రహదారుల మీద సభలు, సమావేశాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో మీద ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెకేషన్ బెంచ్ డిఫాక్టో చీఫ్ జస్టిస్‌లా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. ప్రతి కేసును ముఖ్యమైనదిగా భావించుకుంటూ వెళ్తే హైకోర్టు ఏమైపోవాలి అసహనం వ్యక్తం చేశారు. ఇలా జరిగితే ప్రతి వెకేషన్ జడ్జి చీఫ్ జస్టిస్ అయిపోయినట్లే అని వ్యాఖ్యానించారు. కందుకూరు, గుంటూరు లో టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి పదకొండు మంది చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. ఈ జోవోను కొట్టివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన వెకేషన్ బెంచ్ 20 వరకు స్టే విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఆశ్రయించింది. అయితే హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి విచారించాలని ఆదేశించింది. ఆ కేసు ఇవాళ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సి.జె వెకేషన్ బెంచ్ తీరును తప్పు పట్టారు. ఈ పిటిషన్ మూలాల్లోకి వెళ్లి చూస్తే ఇది అర్జంటుగా విచారించాల్సిన అవసరం ఉందని అనిపించలేదన్నారు. ఈ పిటిషన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నానని అన్నారు. తనకేమీ తెలియదని అనుకోవద్దని రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు తనకు నివేదించిందని తెలిపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా తన అధికారాలను పూర్తిగా వినియోగిస్తానని స్పష్టం చేశారు. తన పిటిషణ్ స్వీకరించాలని వెకేషన్ బెంచ్ ముందు ధర్నా జరిగిందా. అంత అర్జంటుగా వెకేషన్ బెంచ్‌లో లంచ్ మోషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఎలాంటి అత్యవసరం లేనప్పుడు లంచ్ మోషన్ వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.