రేవంత్ మార్క్ దళిత బంధు

By KTV Telugu On 23 January, 2023
image

బీఆర్ఎస్ ను అన్ని వైపుల నుంచి కుమ్మేయ్యాలని తెలంగాణ కాంగ్రెస్ డిసైడైంది. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా కమ్ముకొస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని సామాజికవర్గాలను దగ్గరకు చేర్చుకుంటూ ఆయా వర్గాలను బీఆర్ఎస్ కు దూరం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆ దిశలో తొలి అడుగు వేస్తూ నాగర్ కర్నూలు శాససనభా నియోజకవర్గం పరిధిలోని బిజినెపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించింది. ఠాక్రే పార్టీ ఇంఛార్జ్ పదవిని చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి బహిరంగ సభలో రేవంత్ ఉద్రేకంగా, ఉద్వేగంగా మాట్లాడారు.

దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రగమాలను రేవంత్ ఎకరవు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు, గిరిజనులకు ఎన్నో పదవులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేకు, సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్కకు, కేంద్రమంత్రిగా బలరాం నాయక్ కు, పంజాబ్ ముఖ్యమంత్రిగా దళితులకు అవకాశమిచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ, పాలమూరు గడ్డ ఇంకా దొరలు దళిత గిరిజనులపై కాలుపెట్టి తొక్కి ఆధిపత్యం చెలాయించాలని చూశారన్నారు. కేసీఆర్ హయాంలో 1200 మంది దళిత గిరిజనులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని రేవంత్ గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తామన్నారన్న సంగతి గుర్తు చేస్తూ ఉద్యమకాలంలో కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. దళితుడు సీఎం కావాల్సిన చోట దరిద్రుడు సీఎం అయ్యాడని పవర్ ఫుల్ డైలాగ్ వదిలారు. దళితులపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయని అది కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతోనే దుండుగుల రెచ్చిపోతున్నారని రేవంత్ ఆరోపణలు సంధించారు.

దళితబంధు పేరుతో బడుగువర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నది రేవంత్ ప్రధాన ఆరోపణ. డబ్బులు మొత్తం భూస్వాములు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లిపోతుందన్నది ఆయన మాట. దళిత రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం కళ్లు మూసుకు కూర్చుంటోందని రేవంత్ అంటున్నారు. అదే టైమ్ లో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని రేవంత్ ప్రస్తావిస్తున్నారు. జూరాల, భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కట్టారని దానితో దళిత రైతులకు ప్రయోజనం కలిగిందని రేవంత్ చెప్పుకుంటున్నారు. మేం కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఇక్కడ ఎమ్మెల్యే ఫోటోలు దిగుతున్నాడు. లాల్చి వేసి ప్రతొక్కడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు. పంచెలు కట్టిన ప్రతీవాడు వైఎస్ రాజశేఖరరెడ్డి కాడు. ప్రాజెక్టుల విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని రేవంత్ సవాలు విసిరారు.

రేవంత్ దీర్ఘకాలిక ఎన్నికల ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ సీనియర్లను దారికి తెచ్చిన తర్వాత రేవంత్ లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఇక ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడమేనని కేసీఆర్ తో తలపడటమేనని ఆయన నిర్ణయానికి వచ్చారు. ఎంతో అట్టహాసంగా మొదలు పెట్టిన దళిత బంధు సక్రమంగా అమలు కాకపోవడం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానూ బీఆర్ఎస్ కు ప్రతికూలంగానూ పరిణమించే అంశం. వాటికి తోడు దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ వర్గీకరణ, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్సు లాంటి వాటికి దళితులు నోచుకోవడం లేదు. దళిత జనాబాకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలు వారికి చేరడం లేదు. ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అస్త్రాలు కాబోతున్నాయ్.

నిజానికి ఉద్యమకాలంలో దళితులు అప్పటి టీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. చాలా మంది దళిత యువకులు చదువులను పక్కన పెట్టి మరీ ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత మాత్రం కేసీఆర్ వారిని దూరం పెట్టారు. అన్యాయమై పోయామన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఒక తరం నాశనమైపోయిందన్న నిజం తెలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే సెటిమెంట్ ను వాడుకోవాలని చూస్తోంది. ఆ అవకాశం వేరే పార్టీకి లేదని కూడా రేవంత్ కు తెలుసు. ఉన్న మూడు ప్రధాన పార్టీల్లో బీజేపీ పట్ల దళితులకు సదభిప్రాయం లేదు. బీజేపీని మత పార్టీగా వాళ్లు చూస్తారు. తాము మతవాదానికి వ్యతిరేకమని వారు విశ్వసిస్తారు. పైగా కాంగ్రెస్ తొలినాళ్ల నుంచి దళితులు చాలా వరకు ఆ పార్టీ వైపే ఉండేవారు. టీడీపీ వచ్చిన తర్వాత తెలంగాణ దళిత వర్గాలు కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య చీలిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ ను సపోర్టు చేసి తప్పు చేశామన్న ఫీలింగ్ వారిలో కనిపిస్తోంది. దాన్నే క్యాష్ చేసుకోవాలని రేవంత్ చూస్తున్నారు. ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.