వీళ్లద్దరిని ముందు పెడితే చుక్కలు కనపడతయా…. బీజేపీ మైండ్ మార్చిన డైలాగ్

By KTV Telugu On 13 June, 2022
image

తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రఘునందన్ కీలకంగా మారారు. ప్రత్యర్థులపై బూతులు తిట్టడం కన్నా నిర్మాణాత్మకంగా ఇరుకున పెట్టడంలో విజయవంతం అవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా  టీఆర్ఎర్, మజ్లిస్‌తో పాటు కాంగ్రెస్ కూడా ఆయననే టార్గెట్ చేయడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రేప్ కేసులో నిందితుల్ని పోలీసులు కాపాడుతున్నారంటూ ఆయన కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. రఘునందన్ విడుదల చేసిన వీడియోలతోనే పోలీసులు ఎమ్మెల్యే కొడుకు కూడా రేప్ ఘటనలో ఉన్నాడని కేసు నమోదు చేయాల్సి వచ్చింది. లేకపోతే అప్పటికే ఆయనకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంత సంచలనానికి కారణం అయిన రఘునందన్‌పై పోలీసులు మైనర్ల వివరాలను బయట పెట్టారంటూ కేసులు పెట్టారు. ఆయనపై కాంగ్రెస్ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. కేసులు పెట్టడం కరెక్టేనంటున్నారు. ఇక టీఆర్ఎస్, ఎంఐఎం నేతల గురించి చెప్పాల్సిన పని లేదు.

అందరూ విరుచుకుపడుతున్నా రఘునందన్ రావు మాత్రం తన వాదన కూల్‌గా వినిపిస్తున్నారు. తానే మీడియా చానళ్లతో మాట్లాడుతూ తాను ఎవరి ఐడెంటీటీ  బయటపెట్టలేదని.. చెబుతున్నారు. తనకు ముఫ్పై ఏళ్ల లాయర్ అనుభవం ఉందని.. గుర్తు చేస్తున్నారు. నిజానికి రఘునందన్ బయట పెట్టిన వీడియో, ఫోటోల్లో ఎవరి ఫేసూ ప్రత్యేకంగా కనిపించడం లేదు. అయినా ఆయనపై కేసులు పెట్టారు. ఆయన పోరాడుతున్నారు. ఆయన వాదనకు అన్ని చోట్లా మద్దతు లభిస్తోంది. కానీ అనూహ్యంగా బీజేపీలో మాత్రం పెద్దగా స్పందన కనిపించడం లేదు. రఘునందన్ రావుకు మద్దతుగా బీజేపీలో ఎవరూ మాట్లాడటం లేదు. తమ ఎమ్మెల్యేపై కేసు పెట్టడాన్ని ఏ పార్టీ అయినా సీరియస్‌గా తీసుకుంటుంది. కానీ రఘునందన్ విషయంలో చాలా వరకూ స్పందించడానికే ఆసక్తి చూపించడం లేదు.

అదే సమయంలో ఈటల రాజేందర్ ను కూడా భారతీయ జనతా పార్టీ లో ప్రోఫైల్‌లో ఉంచుతోంది. ఆయనకు ప్రాధాన్యం దక్కనీయడం లేదు. ఆయన వాయిస్ ఎక్కడా వినిపించకుండా చేస్తున్నారు. హుజురాబాద్‌లో ఈటల గెలుపు తర్వాత ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది. ఈటలకు తెలంగాణ ఉద్యమ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాడు వైఎస్ ప్రలోభాలకు సైతం లొంగకుండా పోరాడిన ఘనత ఆయనది. రాజకీయాల కారణంగా ఆయన బీజేపీలో చేరారు. అలాంటి నేతను పక్కాగా ఉపయోగించుకుంటే బీజేపీకి వచ్చే అడ్వాంటేజ్ వేరుగా ఉంటుంది. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఘన విజయంతో ఈటల రాజేందర్ క్రేజ్ పెరిగింది. ఆయన ఎక్కడకు వెళ్లినా జనం భారీగా వచ్చారు.  ఈటల కూడా ఇతర ప్రాంతాల్లో బహిరంగసభలు పెడతానని ప్రకటించారు. కానీ ఆయనను తర్వాత నియంత్రిచేశారు.

బీజేపీలో ఈటల రాజేందర్ చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యమ కారుల్ని ఆకర్షిస్తున్నారు. స్వామిగౌడ్ ను బీజేపీలో చేర్చారు. టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సి.విఠల్‌ను కూడా పార్టీలో చేర్చారు. మాజీ ఎన్జీవో నేత దేవీ ప్రసాద్, ప్రైవేటు ఉద్యోగుల జేఏసీ ఇలా అందరితోనూ చర్చలు జరిపి బీజేపీలో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్‌పై ఉద్యమకారులు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారని… అలాంటి వారు తమకు అవకాశాలు వస్తాయంటే బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారని.. అలాంటి వారితో చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి తనకు ఉన్న బలం.. బలంగతో బీజేపీని బలపరచడానికి చేతనైనంత సాయం చేస్తున్నారు.

అటు రఘునంనదర్.. ఇటు ఈటల ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. రెండు ఆర్‌లు చెలరేగిపోతున్నారు. రెండు వైపుల నుంచి ఈ ఇద్దరూ చెలరేగిపోతూంటే.. బీజేపీకి అడ్డేముంటుందన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. కానీ బీజేపీ అగ్రనేతలు వీరిద్దర్నీ పక్కన పెట్టేశారు. ఒకరిపై కేసులు పెడితే అసలు పట్టించుకోవడం లేదు.. మరొకర్ని అసలు నోరెత్తడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. రఘునందగ్ కి వాయిస్ ఉన్నది… ఈటలకు జనంలో సింపథీ సన్ ఆఫ్ ద సాయిల్ ఇమేజ్ ఉన్నది. బీజేపీ ఈ అడ్వాంటేజ్ ను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

అయితే బీజేపీలో ఉన్న అంతర్గత రాజకీయాల కారణంగానే అటు ఈటలను.. ఇటు రఘునందన్‌ను దూరం పెడుతున్నారని అంటున్నారు. బీజేపీలో ఇప్పుడు బండి సంజయ్ మాత్రమే హైలెట్ అవుతున్నారు. బీజేపీ ఏం సాధించినా ఆయన ఖాతాలోకే వెళ్లాలన్నట్లుగా ఉంది. నిజం చెప్పాలంటే ఆయనకు మాత్రమే మాట్లాడే అవకాశం లభిస్తోంది. ఇతరులకు పెద్దగా చాన్స్ రావడం లేదు. హైలెట్ కావడం లేదు. బీజేపీలో కూడా బండి సంజయ్ వర్గమే లీడ్ చేస్తోంది. అందర్నీ ఉపయోగించుకుంటే పార్టీ గెలుస్తుంది కానీ ఇలా.. అంతర్గత రాజకీయాలతో నియంత్రించుకుంటానికి ప్రయత్నిస్తే బూడితే మిగులుతుందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి చర్యల వల్లే అప్పుడప్పుడు… ఈటల లాంటి వాళ్లు ఇతరులతో కలిసి కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తూంటాయి.

ఎలా చూసినా బీజేపీ ఇద్దరు కీలక నేతల్ని నిర్లక్ష్యం చేస్తూ.. గెలుపు అవకాశాల్ని మరింత సంక్లిష్టం చేసుకుంటోంది. దానికి ఆ పార్టీ నేతల్లో పెరిగిపోయిన స్వార్థమే కారణం అనుకోవాలి.