దక్షిణ భారత దేశంలోనూ సత్తా చాటడం ద్వారా ఉత్తరాది పార్టీ అన్న ముద్ర చెరిపేసుకోవాలని పట్టుదలగా ఉన్న బిజెపి ఆ దిశగా ప్రణాళికాబద్దంగానే అడుగులు వేస్తోంది. దేశమంతా విస్తరిస్తోన్న బిజెపికి దక్షిణాదిలో మాత్రం పట్టుదొరకడం లేదు. ఒక్క కర్నాటకలో మాత్రం పాగా వేయగలిగింది బిజెపి. తమిళనాడులో అయితే ద్రవిడ పార్టీలు తప్ప ఎవరికీ అక్కడి ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితులు లేవు. అందుకే రెండు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిలు రెండూ కూడా ఏదో ఒక ద్రవిడ పార్టీకి తోక పార్టీగా కొనసాగుతూ వస్తున్నాయి. జయలలిత సమయంలో అన్నాడిఎంకేతో పొత్తు పెట్టుకున్న బిజెపి వాజ్ పేయ్ ప్రభుత్వానికి జయలలిత మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత కరుణానిధి సారధ్యంలోని డిఎంకేతో చేతులు కలిపింది.
అయితే జయలలిత మరణానంతరం అన్నా డిఎంకే లో చోటు చేసుకున్న పరిణామాల్లో శశికళకు చెక్ చెప్పడానికి పన్నీరు సెల్వానికి అండగా నిలిచింది బిజెపి. పన్నీరు సెల్వాన్నే సిఎంని చేయాలని బిజెపి చూసింది. అయితే పన్నీరు సెల్వం కు మోకాలడ్డుతూ శశికళ చక్రం తిప్పి తానే సిఎం అవుదామనుకున్నారు. అదే సమయంలో పాత కేసులు వెంటపడి శశికళను జైలుకు పంపేయడంతో జైలుకు వెళ్తూ వెళ్తూ శశికళ తనకు నమ్మకస్తుడైన పళనిస్వామిని సిఎంని చేశారు. శశికళ జైలుకు వెళ్లగానే బిజెపి ప్రయత్నంతో పళని స్వామి-పన్నీరు సెల్వాలు కలిసిపోయి ప్రభుత్వాన్ని నడిపించుకున్నారు. యూపీయే లో భాగస్వామిగా ఉన్న డిఎంకే ప్రస్తుతం కాంగ్రెస్ తోనే ఉంది. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపి-కాంగ్రెస్ ల పాత్ర నామమాత్రమే. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవసరమైన ఎంపీల మద్దతు కోసమే ద్రవిడ పార్టీలతో పొత్తు కొనసాగిస్తాయి జాతీయ పార్టీలు.
అంతే తప్ప తమిళనాడు లో కాషాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనుచూపు మేరల్లో లేనే లేదు. అసలు ఆ ఆశ కూడా ఆ పార్టీకి ఉండే అవకాశాలూ లేవు. ఇక మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలోనూ బిజెపికి అడ్రస్ లేదు. మలయాళ ప్రజలు ఓ సారి లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటేస్తే మరో సారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు జైకొడుతూ వస్తున్నారు. అక్కడ ఎంట్రీ ఇవ్వాలని బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆరెస్సెస్ బలపడుతోంది కూడా. అయితే అది బిజెపికి విజయాలు తెచ్చిపెట్టడానికి సరిపోయేంత అయితే కాదు. ఇక దక్షిణాదిలో మిగిలింది రెండు తెలుగు రాష్ట్రాలే. వీటిలో తెలంగాణాలో బిజెపి రోజు రోజుకీ బలోపేతం అవుతోంది. తెలంగాణలో పాలక పక్షమైన బి.ఆర్.ఎస్. కు ప్రత్యామ్నాయం అయిన కాంగ్రెస్ స్థానాన్ని బిజెపి ఇంచుమించు తన గుప్పెట్లోకి తెచ్చేసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించడంతో పాటు మునుగోడులో బి.ఆర్.ఎస్. కు ప్రత్యామ్నాయంగా నిలిచింది బిజెపి.
ఈ ఏడాది కర్నాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో బిజెపి కి కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఖాయం. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితుల అంచనా. ఒక వేళ తమ ఖాతాలో ఉన్న ఆ ఒక్క దక్షిణాది రాష్ట్రం చేజారిపోతే ఉత్తరాది పార్టీగా తమపై ఉన్న ముద్ర అలానే ఉండిపోతుందని కమలనాథులు కంగారు పడుతున్నారు. అందుకే కర్నాటకలో ఓడిపోతే తెలంగాణాను అందిపుచ్చుకోవాలన్న వ్యూహంతోనే పార్టీ హైమాండ్ పావులు కదుపుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాలు తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక మిగిలింది ఆంధ్ర ప్రదేశ్. ఏపీలో బిజెపికి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు అంటూ ఏమీ లేదు. ఉమ్మడి ఏపీలో టిడిపితోనే పలు మార్లు పొత్తు పెట్టుకున్న బిజెపి అక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించే అవకాశాలను చేజేతులా చేజార్చుకుంది. అప్పటి ఏపీ బిజెపి అగ్రనేతలు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహారాలు నడపడంతో బిజెపి నష్టపోయింది. కార్గిల్ విజయం నేపథ్యంలో 1999లో జరిగిన ఎన్నికల్లో బిజెపి ఏపీలో ఒంటరిగా పోటీ చేసి ఉంటే అద్భుత విజయాలు సాధించి ఉండేది కానీ టిడిపితో పొత్తు పెట్టుకుని ఓడిపోవలసిన టిడిపికి అధికారాన్ని తెచ్చిపెట్టింది బిజెపి. 2004 ఎన్నికల్లోనూ టిడిపి-బిజెపిలు కలిసే పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఘోరపరాజయాలు మూటకట్టుకోవడంతో బిజెపితో కటీఫ్ అన్నారు చంద్రబాబు. ఇక జీవితంలో బిజెపితో కలిసేది లేదన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత విభజిత ఏపీకి జరిగిన ఎన్నికల్లో మళ్లీ బిజెపితో పొత్తుకోసం టిడిపి వెంపర్లాడింది. అప్పుడూ నరేంద్ర మోదీ హవాతోనే ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్లు తిరిగేసరికి మళ్లీ బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు చంద్రబాబు. 2019ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే తన లక్ష్యమంటూ రాహుల్ గాంధీతో జట్టుకట్టారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికల్లో ఏపీలో టిడిపి ఘోర పరాజయంతో పాటు కేంద్రంలో బిజెపి ఘనవిజయం సాధించడంతో బాబు షాక్ తిన్నారు. మళ్లీ బిజెపికి దగ్గర కావాలన్న ఆలోచనతో నలుగురు టిడిపి ఎంపీలను బిజెపిలో చేర్పించేశారు. అయితే బిజెపి మాత్రం చంద్రబాబును నమ్మడానికి వీల్లేదని డిసైడ్ అయిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికలకు బిజెపి జనసేనలతో కలిసి పోతే కానీ విజయం సాధించలేమనుకుంటోన్న చంద్రబాబు జనసేనాని ద్వారా మోదీని ఒప్పించే ప్రయత్నం చేశారు.
అయితే చంద్రబాబు యూ టర్నులతో విసిగి వేసారిపోయి ఉన్న బిజెపి నాయకత్వం టిడిపిని పూర్తిగా దూరం పెట్టాలని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని పవన్ కు మోదీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు కనీసం జనసేనతో అయినా ముందుకు సాగాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో ఇంచుమించు విజయం సాధించారు. ఇపుడు బిజెపికి ఇష్టం ఉన్నా లేకపోయినా 2024 ఎన్నికల్లో టిడిపితోనే కలిసి ముందుకు సాగాలని పవన్ భావిస్తోన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న బిజెపి అధిష్ఠానం ఒక వేళ పవన్ కళ్యాణ్ టిడిపితో పోతే బతిమాలుతూ కూర్చోవలసిన అవసరం లేదని డిసైడ్ అయ్యింది. ఒంటరిగానే బరిలో దిగి తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఒంటరి పోటీకి సిద్ధంగా ఉండాల్సిందిగా ఏపీ బిజెపి నేతలకు ఢిల్లీ నుండి సంకేతాలు అందాయని అంటున్నారు. సో ఇక జనసేన-బిజెపిల హనీమూన్ ముగిసిందనే అనుకోవచ్చంటున్నారు రాజకీయ పండితులు.