విశాఖ కేంద్రంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విశాఖ టూర్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈనెల 28న కేసీఆర్, జగన్‌లు సాగరతీరంలో భేటీ అవుతారనే టాక్ హీట్ పెంచుతోంది. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పుడు కేసీఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒకటిరెండు సార్లు కలిసి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. కానీ ఆ తర్వాత కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు వివాదాలతో పాటు అనేక అంశాల్లో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ సీఎంలు ఇద్దరూ కలిసి కనిపించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. విశాఖలోని శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందడంతో సీఎం జగన్ ఈ నెల 28న విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. శారదా పీఠంలో జరిగే రాజశ్యామల యాగంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ యాగం చేసిన వారికి మంచి ఫలితాలు ఉంటాయనే నమ్మకం ఉంది. గతంలోనూ జగన్ శారదాపీఠంలో జరిగిన యాగంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అధికారంలోకి రావడంతో పలుమార్లు శారదాపీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్ వచ్చే ఉగాది నుంచి అక్కడ పరిపాలన ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. అదే విధంగా మార్చిలో రెండు అంతర్జాతీయ ఈవెంట్స్ విశాఖ కేంద్రంగా జరగనున్నాయి. ఈ రెండు ఈవెంట్స్ లోనూ సీఎం పాల్గొనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలనే వ్యూహరచనతో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ సీఎం తన మార్క్ చూపించాలనుకుంటున్నారు.
ఇక శారదాపీఠం ఆహ్వానం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా అందిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఏ రోజు విశాఖ వస్తారన్న దానిపై స్పష్టత లేదు. కానీ తప్పకుండా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని తెలుస్తోంది. కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా రాజ శ్యామల యాగం చేయిస్తూ ఉంటారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభ సమయంలోనూ ఈ యాగం నిర్వహించారు. గతంలోనూ విశాఖ శారదా పీఠం సందర్శించిన కేసీఆర్ అక్కడ స్వామి స్వరూపానంద ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి కేసీఆర్ విశాఖ రానున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. విశాఖ రానున్న కేసీఆర్‌కు జగన్ స్వాగతం పలుకుతారా లేదంటే వ్యక్తిగత పర్యటనగా భావిస్తారా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.