రష్యా ఉక్రెయిన్‌ల మధ్య గత సంవత్సరం కాలంగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ నాటో లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలను రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. ఉక్రెయిన్ వెనక్కి తగ్గకపోవడంతో ఆ దేశంపై గత సంవత్సరం ఫిబ్రవరిలో రష్యా సైనిక చర్యకు దిగింది. ఈ యుద్ధం ప్రభావం యూరప్ మీద తీవ్రంగా ఉంది. రష్యాపై యూరప్ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. అయినా రష్యా కానీ ఉక్రెయిన్ కానీ వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై రకరకాల వదంతులు ప్రచారంలో ఉన్నాయి.
క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారని కూడా వార్తలొచ్చాయి. ఆ ఆనుమానాలకు బలం చేకూర్చేలాగా పుతిన్ కొన్ని రోజులుగా బహిరంగంగా కనిపించలేదు. డిసెంబర్ నెలలో జగాల్సిన వార్షిక ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ బతికి ఉన్నారో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా జరిగిన ప్రైవేట్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. రష్యాతో శాంతియుత చర్చలు ఎప్పుడు ప్రారంభిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు జెలెన్‌స్కీ ఈ విధంగా స్పందించారు. నేను ఎవరితో దేని గురించి మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు.
రష్యా అధ్యక్షుడు అందుకు సరైన వ్యక్తా అన్నది నాకు ఖచ్చితంగా తెలియదు. అసలు ఆయన బతికే ఉన్నారా. నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారా లేక ఇంకెవరైనా తీసుకుంటున్నారా. మేం ఎవరితో శాంతి చర్చలు జరపాలో నాకు అర్థం కావడం లేదు అన్నారు. జెలెన్‌స్కీ వ్యాఖ్యలను రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి ఖండించారు. ఉక్రెయిన్‌కు జెలెన్‌స్కీకి పుతిన్ పెద్ద సమస్యగా మారాడు కాబట్టే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందని విమర్శించారు. రష్యా ఉనికిలోనే ఉందని ఎప్పటికీ ఉంటుందని ఈ విషయం జెలెన్‌స్కీ ఎంత త్వరగా గుర్తిస్తే ఉక్రెయిన్‌కు అంత మంచిది అని రష్యా ప్రతినిధి వ్యాఖ్యానించారు.