” కశ్మీర ఫైల్స్ ” గత ఏడాది ఈ సినిమా గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. అందులో ఉన్నదంతా నిజం అని ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించుకున్నారు. కానీ అదంతా ఫిక్షన్ అని మరికొంత మంది వాదించారు. ఏది నిజమో ఏది అబద్దమో అనేది ఎప్పటికీ తేలదు. అదో వాదన అంతే. అయితే ఎక్కువ మంది ఏది నమ్మితే అదే నిజంగా చెలామణిలోకి వస్తుంది. ఆ కశ్మీర్ ఫైల్స్ సినిమాకు కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. ఆ సినిమాను బీజేపీ నెత్తిన పెట్టుకుని ప్రచారం చేసింది. ఇప్పుడు సినిమా కాదు కానీ ఓ డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేసింది. ఇది కశ్మీర్ అంశంపై కాదు. గుజరాత్ పై గుజరాత్ లోని గోద్రా ఘటనపై తాము సంచలనాత్మక పరిశోధన చేశామని చెబుతూ బీబీసీ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. అందులో మొదటి భాగాన్ని ఇలా విడుదల చేయగానే అలా బ్యాన్ చేసేశారు. కానీ టెక్నాలజీ విశ్వరూపం చూపిస్తున్న వేళ ఆ వీడియోను ఆపడం సాధ్యం కాదు. అందుకే లింకులు లెక్కలేనన్ని అందుబాటులో ఉన్నాయి. అంటే ఆసక్తి ఉన్న వాళ్లు ఆ బీబీసీ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని చూస్తున్నారు. దీని వల్ల డాక్యుమెంటరీని బ్యాన్ చేశారనే చెడ్డ పేరు కేంద్రానికి తప్ప ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ ఉండటం లేదు. అసలు బీబీసీ డాక్యుమెంటరీలో ఏం ఉంది? కేంద్రం ఎందుకు బ్యాన్ చేసింది? అందులో కొత్త విషయాలు ఏమున్నాయి?
‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ పేరిట ఒక డాక్యుమెంటరీని రెండు భాగాలుగా బీబీసీ రూపొందించింది. జనవరి 17వ తేదీన యూకేలో ఈ డాక్యుమెంటరీ తొలి భాగం ప్రసారం అయింది. ఇందులో యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. కానీ ఇండియాలో లింక్ తొలగించారు. రెండో భాగాన్ని జనవరి 24న ప్రసారం చేయనున్నారు. రాజకీయాల్లో నరేంద్ర మోదీ ఎదుగుదలను డాక్యుమెంటరీలో చూపించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లను ప్రస్తావించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో జరిగిన అల్లర్లలో 2000 మందికి పైగా మరణించినప్పుడు ఆయన తీసుకున్న చర్యల గురించి ఈ డాక్యుమెంటరీలో ప్రశ్నలు లేవనెత్తారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించి బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం నుంచి బీబీసీకి అందిన నివేదికను ఈ డాక్యుమెంటరీలో హైలైట్ చేశారు. ఈ నివేదిక రహస్యమైనదిగా బీబీసీ పేర్కొన్నది. ‘2002లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణమైన వాతావరణం ఏర్పడటానికి మోదీ ప్రత్యక్షంగా బాధ్యుడు’ అని ఆ నివేదికలో ఉందని బీబీసీ స్పష్టం చేసింది.
గుజరాత్ హింసాకాండలో మోదీ ప్రమేయం లేదని భారత అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. కానీ బీబీసీ డాక్యుమెంటరీలో మాత్రం మా ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని విషయాలను కనుగొన్నాం. గుజరాత్‌లో జరిగిన హింసాకాండలో 2000 మందికిపైగా హత్యకు గురయ్యారు. ఇది చాలా ప్రణాళిక ప్రకారం జరిగింది. ఇదే నిజం అని వాదిస్తోంది. అప్పటి బ్రిటిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జాక్ స్ట్రా ఆదేశాల మేరకు ఈ ఎంక్వైరీ జరిగిదని బీబీసీ చెబుతోంది. ఈ హింసాకాండ పరిధి చాలా ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది. హిందూ ప్రాంతాల నుంచి ముస్లింలను తరిమేయడమే ఈ అల్లర్ల ఉద్దేశమని నివేదిక తెలిపింది. అత్యున్నత ప్రమాణాలను పాటించి తీవ్రంగా పరిశోధన చేసి ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు బీబీసీ చెబుతోంది. మొత్తంగా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన వ్యవహారంలో మోదీపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా బీబీసీ రిపోర్టు ఉందని కేంద్రం దాన్ని బ్యాన్ చేసింది. కానీ దాన్ని చూడకుండా ఆపడం మాత్రం సాధ్యం కాదు.
దేశ విభజన తర్వాత కశ్మీర్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకిస్థాన్ కశ్మీర్ ని ఆక్రమించుకోడానికి చాలా ప్రయత్నించింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కథ 1980-90లలో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ గురించి ఉంటుంది. కశ్మీర్ లోని హిందువులపై పాకిస్తాన్, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. ఈ మరణకాండలో కొన్ని లక్షల మంది హిందువులు చనిపోయారు. సుమారు మరో 5 లక్షల మంది కశ్మీరీ పండిట్‌లు భయపడి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. ఇదంతా నిజమని దర్శకుడు సినిమా యూనిట్ ప్రకటించారు. ఈ సినిమాను ప్రధాని మోదీ కూడా చూసి యూనిట్ ను అభినందించారు. పన్ను మినహాయింపు ఇచ్చారు.
నిజానికి బీబీసీ డాక్యుమెంటరీ మొదటి భాగంలో చాలా కాలంగా ప్రచారంలో ఉన్న విషయాలే ఉన్నాయి. గోద్రా అల్లర్ల విషయంలో నరేంద్రమోదీపై తీవ్ర మైన అభియోగాలున్నాయి. ఈ కారణంగా అప్పట్లో ఆయనకు ప్రపంచ దేశాలు వీసాలు ఇవ్వడానికి కూడా నిరాకరించాయి. చివరికి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పర్యటించడానికి కూడా ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ గుజరాత్ మోడల్ అభివృద్ధిని లభించిన విస్తృత ప్రచారంతో ఆయనకు ప్రధాని అభ్యర్థిగా ఆమోదం లభించింది. ఆ తర్వాత గోద్రా కేసులో క్లీన్ చిట్ వచ్చింది. అయితే ఇప్పటికీ వాటిపై ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ఆయనకు లభించిన క్లీన్ చిట్ ను ప్రశ్నించే వాళ్లు ఉంటారు. కొత్తగా ఇప్పుడు బీబీసీ చెప్పడం వల్ల ఆ ప్రచారాలకు బలం లభిస్తుంది కానీ అవన్నీ పాత విషయాలే. ఆ కేసు తేలిపోయింది. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీని బ్యాన్ చేయడం వల్ల కేంద్రం, బీజేపీ బ్యాడ్ అవుతుంది కానీ కొత్తగా జరిగే ప్రచారాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. కానీ బ్యాన్ చేయడం వల్ల మరింత ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
బీబీసీ డాక్యుమెంటరీని ఇండియాలో చూడకుండా చేయడం ద్వారా ప్రెస్ ఫ్రీడం లేకుండా చేశారన్న విమర్శలు ఇప్పుడు కేంద్రంపై వస్తాయి. ఇది బీజేపీ, కేంద్రానికి అదనపు డ్యామేజీ. ఇప్పటికే ప్రపంచంలో భారత్ లో ప్రెస్ ఫ్రీడమ్ అనేది దిగువ స్థాయిలో ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్ చేయడం ద్వారా ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లయింతి తప్ప ఎలాంటి ప్రయోజనం కలగదు.