పాకిస్థాన్ కు అమాంతం శాంతి గుర్తుకు వచ్చింది. అనుక్షణం ఉగ్రహింస గురించి ఆలోచించే పాక్ పాలకులు శాంతి వచనాలు పలుకుతున్నారు. భారత దేశంతో నిజాయితీగా శాంతి చర్చలు కోరుకుంటున్నామని పాక్ ప్రధాని అంటున్నారు. ఉన్నట్లుండి పాకిస్థాన్ వైఖరి ఇలా ఎందుకు మారిందా అని విశ్లేషకులు కనుబొమ్మలెగరేస్తున్నారు.
అసలేమైందంటే. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కొద్ది రోజుల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు.
దేశాధ్యక్షుడు మహ్మద్ బిన్ జయీద్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్ తో ఇంత వరకు మూడు యుద్ధాలు చేశామన్న షరీఫ్ వాటి వల్ల పాకిస్థాన్ కు పేదరికం , నిరుద్యోగం, కష్టాలే మిగిలాయని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇపుడు బుద్ధి తెచ్చుకున్నామని కూడా చెప్పుకున్నారు.
ఈ సారి మాత్రం భారత్ తో నిజాయితీగా శాంతిని కోరుకుంటున్నామన్నారు షరీఫ్. భారతదేశంతో శాంతి చర్చలకు మీరు మధ్యవర్తిత్వం వహించాలంటూ జయీద్ ను కోరారు. బాంబుల మీదా ఆయుధాల మీదా అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టడం వృధా అన్నదే తమ ఉద్దేశంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దుబాయ్ కు చెందిన ఓ టీవీ ఛానెల్ కు షరీఫ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భారత్ తో శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మా సోదరులు జయీద్ ను కోరామని వివరించారు. శాంతి చర్చలకు సిద్ధం అంటూనే భారత్ లో అంతర్భాగమైన జమ్ము కశ్మీరు అంశాన్ని ప్రస్తావించారు షరీఫ్. కశ్మీరు లో మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేలా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. నిజాయితీగా చర్చలకు సిద్ధం అంటూనే కశ్మీరు అంశాన్ని కదపడం విశేషం.
అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం పాకిస్థాన్ కు షాకిచ్చింది. ఇద్దరి భేటీ అనంతరం అరబ్ ఎమిరేట్స్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఎక్కడా కశ్మీర్ అన్న పదం కూడా లేదు. ఇది పాకిస్థాన్ కు తీవ్ర భంగపాటే అంటున్నారు విశ్లేషకులు. అసలు ఉన్నట్లుండి పాకిస్థాన్ పాలకులకు శాంతిమంత్రం ఎందుకు గుర్తుకొచ్చిందంటే పాకిస్థాన్ లో ఆర్ధిక సంక్షోభం రోజు రోజుకీ ముదిరిపోతోంది. ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఆకలి కేకలకు సమాధానం చెప్పలేకపోతోన్న పాక్ ప్రభుత్వం తాము కబ్జా చేసిన గిల్గిట్ బాల్టిస్థాన్ లో ప్రజలను నరకయాతన పెడుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మీడియా కూడా తమ పాలకులను ఎత్తి పొడుస్తూ భారత ప్రభుత్వాన్నీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తింది. భారత్ రోజు రోజుకీ బలోపేతం అవుతోన్న వాస్తవాన్ని గుర్తించి నరేంద్ర మోదీనుంచి మీరు చాలా నేర్చుకోవాలని కూడా ఎడిటోరియల్ కామెంట్స్ లో సూచించింది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక.
ఎప్పుడూ భారత దేశానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పాక్ పత్రికలో నరేంద్ర మోదీ అనగానే మత రాజకీయాలు చేసే నాయకుడిగా వర్ణించే వారు. అటువంటి పత్రికలోనే భారత దేశాన్ని మోదీ ముందుకు తీసుకెళ్తోన్న తీరును గమనించాలని పాక్ పాలకులకు సూచన చేశారు. స్వదేశంలోనే తమపై వ్యతిరేకత పెరిగిపోవడంతో పాటు భారత దేశానికి ప్రపంచ దేశాలతో పాటు పాక్ మీడియా నుండి కూడా ప్రశంసలు దక్కడాన్ని పాక్ పాలకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ శాంతి కాముక దేశమని బిల్డప్ ఇచ్చుకోడానికే భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని పాక్ ప్రధాని వ్యాఖ్యానించి ఉండచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్థాన్ లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆకలి కేకలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆహారం కోసం కట కట లాడిపోతున్నారు. పాలకులు చేతులెత్తేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూసింత అప్పు కోసం పాక్ ప్రధాని అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు. ఇప్పటికే యు.ఏ.ఇ. ప్రభుత్వం పాకిస్థాన్ కు చాలా సార్లు చాలా పెద్ద మొత్తాల్లోనే అప్పులు ఇచ్చింది.
మరో సారి అప్పు అడగడానికే షరీఫ్ అక్కడికి వెళ్లారు. ” మిత్రులను పదే పదే అప్పుడు అడగడం మాకే ఇబ్బందిగా ఉంది తలకొట్టేసినట్లుంది” అని షరీఫ్ వ్యాఖ్యానించారు కూడా. సో ఎలాగూ అప్పు కోసం వెళ్లాం కదా అని శాంతి సినిమా కూడా రిలీజ్ చేసి ఉంటారని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. మరి నిజంగానే పాకిస్థాన్ భారత్ తో శాంతి కోరుకుంటోందా.
పాకిస్థాన్ చరిత్ర ఆద్యంతం ఉగ్రహింసను రాజేయడమే. విధ్వంసాలు ఎగదోసి మారణ హోమాలు సృష్టించడమే. శవాల గుట్టలు పోగేసి తమాషా చూడ్డమే. బిన్ లాడెన్ నుండి హఫీజ్ సయీద్ వరకు కరడుగట్టిన ఉగ్రరాక్షసులకు ఆశ్రయం ఇచ్చి మేపడమే. అటువంటి పాకిస్థాన్ కు హఠాత్తుగా శాంతి ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్పాలంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ప్రజల ఆకలి కేకలకు సమాధానం చెప్పడం కన్నా కూడా ఉగ్రవాద శిబిరాలకు డబ్బు దస్కం సమకూర్చడమే పాకిస్థాన్ కు ముఖ్యమని వారంటున్నారు.
పాకిస్థాన్ వైపు నుండి అసలు శాంతి సందేశం ఏ రూపంలో వచ్చినా అది స్వాగతించదగిందే. ఆ మాటకొస్తే పాకిస్థానే కాదు ఏ దేశమైనా సరే శాంతిని ఆకాంక్షిస్తే మంచిదే. కాకపోతే పాకిస్థాన్ వైపు నుండి అటువంటి మాటలు వినపడ్డమే కాస్త ఎబ్బెట్టుగానూ ఆశ్చర్యంగానూ అనిస్తోందని చెప్పక తప్పదు. పాకిస్థాన్ ను ఏ విధంగానూ కూడా నమ్మలేం. దుబాయ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాక్ ప్రధాని ఏం వల్లించారు. బాంబులు, ఆయుధాలపై ఖర్చు చేయడం వృధా అని తెలుసుకున్నాం అన్నారు. దాన్ని ఎలా నమ్మగలం. కొంత కాలంగా పాకిస్థాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
ప్రజలు తినడానికి గోధుమ పిండి దొరక్క అల్లాడి పోతున్నారు. రొట్టె చేసుకునే మార్గం లేని దుస్థితి. వంట గ్యాస్ పాలిథీన్ సంచుల్లో అమ్ముకుంటున్నారు. టీ పొడి దిగుమతి చేసుకోడానికి డబ్బుల్లేవని రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ టీ తాగరాదని ఆంక్షలు విధించుకున్నారు. గోధుమ పిండి దిగుమతి చేసుకోడానికి దేశంలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు సరిపోవని చేతులెత్తేశారు.
ఇంత దుర్భర పరిస్థితుల్లో ప్రజల ఆకలి తీర్చడానికి డబ్బులు లేవంటోన్న పాక్ పాలకులు ఎఫ్-16 యుద్ధ విమానాల విడిభాగాలను అమెరికా నుండి దిగుమతి చేసుకోడానికి మాత్రం డబ్బు ఇబ్బంది రాలేదు. ఈ వ్యవహారం అంతా ఇపుడు శాంతి పలుకులు పలుకుతోన్న షరీఫ్ గారి నాయకత్వంలోనే. ఆయన ప్రధానిగా పాలిస్తోన్న చోటనే. మరి వారి శాంతి ప్రవచనాలను నమ్మేదెలా. భారత్ తో శాంతి చర్చలు కావాలనుకున్న వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భారత అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అది మినిమమ్ కామన్ సెన్స్. కానీ పాక్ పాలకులకు అది కూడా లేదంటారు విశ్లేషకులు. భారత్ లో మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు షరీఫ్. నిజానికి పాకిస్థాన్ లో నిత్యం అక్కడి మైనారిటీలైన హిందువులతో పాటు అహ్మదీయులపైనా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాటి గురించి షరీఫ్ మాట్లాడరు.
గోముఖ వ్యాఘ్రంలా శాంతి కోసం పరితపిస్తున్నట్లు నీతి సూక్తులు వల్లించే షరీఫ్ పాక్ లో ఏం జరుగుతోందో మర్చిపోయినట్లున్నారు. పాకిస్థాన్ చరిత్రలో ఎప్పుడన్నా వారు శాంతి కోసం తపించారా. ప్రపంచాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టేసి నెత్తుటేరులు పారించే ఉగ్రవాద ముఠాలన్నింటికీ పాకిస్థానే కదా కర్మాగారం. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో హింసను రాజేయడమే అజెండాగా అల్ కాయిదా ను ముందుకు నడిపిన ఒసామా బిన్ లాడెన్ కు షెల్టర్ ఇచ్చి బిరియానీలు పెట్టి పోషించిందెవరు. భారత దేశంలో 90లలో అప్పటి బొంబాయి నగరంలో వరుస బాంబు పేలుళ్లతో అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్ర హింసకు సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం కు ఆశ్రయం ఇచ్చి రాచ మర్యాదలతో సాకుతోన్నది ఎవరు. కరడు గట్టిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ లు ఎక్కడ తలదాచుకున్నారు. పాక్ లో కాదా.
ముంబయ్ లోనే వరుస పేలుళ్లతో మారణాయుధాలతో విధ్వంసం సృష్టించిన ముఠా పాక్ నుంచే కదా భారత్ వచ్చింది.
తన పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ఉగ్రవాదానికి పాలు పోసి పెంచి పెద్ద చేసింది పాక్ సైనికాధికారులు కాదా?
అణువణువునా ఉగ్రహింసను నింపుకుని ఉన్న పాక్ పాలకులు తాము సృష్టించిన ఉగ్రఘాతుకాలు, మారణహోమాలు, నెత్తుటి హింసల విషయంలో ఏనాడూ ఎందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. మూడు యుద్ధాలు చేసి చేతులు కాల్చుకున్నాం అని వాపోయిన షరీఫ్ తమ ఉగ్ర అజెండాతో వందలాది మందిని పొట్టన పెట్టుకున్న హింస గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు. కశ్మీరు విషయంలో ఐక్యరాజ్యసమితి నిబంధనల చట్రంలో ఓ నిర్ణయం తీసుకోవాలని కశ్మీర్ లో మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ నిర్ణయం ఉండాలని షరీఫ్ అన్నారు. దానర్ధం ఏంటి అక్కడ రెఫరెండం పెట్టమనే కదా.
మరి పాకిస్థాన్ లో చాలా ఏళ్లుగా ప్రత్యేక దేశం కోసం బలూచిస్థాన్ పౌరులు పోరాటాలు చేస్తున్నారు. అక్కడ మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా షరీఫ్ నిర్ణయం తీసుకోగలరా. ఖైబర్ ఫక్తుంక్వా లో పాక్ తాలిబాన్ ఉగ్రవాదులు దాన్ని ప్రత్యేక రాజ్యంగా ప్రకటించారు. అక్కడ మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు పాక్ గౌరవం ఇస్తుందా. ముందుగా ఈ విషయాలను పాకిస్థాన్ ప్రధాని స్పష్టం చేయాలంటున్నారు విశ్లేషకులు. పాక్ ఆక్రమిత కశ్మీరులో ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు తమని తిరిగి భారత్ లో విలీనం చేయాలని వారు కోరుతున్నారు. దాని గురించి కూడా పాక్ ప్రధాని మాట్లాడ్డం లేదు. అందుకే పాకిస్థాన్ శాంతి కబుర్లలో నిజాయితీ లేదని భారతీయ మేథావులు అంటున్నారు. ముందుగా తమ దేశంలో అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాతనే భారత్ తో చర్చల గురించి ఆలోచించాలని వారు సూచిస్తున్నారు.