎన్నికలకు ముందే జాతీయ పార్టీ హోదా వచ్చేస్తుంది.