కోమటిరెడ్డిపై కొండా సురేఖ అటాక్.. పాతకక్షలు – కొత్త పేచీలు

By KTV Telugu On 23 January, 2023
image

కొండా సురేఖ ఏం మాట్లాడినా సెన్సెషనే. రాజకీయాల్లోకి వస్తూ పోతూ ఉండే ఆమె ప్రతీ దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తారు. పార్టీలు మారుతూ ఉండే ఆమె ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ కమిటీల్లో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అలిగిన సురేఖ కోమటిరెడ్డి క్రమశిక్షణా రాహిత్యంపై మాత్రం అంతెత్తున ఎగిరి పడుతున్నారు. ఒక మీటింగ్ లో ఆమె ఏకంగా పది మాటలు మాట్లాడారు. టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారించి ఉండకపోతే ఆమె ఇంకా చాలా మాటలే మాట్లాడేవారేమో.

టీ.పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సురేఖ డైరెక్ట్ అటాక్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె అన్నారు. అప్పుడే ఎంతటి వాళ్ళను అయిన క్రమశిక్షణ తప్పితే తీసేస్తారు అనే భయం ఉంటుందని అలా చెప్పానన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న పార్టీలో కనిపించాడు కాబట్టి ఈ వాఖ్యలు చేశానన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయమని చెప్పడం వంద శాతం తప్పేనన్నారు. చాలా రోజుల తర్వాత కోమటిరెడ్డి గాంధీ భవన్ కు వచ్చిన నేపథ్యంలోనే సురేఖ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నిజానికి సురేఖ కూడా కోమటిరెడ్డి టైపు తిరుగుబాటు నేతేనని చెప్పాలి. ఆమె కూడా తరచూ అలుగుతుంటారు. సొంత పార్టీపైనే ఆరోపణలు చేస్తుంటారు. తగిన పదవి ఇవ్వలేదన్న కోపంతో టీ.పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చోటివ్వలేదని ఆగ్రహం చెందారు. గతంలో తన కుమార్తెకు టికెట్ నిరాకరించారని టీఆర్ఎస్ నుంచి ఆమె వైదొలిగారు. కోమటిరెడ్డినే ఆమె ఎందుకు టార్గెట్ చేశారన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రులుగా ఉండేవారు. తెలంగాణ ప్రాంతంలో ఆధిపత్యం కోసం వారిద్దరూ వేర్వేరు గ్రూపులు నిర్వహించేవారు. పైగా వైఎస్ దగ్గర ఎవరికి ఎక్కువ ప్రాబల్యముందనే పోటీ ఎప్పటికప్పుడు అటు సురేఖ ఇటు వెంకటరెడ్డిలో కనిపించేది.

సురేఖ కుటుంబాన్ని వైఎస్ కాస్త ఎక్కువగా ప్రోత్సహించేవారని కూడా చెబుతుండేవారు. మంత్రివర్గంలో ఆధిపత్య పోరు కారణంగా సురేఖకు, వెంకటరెడ్డికి పొసిగేది కాదు. కోమటిరెడ్డిది ఉమ్మడి నల్గొండ, సురేఖది ఉమ్మడి వరంగల్ అయినప్పటికీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదని తెలిసిన వాళ్లు చెబుతారు. కోమటి రెడ్డి నిర్వహించే ఒక ఎన్జీవోకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా శాఖలు ఉన్నాయి. దానికి సంబంధించి భూ వివాదాల్లో కొండా సురేఖ ఫ్యామిలీ గతంలో జోక్యం చేసుకున్నట్లు ఒక వార్త ప్రచారంలో ఉంది. ఈ సంగతులన్నింటినీ మనసులో పెట్టుకున్న కొండా అవకాశం రాగానే అటాక్ ప్రారంభించారని కాంగ్రెస్ లో ఒక వర్గం అంటోంది. మరో పక్క తనకు కూడా పార్టీలో ఒక గౌరవప్రదమైన పదవి కోసం ఆమె ప్రయత్నిస్తున్నారని అందుకే  ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే దృష్టిలో పడేందుకు ఆమె గేమ్ ఆడారని కూడా చెబుతున్నారు. మరి కొండా మేడం పేచీ ఎంత దూరం పోతుందో చూడాలి.