ఏ ధైర్యంతో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు

By KTV Telugu On 23 January, 2023
image

రాజకీయాల్లో రాణించాలంటే దానికో లెక్కుండాలి. రాజకీయాలుచేసే నేతకైనా పార్టీకైనా గట్స్ ఉండాలి. జనం తమవైపే ఉంటారన్న విశ్వాసం ఉండాలి. ప్రత్యర్థులను మట్టి కరిపించగలమన్న మొండి ధైర్యం కావాలి. ప్రతీ రోజు నౌ ఆర్ నెవ్వర్ అన్న ఫీలింగుతోనే ముందుకు సాగాలి. అదే టైమ్ లో భవిష్యత్తు మనదేనని కార్యకర్తలకు భరోసా కల్పించాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం అదే ధైర్యం, అదే సంకల్పం, అదే దృఢ నిశ్చయంతో యువగళం పాదయాత్రకు బయలుదేరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ట్రెండును టీడీపీ మార్చగలదా. రాష్ట్ర రాజకీయాలను లోకేష్ శాసించగలరా. అన్ని వర్గాలను తనతో నడిపించగలరా. కొందరు పెత్తందార్లను దారికి తీసుకొచ్చి అందరూ ప్రజాసేవకులమేనని చెప్పగలరా. పాదయాత్ర ప్రారంభమవుతున్న వేళ ఇలాంటి ప్రశ్నలు అందరి మదిలో మెదలడం సహజమే. వాటికి సమాధానాలు వెదుక్కుంటూ సామాన్య ప్రజలను ఆకట్టుకుంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముందుకు సాగాలి. యువతతో పాటు పెద్దలు మహిళా ఓటర్లలో కూడా విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలి. జయహో తెలుగుదేశం అని అందరితో అనిపించుకోవాలి.

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎక్కడలేని పాపులారిటీవచ్చిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అదీ టీడీపీ గొప్పదనం కాదన్నది మాత్రం వాస్తవమైన మాట. అందులో నూటికి 90 శాతం వైసీపీ కృతాపరాధమేనని చెప్పక తప్పదు. వైసీపీ పట్ల వ్యతిరేకతతోనే టీడీపీ వైపుకు జనం చూస్తున్నారనడంలో సందేహించాల్సిన పని కూడా లేదు. వైసీపీపై ఉన్న నెగిటివిటీని వదిలేసి టీడీపీ పట్ల జనంలో పాజిటివ్ ఆలోచనా విధానాన్ని తీసుకురావాలి. వైసీపీ ఏం చేయలేదన్న సంగతిని జనం కాసేపైనా పక్కన పెట్టి టీడీపీ ఏదైనా చెయగలదన్న నమ్మకాన్ని కలిగించాలి.

జనవరి 27న లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో మొదలవుతుంది. ఉత్తరాంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ముగుస్తుంది. అంటే టీడీపీకి అత్యంత పట్టున్న ప్రాంతాలతో పాటు అసలు పట్టేలేని ప్రాంతాల మీదుగా కూడా యాత్ర సాగుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వేరు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వేరన్న సంగతి లోకేష్ తో పాటు ఆయన్ను నడిపించే టీమ్ అర్థం చేసుకోవాలి. సీమ, నెల్లూరులో సామాజిక వర్గాల లెక్క చూసుకోవాలి. ప్రస్తుతానికి రాజకీయ పరంగా కొన్ని సామాజిక వర్గాలు వైసీపీ చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నాయి. వారిని బయటకు లాగడం ఒకవంతయితే సామాన్య ప్రజలను ఆకట్టుకునే చిట్కాలు పాటించడం మరో వంతు. అందులో లోకేష్ ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలి.

క్షణ క్షణం వైసీపీ తప్పిదాలను ప్రస్తావించడం తొలి వ్యూహం కావాలి. ఆయన ఆ పని చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడం రెండోది. ఆ పని ఆయన సమర్థంగా నిర్వహిస్తేనే యువగళం పాదయాత్ర సక్సెస్ కావడం సాధ్యపడుతుంది. లోకేష్ ప్రతి జిల్లా తిరుగుతారు. జిల్లాలోకి ఎంటరయ్యే లోపే అక్కడి వెనుకబాటుతనం చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిపై ఆయన పూర్తి అవగాహనతో అడుగులు వేయాలి. బాబు వస్తేనే జాబు వస్తుంది. సైకో పోవాలి సైకిల్ రావాలి లాంటి నినాదాలు జనంలోకి బాగా వెళ్లిపోయిన నేపథ్యంలో సరికొత్త నినాదాల అన్వేషణ అవసరం. సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదంతో చంద్రబాబు ఇటీవల గ్రామ గ్రామాన దూసుకెళ్లినట్లే. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో లోకేష్ తన సంబంధాలను బలంగా నిర్మించుకోవాల్సిన అనివార్యత ఉంది.

తెలిసో. తెలియకో లోకేష్ కు పప్పు ఇమేజ్ వచ్చేసింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా అదే ఇమేజ్ ఉంది. రాహుల్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు యాత్ర చేస్తున్నారు. రోజు వేలాది మంది వచ్చి ఆయన్ను కలుస్తున్నారు. రాహుల్ యాత్ర ఓ తిరునాళ్ల. జనం బాధలు చెప్పుకుంటున్నారు. రాహుల్ అర్థం చేసుకుంటున్నారు. రాహుల్ కంటే లోకేష్ కు మరికొంత అడ్వాంటేజ్ ఉంది. టీడీపీ ప్రధాన కార్యదర్శికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేదు. ఆయనకు నెటివిటీ కూడా తెలుసు. జనంతో సంభాషించగలరు. వారి సమస్యలను అర్థం చేసుకోగలరు. కాకపోతే ముందే పూర్తి అవగాహనతో ఆయన వెళ్లాలి. వారి ప్రస్తావించే సమస్యలు తనకు తెలుసని టీడీపీ అధికారానికి రాగానే వాటిని పరిష్కరిస్తానని ఆన్ ది స్పాట్ హామీ ఇవ్వగలగాలి. క్షేత్రస్థాయిలో విశ్వాసం కల్పించగలగడం లోకేష్ మాటతీరు ఆయన చాకచక్యంపై ఆధారపడి ఉంటుందని లోకేష్ తో పాటు టీడీపీ వ్యూహకర్తలు కూడా మరిచిపోకూడదు. లోకేష్ కు అన్ని తెలుసు ఆయన తీరు ఆమోదయోగ్యంగా ఉందని ప్రజలు నమ్మినప్పుడే పప్పు ఇమేజ్ నుంచి బయటకు వచ్చే వీలుంటుంది. పైగా ఎక్కడ ఏం మాట్లాడాలో ఎంత సేపు మాట్లాడాలో తెలుసుకోలేకపోతే యాత్ర అట్టర్ ప్లాప్ అవుతుందని కూడా మరిచిపోకూడదు.

వైఎస్ షర్మిల తెలంగాణలో యాత్ర చేస్తున్నారు. ఆమె యాత్రకు తన యాత్రను కూడా తేడాను లోకేష్ స్వయంగా గుర్తించడంతో పాటు జనానికి కూడా అర్థమయ్యేట్టు చెప్పాలి. షర్మిల తెలంగాణలో ఎలాంటి పట్టులేకుండా కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ మీద ప్రజాబలం కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్న దారంలో ఏనుగును లాగాలనుకుంటున్నారు. లోకేష్ పొజిషన్ చాలా డిఫరెంట్ స్థిరమైన, శక్తిమంతమైన కేడర్ ఉన్న పార్టీ ఆయనది. పార్టీ వ్యవస్థను ఎక్కడికక్కడ ఉపయోగించుకుంటూ ముందుకు నడిచే అవకాశం ఆయనకు ఉంది. అయితే తన యాత్ర ముగిసిన తర్వాత వెనక్కి చూసుకుంటే పార్టీకి మేలు జరగాలి. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చగలమన్న సంతృప్తితో ఆయన యాత్రను ముగించాలి.

రాహుల్ కు లోకేష్ కు ఒక తేడా ఉంది. ఇప్పుడు జాతీయ మీడియాలో 90 శాతం మోదీ మద్దతుదారులే ఉన్నారు. రాహుల్ ఏం మాట్లాడినా జాతీయ మీడియా పెద్దగా ఫోకస్ చేయడం లేదు. పైగా కాంగ్రెస్ సోషల్ మీడియా బలహీనంగా ఉంది. బీజేపీకి బలమైన సామాజిక మాధ్యమాలున్నాయ్. వాటిని ఉపయోగించుకుంటూ రోజువారీగా రాహుల్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ కొంత అడ్వాంటేజ్ పొజిషన్ లోనే ఉన్నారు. ఆయనకు శక్తిమంతమైన మీడియా సపోర్టు ఉంది. వైసీపీ దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పుకొట్టగల మీడియా బలం లోకేష్ కు ఉంది. సోషల్ మీడియాలోనూ ఇప్పుడు టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. దాన్ని పాజిటివ్ గా ఉపయోగించుకుంటూ లోకేష్ ముందుకు సాగాలి. ఏ రోజుకారోజు లోకేష్ సహేతుకమైన హామీలు ఇవ్వాలి. ఇచ్చిన హామీ సాధ్యమూ అన్న ఫీలింగ్ జనంలో కలిగించాలి. ఎందుకంటే జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చలేక జనాన్ని నానా హింస పెడుతున్నారు. దానితో ప్రతీ హామీ పట్ల జనం అనుమానంగా చూస్తున్నారు. అందుకే అనుమానాలకు తావివ్వకుండా విశ్వాసానికి అవకాశమిచ్చే హామీలనే ఇవ్వాలని లోకేష్ మరిచిపోకూడదు.

అమరావతి ఉద్యమం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. పీకల్లోతు కష్ట్రాల్లో ఉన్న రాజధాని రైతులు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారానికి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న చంద్రబాబు భోరోసాతో కొంత ధైర్యాన్ని పొందారు. ఇటీవలి కాలంలో మాత్రం వారిలో నిరాశ పెరుగుతోంది. ఇంకెన్నాళ్లీ నిరీక్షణ అన్నట్లుగా వాళ్లు ఆందోళనలో పడిపోయారు. అలాంటి వారిని తన పాదయాత్రలో భాగం చేసుకుని మరి కొన్ని నెలల్లోనే వారి తలరాత మారబోతోందని లోకేష్ ధైర్యం చెప్పగలగాలి. 2024 అసెంబ్లీ ఎన్నికలపై ఎవరి లెక్కలు వారికి ఉన్నాయ్. వైసీపీ అధినేత జగన్ వై నాట్ 175 అంటున్నారు. అంటే కుప్పం సహా అన్ని చోట్ల తాము గెలిచి తీరుతామన్న సందేశం ఇస్తున్నారు. చంద్రబాబు కూడా ఇప్పుడు అదే రూట్ కు వచ్చారు. మనకేం తక్కువ పులివెందుల సహా అన్ని చోట్ల టీడీపీ గెలుస్తుందంటున్నారు. లోకేష్ కూడా అదే ధోరణిని కొనసాగించాలి. అప్పుడే కార్యకర్తల్లో జోష్ పెరుగుతోంది.

ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ కేడర్ ఇప్పుడు చాలా నీరసపడిపోయింది. వారికి ప్రాణవాయువు అందించే ప్రయత్నాలు అనివార్యం. లోకేష్ యాత్ర ఆ దిశగా అడుగులు వేస్తుందని కూడా చెబుతున్నారు. కార్యకర్తలతో మమేకమవుతూ ఇంతకాలం ప్రాధాన్యం దక్కని ద్వితీయ శ్రేణి నాయకులను కలుపుకుపోతూ యాత్ర సాగుతుందని పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు. యాత్రలో లోకేష్ హ్యాండిల్ చేయాల్సిన సున్నితమైన అంశం ఒకటుంది. అదే జనసేన క్యాడర్. అధికారికంగా పొత్తు ఖరారు కాని నేపథ్యంలో జనసేనకు ఇబ్బంది లేకుండా పాదయాత్ర సాగిపోవాలి. వీలైతే జనసైనికులను టీడీపీ కేడర్ తో కలుపుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. అంతకంటే కఠినమైన పరీక్ష మరోకటి ఉంది. అదే వైసీపీ కేడర్. యాత్రకు అడుగడుగునా అడ్డుపడేందుకు వాళ్లు ప్రయత్నిస్తారు. అందుకు తాడేపల్లి స్పెషల్ స్కెచ్ కూడా వేసింది. ఘర్షణలు జరగకుండా శాంతియుతంగా వైసీపీ కేడర్ ను టీడీపీ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. ఏదేమైనా లోకేష్ కు రాజకీయ జీవితంలో ఇదీ నిర్ణయాత్మక సమయం. సక్సెస్ అయితే ఆయనకు తిరుగుండదు. ఫెయిలయితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.