ఆ ఒక్కటీ గెలిస్తే మనమే నంబర్ వన్‌

By KTV Telugu On 23 January, 2023
image

భారత క్రికెట్‌లో పూనకాలు లోడింగ్ అవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా ఆదరగొడుతోంది. భారత ఆటగాళ్లు ఒకరిని మించి ఒకరు ఆడేస్తూ రికార్డులు కొల్లగొడుతున్నారు. మరో మ్యాచ్‌ మిగులుండగానే న్యూజిలాండ్‌పై సిరీస్ గెలుచుకున్న భారత్, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి దూసుకొచ్చింది. మిగిలిన ఆ ఒక్కటీ గెలిస్తే నంబర్ వన్ ర్యాంక్ మనదే. న్యూజిలాండ్‌ మీద వరుసగా రెండు వన్డేలు గెలిచిన టీమ్‌ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయింది. సిరీస్‌ను కోల్పోయిన కివీస్‌ వన్డేల్లో రెండో స్థానానికి పడిపోగా రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఫస్ట్‌ ప్లేస్ కొట్టేసింది. ఇక భారత్‌ మూడో స్థానానికి ఎగబాకింది.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌ (113) పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కివీస్‌, భారత్‌ కూడా 113 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నప్పటికీ కొద్దిపాటి తేడాతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా (112), పాకిస్థాన్‌ (106) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్- కివీస్ రెండో వన్డేకు ముందు న్యూజిలాండ్‌ 115 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండేది. భారత్ 111 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగేది. న్యూజిలాండ్ రెండు వన్డేల్లో ఓటమితో అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ఇండియా మంగళవారం జరిగే చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే అగ్రస్థానానికి చేరుకుంటుంది.

అలాగే స్వదేశంలో వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ గెలిస్తే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కూడా టీమిండియాకు టాప్ ర్యాంక్ దక్కుతుంది. టీ20ల్లో భారత్ ఇప్పటికే నంబర్ వన్ స్థానంలో ఉంది. టెస్టుల్లో రెండో స్థానంలో ఉంది. 126 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. భారత్ కంటే 11 పాయింట్లు మాత్రమే ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు జరుగుతాయి. ఈ సిరీస్‌లో కనుక భారత్ విజయం సాధిస్తే టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానం భారత్ సొంతమవుతుంది. అదే జరిగితే చాలా ఏళ్ల తర్వాత మూడు ఫార్మాట్లలో టాప్ ర్యాంకుని దక్కించుకున్న టీమ్‌గా చరిత్ర సృష్టిస్తుంది టీమిండియా.

భారత జట్టు ఇప్పటికే స్వదేశంలో తుక్కు రేగ్గొడుతోంది. శ్రీలంకను 3-0తో మట్టికరిపించింది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. టెస్టుల్లోనూ అదే దూకుడు కొనసాగిస్తే ఇక రోహిత్ సేనకు ఎదురులేనట్టే. ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో నం.1 బ్యాటర్‌గా కొనసాగుతుంటే విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 4లో ఉన్నాడు. అయితే న్యూజిలాండ్‌తో రెండు వన్డేల్లో ఫెయిలైన కోహ్లీ మళ్లీ టాప్ 5 నుంచి కిందకి పడిపోయే ప్రమాదం ఉంది. కివీస్‌పై డబుల్‌ సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌ (624 పాయింట్లు) ఏకంగా పది ర్యాంక్‌లను ఎగబాకి 26వ స్థానంలోకి దూసుకొచ్చాడు. ఇక 2019లో 3-2తో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ తాజా సిరీస్ వరకు వరుసగా సొంతగడ్డపై ఏడు వన్డే సిరీస్‌లు గెలుచుకుంది.