ఏపీ రాజధాని ట్రాప్ ( అమరావతి )

By KTV Telugu On 23 January, 2023
image

2014 ఎన్నికల్లో గెలిచి విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు బిజెపి-జనసేనల మోపుతో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ లేని ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశంపై విభజన సమయంలోనే శివరామకృష్ణ కమిటీ ని నియమించింది కేంద్రం. ఆ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నివేదికను దిండు కింద పెట్టి తన మనసులోని ప్రాంతంలో కొత్త రాజధానికి ప్లాన్ చేశారు. దాన్ని అమలు చేసేందుకు నారాయణ కమిటీని వేశారు. మొత్తానికి ఎవరితోనూ సంప్రదించకుండా రాజధాని అనేది టిడిపి వ్యవహారం అన్నట్లు తామే నిర్ణయించేసి అప్పుడు ప్రకటించారు.

సరే ఆ రాజధాని నగర నిర్మాణంకోసం భూములు సేకరించి శాస్వత భవనాలేవీ కట్టకుండానే అయిదేళ్లూ కాలక్షేపం చేశారు చంద్రబాబు. 2019 వరకు గ్రాఫిక్ డిజైన్లకే పరిమితం చేసి ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల్లో తానే మరోసారి సిఎం అవుతానని బాబు ధీమా కావచ్చు. ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గెలవడంతో టిడిపి ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంపై కుమ్మరిస్తే హైదరాబాద్ లో చేసిన తప్పే రిపీట్ అయ్యినట్లు అవుతుందని అది మరోసారి వేర్పాటు వాద ఉద్యమాలకు దారి తీసే ప్రమాదం ఉందని అభిప్రాయ పడ్డారు. అందుకే రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దాని సిఫారసుల ప్రకారం అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ ను కార్యనిర్వాహక రాజధానిగానూ, కర్నూలు ను న్యాయరాజధానిగానూ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ నిర్ణయంతో చంద్రబాబు లో కంగారు మొదలైంది. అమరావతిని మార్చడానికి వీల్లేదంటూ ఉద్యమించారు. అమరావతి రైతుల తో కేసులు వేయించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆమోదం తెలిపారని టిడిపి అంటోంది. అయితే అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి చెప్పింది రాజధాని కోసం ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అవే తీసుకోవాలన్నారు కానీ కోట్లకు కోట్లు విలువ చేసే మూడు పంటలు పండే భూముల్లో కాదని వైసీపీ వివరణ ఇచ్చింది. ఈ రెండు వాదనల మధ్యలో అమరావతి రైతులు నలిగిపోతున్నారు. అయితే అమరావతి ప్రాంతంలో రైతుల ముసుగులో ఉన్న వారంతా టిడిపి నేతల బినామీలేనని ప్రభుత్వం ఆరోపించింది. దానిపై దర్యాప్తుకు సిట్ ను నియమించింది కూడా. అయితే హైకోర్టు స్టే విధించడంతో సిట్ దర్యాప్తు ఆగిపోయింది. ఇక అక్కడ్నుంచి అమరావతికి ద్రోహం చేసిన వైసీపీని తరిమి కొట్టాలంటూ చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పిలుపు నిచ్చారు.

అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటుమున్సిపల్ ఎన్నికల్లోనూ అమరావతి ప్రాంతంలో కూడా వైసీపీయే ఘన విజయాలు సాధించింది. అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆలోచనలు చేసినా ప్రజలు పాలక పక్షానికే ఓటు వేయడంతో మూడు రాజధానులకు ఆమోద ముద్ర పడ్డట్లేనని వైసీపీ ధీమాగా ఉంది. అమరావతి రైతుల ర్యాలీలు నిరసన ప్రదర్శనల వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే అని ప్రభుత్వం ఆరోపణ. దీనికి దీటుగా మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గర్జనలు బహిరంగ సభలకు ప్రభుత్వమే వెన్నుదన్నుగా ఉందని టిడిపి ఆరోపణ. సరే మూడు రాజధానుల నిర్ణయానికి న్యాయస్థానం ఓకే చెప్తుందా లేదా అన్నది రానున్న కాలంలో తేలుతుంది. కానీ ప్రజా కోర్టులో మాత్రం ఓ సెంటిమెంట్ రాజుకుంటోంది. దాన్నే వైసీపీ ఆయుధంగా మలుచుకుంటోంది.
29 గ్రామాలతో కూడిన అమరావతిలోనే చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు ఖర్చు చేయమంటున్నారని తాము వేలాది గ్రామాలతో కూడిన యావత్ రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ది చేయాలనుకుంటున్నామని ప్రభుత్వం చెప్పుకొస్తోంది.

ఒక్క ప్రాంతంపై ఇంత ఖర్చు చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేసినట్లు కాదా అని నిలదీస్తోంది.
ఇది రాను రాను చంద్రబాబు ఒకే ప్రాంతానికి పరిమితం అవుతున్నారన్న సంకేతాన్ని ప్రజల్లోకి చేరుస్తోంది. కోర్టు నిర్ణయం రాకపోయినా జగన్ మోహన్ రెడ్డి అయితే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖ నుండి పాలన మొదలు పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన కార్యాలయం ఎక్కడ ఉండాలి. ఆయన ఎక్కడి నుండి విధులు నిర్వహించాలి అన్నవి ఆయన ఇష్టం. ఫలానా చోటు నుంచే పాలన చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. అంచేత రాజధాని అని అధికారికంగా ప్రకటించలేకపోయినా విశాఖ లో కూర్చునే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపేవెసులు బాటు ఆయనకు ఉంది. 2024 ఎన్నికల లోపు కోర్టు తీర్పు ఎలా వచ్చినా అది తమకి అడ్వాంటేజే అని వైసీపీ భావిస్తోంది. మూడు రాజధానులకు సుప్రీం నో చెప్తే టిడిపి అడ్డుకోవడం వల్లనే ఉత్తరాంధ్ర, రాయలసీమలకు రాజధానులు ఇవ్వలేకపోయాం అని చెప్పుకుని జనంలోకి వెళ్లచ్చు.

ఒక వేళ సుప్రీం మూడు రాజధానులకు ఓకే అంటే అది నైతికంగా ఘన విజయమే అవుతుంది. ఒక వేళ ఎన్నికల వరకు కూడా కోర్టు ఏమీ తేల్చకుండా ఉండిపోతే అపుడు చూశారా మేం రాయలసీమకు, ఉత్తరాంధ్రకు న్యాయం చేద్దామనుకుంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసి దానికి అడ్డుపడ్డారని ప్రచారం చేసుకోవచ్చు. ఇలా మొత్తం మీద రాజధానుల అంశంలో చంద్రబాబు నాయుణ్ని జగన్ మోహన్ రెడ్డి అందమైన ట్రాప్ లో బంధించారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అటు టిడిపికి కూడా ఓ నినాదం ఉంటుంది. అయిదేళ్లు పాలించినా రాజధాని కట్టలేకపోయారు అనాథగా మిగిల్చేశారు అదే సీనియర్ అయిన నేను ఉంటే ఇలా జరిగేది కాదు అని చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో హల్ చల్ చేసే అవకాశమూ ఉంటుంది. అయితే అంతిమంగా ప్రజలు ఏమనుకుంటున్నారన్నదే ముఖ్యం. అది ఎన్నికల ఫలితాల అనంతరమే తెలుస్తుంది.