ఆయన కారు దిగడం పక్కా. కమలం గూటికి చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ యూటర్న్ తీసుకొని కాంగ్రెస్‌వైపు చూస్తున్నారనే వార్త ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీ మార్పు వ్యవహారంలో గందరగోళం నెలకొంటోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి వెళ్లటం ఖాయమని భావిస్తున్న వేళ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మాజీ ఎంపీ తన నిర్ణయం మార్చుకొని కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. పొంగులేటి బీఆర్ఎస్ వీడుతున్నట్లు అనుచరులకు స్పష్టం చేసారు. మొన్నటి బీఆర్ఎస్ సభకు డుమ్మా కొట్టడంతో క్లారిటీ కూడా వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారా లేక కాషాయగూటికి చేరతారా అనేది సస్పెన్స్‌గా మారింది. రెండు జాతీయ పార్టీల నుంచి వస్తున్న ఆహ్వానాలతో పొంగులేటి నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 18న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పొంగులేటి భేటీ కావాల్సి ఉంది. కానీ భేటీ జరగలేదు.
ఖమ్మం జిల్లాలో అసలు ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీలోకి వెళ్తే జిల్లా అంతా పొంగులేటి తానై వ్యవహరించాల్సి ఉంటుంది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటాలనేది పొంగులేటి లక్ష్యం కూడా. అయితే అది రిస్క్‌తో కూడుకున్న పని. ఇక కాంగ్రెస్‌లోకి వెళితే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ కన్నా కూడా చేయి గుర్తుకే పవర్ ఎక్కువ. అక్కడ భట్టి, రేణుకాచౌదరి లాంటి సీనియర్లున్న చోట పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళ్లి ఆధిపత్యం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే పొంగులేటి తమ పార్టీలోకి వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎల్పీ నేత భట్టి స్పష్టం చేశారు. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పొంగులేటితో మంతనాలు సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో బీజేపీకి బలం లేదని బలంగా ఉన్న కాంగ్రెస్‌లో పొంగులేటి చేరికతో జిల్లాలో సానుకూల ఫలితాలు వస్తాయని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పొంగులేటికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అనుచరులకు టికెట్ల విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తన అనుచరులు పోటీ చేస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. గతంలో ఆయన వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి మూడు ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరాక కూడా ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు కూడా ఏ పార్టీలోకి వెళ్లినా తనదైన మార్క్ ఉండాలని చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే పొంగులేటి తన అనుచరులతో వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వారి నిర్ణయం అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలతో పొంగులేటి మధ్య సత్సంబంధాలు లేవు. ఇలాంటి సమయంలో ఖమ్మంకు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు పొంగులేటిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే బీజేపీ సరైన పార్టీగా చెబుతున్నా బీజేపీ కంటే జిల్లాలో కాంగ్రెస్ కు ఆదరణ ఉందనే అంశాన్ని పొంగులేటి సన్నిహితులు ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీల్లో పొంగులేటి ఎటు వైపు మొగ్గుతారనేది ఈ నెల 26న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ రోజున పొంగులేటి తన రాజకీయ భవిష్యత్ అడుగుల పైన క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు.