జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార వాహనం వారాహి రోడ్డెక్కబోతోంది. త్వరలోనే పవన్ తన ప్రచార యాత్ర చేపట్టబోతున్నారు. అయితే అది తెలంగాణ నుంచా లేక ఏపీ నుంచి మొదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. రేపే జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి స్వామి ఆలయాన్ని దర్శించి ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు . ఆతర్వాత బృందావన్ రిసార్ట్ లో జనసేన ముఖ్య నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎన్నికల కార్యాచరణకు సంబంధించి ఏం చేయాలి అనే దానిపై పవన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని ఇటీవల పవన్ ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది రాష్ట్ర నేతలే నిర్ణయించుకోవాలని సూచించారు. 7 నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు లేదా మూడు లోక్‌సభ స్ధానాల్లో బరిలోకి దిగుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కొండగట్టుతో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తెలంగాణ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా కూడా కొండగట్టుకు రావడం పవన్ సెంటిమెంట్. గతంలో అనేక సార్లు పవన్ కొండగట్టుకు వచ్చిన సంధర్భాలున్నాయి. ఇక ఇప్పుడు కూడా వారాహికి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆ సెంటిమెంట్‌ను కొనసాగించనున్నారు. ఈ పర్యటన తర్వాత ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో పవన్ స్పీడ్ పెంచనున్నారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింతగా పవన్ ప్రజల్లోకి వెళతారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించి చాలా రోజులు అవుతుంది. దాంతో జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు ఈ పర్యటనను సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వారాహి కలర్‌పై గతంలో రాజకీయ దుమారం రేగింది. ఎట్టకేలకు రిజిస్ట్రేషన్‌కు లైన్ క్లియర్ కావడంతో వివాదానికి ఫులిస్టాప్ పడింది.
తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తయినా వారాహి యాత్రను ఏపీలో అడ్డుకుంటామని గతంలో మంత్రులు చేసిన కామెంట్లు వేడిపెంచాయి. అయితే ఎవడు ఆపుతాడో చూస్తామంటూ అటు పవన్ కూడా అధికార పార్టీపై అంతేస్థాయిలో నిప్పులు చెరిగారు. యాత్ర చేసి తీరుతామంటూ వైసీపీకి సవాల్ విసురుతున్నారు. వారాహి యాత్రను ఆపితే పాదయాత్రకు సిద్ధమేనంటున్న జనసేన నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల్లో లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభమవుతుంది. లోకేష్ యాత్రకు అధికార వైసీపీ అడ్డుంకులు సృష్టించే కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కొంచెం అటు ఇటుగా పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రకు సిద్ధమవుతుండడంతో రాజకీయం వేడెక్కుతోంది.